Farooq Abdullah: పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్..యుద్ధం వస్తే..ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్..!
కశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్ధితి ఉప్పూనిప్పుగా మారిపోయింది. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తుందా అనే అంశంపైనా స్పందించారు. దీంతో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
పాకిస్తాన్ ఓ విఫల రాజ్యమని ఫరూక్ అబ్దుల్లా తాజాగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడనంతవరకూ భారత్ తో ఆ దేశం సంబంధాలు మెరుగుపడవని ఆయన తెలిపారు. పాకిస్తాన్ పౌరులు కూడా భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం తీవ్ర పరిస్ధితులు ఉంటాయని హెచ్చరించారు. అయితే యుద్ధంపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఇరుదేశాల ప్రభుత్వాలే అన్నారు. యుద్ధం ఫైనల్ ఆప్షనా కాదా అనేది చెప్పలేనన్నారు.

పాకిస్తాన్ లో ఆర్మీ తప్పుకుని ప్రజా ప్రభుత్వం చేతికి పాలన వస్తే భారత్ తో ఆ దేశ సంబంధాలు మెరుగుపడతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ప్రజా ప్రభుత్వం వస్తేనే ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంటుందన్నారు. పాకిస్తాన్ ఓ విఫల రాజ్యమని, ఆ దేశ పాలకులు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి భారత్ తో యుద్ధ వాతావరణం కోరుకుంటున్నారని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. రెండు అణుదేశాల మధ్య యుద్దం వస్తే పరిస్ధితులు దారుణంగా ఉంటాయన్నారు.
రెండు దేశాలు యుద్ధభూమిలో ఒకరినొకరు ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ యుద్ధం జరగకూడదని ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పహల్గాం దాడి వెనుక ఉన్నవారిని , వారి సూత్రధారులను పట్టుకోవడానికి ఏదో ఒక మార్గం కనుక్కోవాలన్నారు. దీనిని (యుద్ధం) ఆపడంలో ప్రపంచం ఎంతవరకు విజయం సాధిస్తుందో, అది దేవుడికే తెలుసన్నారు.












Click it and Unblock the Notifications