కూతురిని సజీవంగా గోతిలో పాతిపెట్టిన తండ్రి
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలోని భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామంలో ఓ తండ్రి తన తొమ్మిదేళ్ల కన్న కూతురిని సజీవంగా గోతిలో పాతిపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను పోలీసులకు చిక్కాడు. అబుల్ హుస్సేన్ అనే వ్యక్తి ఆడపిల్లలంటే అసహ్యంతో ఆ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి వెనకాల ఉన్న పెరట్లో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు.
కూతురి రెండు చేతులూ కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి, ఛాతీ వరకు అమ్మాయిని పాతిపెట్టాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ఆ పనికి అతను ఒడిగట్టాడు. భార్య ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు కనిపించలేదు. దీంతో కంగారు పడిన తల్లి చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేసింది. అందరూ కలిసి గాలించడంతో ఇంటి వెనక ఉన్న పెరట్లో కూతురు కనిపించింది.

సగం వరకు పాతిపెట్టిన తర్వాత అతను కూతురు తలపై వెదురుతో తయారు చేసిన డ్రమ్మును పెట్టాడు. విషయాన్ని భార్య పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అబుల్ హుస్సేన్‌పై హత్యా ప్రయత్నం నేరం కింద కేసు నమోదు చేసారు.
ఆ సంఘటన త్రిపురలోని సిపాహిజల జిల్లా పుటియాలో చోటు చేసుకుందని పోలీసులు శనివారంనాడు చెప్పారు. బాలికను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications