గడ్కరీ పైకి షూ విసిరిన వ్యక్తి, కేంద్రమంత్రికి తాఖీదు
పుణే: పుణే నగర పోలీసులు సోమవారం రాత్రి ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పైకి షూ విసిరివేసినందుకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నితిన్ గడ్కరీ పుణేలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యువకుడు గడ్కరీ పైకి షూ విసిరేశాడు. అయితే, అది కొద్దిగా మిస్ అయింది.
అక్కడే ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గడ్కరీ కోత్రూడ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడేందుకు సోమవారం వచ్చారు. బీజేపీ అభ్యర్థి మేధా కులకర్ణికి మద్దతుగా గడ్కరీ ప్రచారం ప్రారంభించారు. ఈ సమయంలో సంఘటన జరిగింది.
కాగా, షూ విసిరివేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతను తాగి ఉన్నాడని కోత్రూడ్ పోలీసులు తెలిపారు. అతనిని విచారిస్తున్నట్లు తెలిపారు. అతను ఎవరో తెలియాల్సి ఉందని చెప్పారు.

మరోవైపు లంచాలు తీసుకోవాల్సిందిగా గడ్కరీ ఓ ఎన్నికల సభలో ఓటర్లకు సూచించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు ఇచ్చింది. బుధవారం సాయంత్రంలోగా సమాధానం చెప్పని పక్షంలో ఆయన పరోక్షంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
రాబోయే పది రోజుల్లో మీకు లక్ష్మీదేవి దర్శనమవుతుందని, చాలామంది రూ.5వేలు చొప్పున అడుగుతున్నారని, ద్రవ్యోల్భణం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఎంత కావాలంటే అంత తినండని, కోరుకున్నది తాగండని, అక్రమార్జన సొమ్ము పేదలను చేరే సమయమిదేనని, అందువల్ల లక్ష్మీదేవి వస్తానంటే వద్దవద్దని, అయితే ఓటు వేసేటప్పుడు తెలివిగా ఆలోచించి, మహారాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. దీని పైన కాంగ్రెస్, ఎన్సీపీలు ఈసికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈసీ తాఖీదులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications