మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి..
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు సరిహద్దు గోడను కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సీహోర్ జిల్లాలోని సల్కాన్పుర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా గోడను కారు ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..
మధ్యప్రదేశ్‌లో భోపాల్ డీఐజీ బంగ్లా ప్రాంతంలోని చౌక్సే నగర్లో పాండే కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబంలో ఐదు నెలల చిన్నారి కూడా ఉన్నాడు. ఇక, నిన్న (శుక్రవారం) అక్షయ తృతీయ సందర్భంగా తమ 5నెలల చిన్నారికి తలనీలాలు సమర్పించేందుకు ఆ కుటుంబమంతా కలసి సీహోర్లోని సల్కాన్పుర్లో ఉన్న బిజాసన్ మాత ఆలయానికి బయలుదేరారు. అక్కడ అమ్మావారి దర్శనం చేసుకుని, అనంతరం భైరవ లోయ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే సాయంత్రం 6గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హోషంగాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications