ఒకేసారి ఇంటర్ పాస్ అయిన తండ్రీకొడుకులు.. ఎక్కువ మార్కులు ఎవరికంటే ?
కవితకు కాదేది అనర్హం అన్నట్టే.. చదువుకోవాలి అనే సంకల్పం ఉంటే మనకు ఏది ఎప్పుడు అవరోధంగా కనిపించదు. ఈ విషయాన్ని నిరూపించి చూపించాడు పంజాబ్‌కు చెందిన అవతార్ సింగ్. 60 ఏళ్ల వయస్సులో ఓ వైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు తాను తలపెట్టిన కార్యాన్ని మొక్క ఓని దీక్షతో చేసి చూపించాడు. తన కుమారుడితో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే తన కుమారుడి కన్నా మూడు శాతంమార్కులు ఎక్కువ సాధించి ఔరా అనిపించాడు అవతార్ సింగ్. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బర్నాల నగరానికి చెందిన అవతార్ సింగ్ 1982లో పదో తరగతి పూర్తిచేశారు. కానీ అప్పటి కుటుంబ పరిస్థితులు కారణంగా చదువుని కొనసాగించలేకపోయారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ సమయం గడిపారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకొని జీవనాన్ని సాగిస్తూ గడుపుతున్నారు. ఆయన కుమారుడు కూడా కొన్నేళ్ల క్రితం పదో తరగతి పూర్తి చేసి.. ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా చేరారు.
ఇక రీసెంట్ గానే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని భావించిన కుమారుడు.. ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అదే సమయంలో అవతార్ సింగ్ కూడా మళ్లీ చదవాలనే కోరికతో తాను కూడా ఇంటర్ పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అయ్యాడు. ఓ వైపు పని చేస్తూనే.. తిరిగి వచ్చాక రాత్రిపూట ఇద్దరూ కలిసి చదువుకునే వారు. ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడమే కాకుండా తండ్రి 72 శాతం సాధించగా.. కొడుకు 69 శాతంతో పాస్ అయ్యాడు.
ఈ అనూహ్య ఘటనతో వారి కుటుంబ సభ్యులు సైతం ఒకింత షాక్ అవ్వగా.. తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పంజాబ్ యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications