ఆపరేషన్ సింధూర్ లో భారత్ కోల్పోయిన జెట్లు ఎన్ని ? విదేశీ మీడియా షాకింగ్ రిపోర్ట్స్..!
పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచింది. కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. దీనికి భారత్ అంగీకరించడంతో సరిహద్దుల్లో శాంతి నెలకొంది. అయితే ఈ ఆపరేషన్ సందర్భంగా ఐదు భారత యుద్దవిమానాల్ని తాము కూల్చేసినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటోంది. దీనిపై కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయినా నోరు విప్పలేదు. కానీ తాజాగా తిదళాధిపతి అనిల్ చౌహాన్ సింగపూర్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్ కొంత నష్టపోయిందని అంగీకరించారు. అయితే దీని వివరాలు వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో విదేశీ మీడియా, ఏజెన్సీలు భారత్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏం కోల్పోయిందో వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాల ఆధారంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్, మరో వార్తా సంస్థ సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ కూడా వివరాలు బయటపెట్టాయి. అయితే ఈ సంస్థలు అందించిన వివరాల్లో కొంత వ్యత్యాసం కూడా ఉంది.

పాకిస్తాన్ రక్షణ వర్గాలు చెప్పిన సమాచారం ఆధారంగా ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. వాటిలో మూడు రాఫెల్ జెట్‌లు, ఒక మిగ్-29, ఒక సూ-30ఎంకేఐ యుద్ధ విమానం ఉన్నాయి. భారత వైమానిక దళం నడుపుతున్న ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిందని ఓ ఉన్నత స్థాయి ఫ్రెంచ్ నిఘా అధికారి చెప్పినట్లు కూడా సీఎన్ఎన్ వెల్లడించింది.
మరోవైపు చైనా తయారీ పాకిస్తాన్ యుద్ధ విమానం కనీసం రెండు భారతీయ సైనిక విమానాలను కూల్చివేసిందని ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వెల్లడించింది. ఇలా కూల్చేసిన భారత జెట్ ఫ్రెంచ్ తయారీ రాఫెల్ అని మరో అధికారి చెప్పినట్లు పేర్కొంది. అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా పేరు చెప్పేందుకు ఇష్టపడని భారతీయ అధికారులను ఉటంకిస్తూ భారతదేశం కనీసం రెండు విమానాలను కోల్పోయిందని పేర్కొంది. అయితే, ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వల్ల కోల్పోయిన విమానాలలో దేనినీ గుర్తించకూడదని న్యూయార్క్ టైమ్స్ నిర్ణయించింది.

మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ ఒక పేరు చెప్పని ఫ్రెంచ్ నిపుణుడిని ఉటంకిస్తూ భారతదేశం మిరాజ్-2000, రాఫెల్ విమానాలను కోల్పోయి ఉండవచ్చని పేర్కొంది.పంజాబ్‌లోని భటిండాలో ఫ్రెంచ్ తయారు చేసిన రాఫెల్ యుద్ధ విమానం శిథిలాలను చూపించే మూడు వీడియోలను బీబీసీ వెరిఫైలో నిర్ధారించింది. అయితే విదేశీ మీడియా కథనాల ప్రకారం భారత్ 2 నుంచి మూడు యుద్ద విమానాలు కోల్పోయి ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications