
రాజ్యసభ రేసులో జగన్ సన్నిహితుడు మల్లాడి కృష్ణారావు-బీజేపీ అభ్యర్ధిగా తొలిసారి పోటీ
పుదుచ్చేరిలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి భారీగా ఫిరాయింపులు జరిగాయి. వీటి కారణంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అక్కడ తొలిసారి అధికారంలోకి రాగలిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కాషాయ పార్టీ భారీ హామీలిచ్చింది. వీటిలో పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన మల్లాడి కృష్ణారావుకు కూడా కీలక హామీ ఇచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడైన పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తొలిసారిగా తన ఎమ్మెల్యే, మంత్రి పదవులను వదిలిపెట్టి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన కేంద్రం పరిధిలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి ఖాళీ అయిన ఒకే ఒక రాజ్యసభ సీటుకు పోటీ పడబోతున్నారు. బీజేపీ అభ్యర్ధిగా మల్లాడి రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటివరకూ కేవలం ఎమ్మెల్యే, మంత్రిగానే పనిచేసిన మల్లాడి తొలిసారిగా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అదీ కాంగ్రెస్ లోనే తన జీవితమంతా గడిపిన మల్లాడి.. తొలిసారి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు.

ప్రస్తుతం పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ముఖ్యమంత్రిగా రంగసామి ఉన్నారు. ఆయన కోసం యానానం సీటును మల్లాడి త్యాగం కూడా చేశారు. అయినా రంగసామి అక్కడ ఓటమి పాలయ్యారు. స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. అయితే మరో సీటు నుంచి పోటీ చేసిన రంగసామి ఎమ్మెల్యే అయి సీఎం కాగలిగారు. దీంతో సీఎం రంగసామి కోసం యానాం సీటును త్యాగం చేసిన మల్లాడికి రాజ్యసభ సీటు ఇస్తామని అప్పట్లోనే బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో ఎన్నికల తర్వాత ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో పుదుచ్చేరి నుంచి మల్లాడిని నిలబెడుతోంది. ఆయన గెలుపు కూడా నల్లేరుపై నడకే కానుంది. ఎలాగో పుదుచ్చేరిలో తమకు ఉన్న మెజారిటీతో మల్లాడిని గెలిపించుకోగలమని బీజేపీ ధీమాగా ఉంది.
రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 15 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అలాగే 22న నామినేషన్లు వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించారు. 23న స్క్రూటినీ తర్వాత 27న ఉపసంహరణకు గడువిచ్చారు. వచ్చేనెల 4న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ అనంతరం అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. అక్టోబర్ 6వ తేదీన రాజ్యసభ ఎన్నికల్లో విజేతల ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది.