పూరీ జగన్నాథుని ఆలయంలో అగ్నిప్రమాదం... 15మందికి తీవ్రగాయాలు..
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథుని ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్వామివారి ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులపై బాణసంచా నిప్పులు చెలరేగాయి. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడికి చందన ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోటపడ్డాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం నుంచి కొంతమంది తమనుతాము రక్షించుకునేందుకు పుష్కరిణిలోకి దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం హామీ ఇచ్చారు.

లక్షలాది మంది భక్తులు..
పూరీ జగన్నాథుని ఆలయంలో ప్రతి ఏడాది ఆషాడ శుద్ధ విదియ నాడు రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జగన్నాథుని దర్శనం కోసం విచ్చేస్తారు. ఇక, ఈ ఉత్సవం కోసం రెండు నెలల ముందు నుంచే రథాలను తయారుచేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. అలాగే, ఆలయంలో వైశాఖ బహుళ షష్ఠి రోజున స్వామివారికి చందనోత్సవం, జలక్రీడలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే అక్కడ బుధవారం చందనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications