ఒబామా వస్తున్నారని.. 600మందితో రోడ్లను కడిగిస్తున్నారు
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత పర్యటనలో భాగంగా సతీసమేతంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు రోడ్లను శుభ్రం చేసే పనిలో పడ్డారు. వాటిని అద్దంలా మెరిపించేందుకు సర్ఫ్ నీళ్లతో కడిగిస్తున్నారు. సాధారణంగా రోడ్లకు గుంతలుంటేనే పట్టించుకోని అధికారులు.. ఒబామా పర్యటన పుణ్యమాని రోడ్లను అద్దంలా మెరిపించే పనిలోపడ్డారు.
600 మంది కార్మికులతో ఈ పనులు చేయిస్తున్నారు. కాగా, పలు మీడియాల్లో రోడ్లను బ్రష్‌లతో శుభ్రం చేస్తున్న దృశ్యాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇది ఇలా ఉండగా మోకాళ్ల మీద నిలబడి.. నడుంవంచి ఒక రోజంతా ఈ పని చేస్తే తమకు కేవలం రూ. 300 మాత్రమే ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.

కాగా, ఒబామా దంపతులు తాజ్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా చిన్న కాగితం ముక్కగానీ, దుమ్ముగానీ ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా ఒబామా పర్యటన రోజు వరకు ఆవులు, గేదెలు, వీధి కుక్కలు కనపడకూడదని ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజ్‌మహల్‌ను ఆనుకుని ఉండే యమునా నదిలో పేరుకుపోయిన రెండు టన్నుల చెత్తను రెండు రోజుల్లో తీయించేశారు.
తాజ్‌మహల్ లోపలి భాగాలు, లాన్‌ను మహిళా కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఒబామా దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించే రోజు పర్యాటకులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇక తాజ్ చుట్టుపక్కల, ఆ కట్టడానికి వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్ల వారి మీద కూడా నిషేధాజ్ఞలున్నాయి. ఒబామా తాజ్ పర్యటన రోజు ఎవరూ బయటకు వెళ్లకూడదు, డాబా మీదకు వెళ్లకూడదు, బాత్రూంకైనా బయటకు వెళ్లకూడదు లాంటి నిబంధనలు పెట్టారని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications