• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాంబూసియా ఫిష్: ఈ చేపలు పెంచితే దోమలు మాయం

By BBC News తెలుగు
|

గాంబూసియా చేపలు

గాంబూసియా అఫినిస్ అనేది ఒక రకం చేప. దీన్నే మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. వర్షాకాలంలో పెరిగే దోమల బెడదకు ఈ చేపలతో చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది విశాఖ కార్పొరేషన్. దోమల నివారణకు వీధుల్లో రసాయనాలతో కూడిన పొగను వదలడం వంటి పనుల కన్నా ఈ చేపలతో దోమల సమస్యను ఎదుర్కోవడం మెరుగ్గా ఉంటుందని, ఖర్చు కూడా తక్కువేనని కార్పొరేషన్ చెబుతోంది.

ఇంతకీ, గాంబూసియా చేపలకు, దోమలకు సంబంధం ఏంటి? ఈ దోమ చేపలను పెంచడం వల్ల దోమల బెడద ఎలా తగ్గుతుంది?

మస్కిటో ఫిష్

గాంబూసియా చేపల స్వస్థలం దక్షిణ అమెరికా. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి రోగాలకు కారణమయ్యే దోమలను నియంత్రించడంలో ఈ చేపలు ఉపయోగపడతాయి.

ఎలా అంటే, ఈ జాతి చేపలు దోమల లార్వా, ప్యూపాలను తింటాయి. చెరువులు, కొలన్లు, నీటి గుంటల్లోనే ఎక్కువగా దోమల లార్వా ఉండటంతో అక్కడ ఈ చేపలను వదులుతారు. ఆక్సిజన్ పిల్చుకునేందుకు లార్వా నీటిపైకి వస్తుంది. ఆ సమయంలోనే ఈ గంబుసియా చేపలు లార్వా మొత్తాన్ని తినేస్తాయి. అయితే, ఈ చేపలు కూరవండుకుని తినడానికి పనికిరావు.

"గాంబూసియా చేపలు దోమల లార్వాలను తింటాయి. వీటి సైజు చాలా చిన్నగా ఉండటం వలన వేగంగా ఈదుతాయి. వీటిలో ఆడ చేపలు ఏడు సెంటీమీటర్లు, మగవి కేవలం 4 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. ఇక పిల్ల చేపలైతే కేవలం 8 నుంచి 9 మిల్లీమీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. ఇవి ఓ దశ వరకు రోజుకు 0.2 మిల్లీమీటర్లు పెరుగుతాయి. చిన్నచిన్న గుంట్లల్లో కూడా ఇలా సులభం పెరుగుతాయి. ప్రస్తుతం జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో నీటి వనరులు అందుబాటులో ఉన్న చోట్ల ఈ గంబుసియా చేపల పెంపకాన్ని చేపడుతున్నాం. లక్ష చేపల పెంపకమే లక్ష్యంగా పెట్టుకున్నాం." అని జీవీఎంసీ బయోలజిస్ట్ వి. వరహాలు దొర బీబీసీతో చెప్పారు.

గంబుసియా చేపలు

ఒక చేప... వంద లార్వాలు

గాంబూసియా చేప ద్వారా దోమల నివారణ చేయడం అనేది ముందుగా ఈ చేప జన్మస్థలమైన దక్షిణ అమెరికాలో మొదలైంది. జ్వరాలకు కారణమయ్యే దోమలను హరించివేయడంలో ఈ చేప మెరుగైన ఫలితాలు చూపిస్తోంది. దాంతో, ప్రపంచంలోని అన్నీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ చేపను ఉపయోగిస్తున్నారు.

"గాంబూసియా చాలా ప్రత్యేకమైనది. ఇది గుడ్లను తన పొట్టలోనే పొదుగుతుంది. 75 నుంచి 90 రోజుల మధ్య పిల్లల్ని బయటకు విడుదల చేస్తుంది. లార్వా కంట్రోల్ చేయడంలో గాంబూసియా ఫిష్ పనితీరు బాగుంటుంది. చిన్న చిన్న నీటిగుంటల్లో కూడా ఈ చేప పెరుగుతోంది. దోమల లార్వాలు ఎక్కువగా పెరిగేది కూడా ఇక్కడే. ఇటువంటి కుంటల్లో మిగతా చేపలు పెరగవు. కానీ ఈ చేపలు మాత్రం దోమల లార్వాలు తింటూ జీవిస్తాయి. ఒక్కో చేప రోజుకు వంద వరకు దోమల లార్వాలను తింటాయి. ఆక్సిజన్ తీసుకోవడానికి లార్వా నీటి ఉపరితం మీదకు వచ్చే సమయంలో గంబుసియా ఆ లార్వాలను తింటుంది" అని వరహాలు దొర తెలిపారు.

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపల పెంపకం

విశాఖలో దోమల బెడద ఎక్కువ. విశాఖ నగరంలో సగ భాగం మెట్రో నగర స్థాయిలో మెరిసిపోతూ ఉంటే, మిగతా సగ భాగం మురికివాడలతో నిండిపోయింది. ఇక్కడ స్లమ్ ఏరియాలు చాలా ఎక్కువ. అలాగే నగర జనాభా 23 లక్షలకు చేరడంతో జనసాంద్రత కూడా బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలో జూన్ నెల మొదలైనప్పటి నుంచీ నాలుగు నెలల వరకూ ఏటా ప్రజలు దోమలతో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో దోమ కాట్ల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా అధిక సంఖ్యలో వస్తుంటాయి. వీటిని నివారించాలంటే దోమల నివారణ ఒక్కటే మార్గం.

"గాంబూసియా చేపలతో జీవీఎంసీ చేస్తున్న దోమల నివారణ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంది. అందుకే ఈ చేపలను పెద్ద సంఖ్యలో పెంచుతున్నాం" అని జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీఎస్ఎల్ జి శాస్త్రి బీబీసీతో చెప్పారు.

"విశాఖలో పలు ప్రాంతాల్లోని పాండ్స్‌లో లక్ష చేపల వరకు పెంచుతున్నారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వివిధ పాండ్స్‌లో పెంచిన ఈ చేపలను నగరంలో ప్రధానంగా దోమల లార్వాలు ఎక్కువగా ఉంటున్న 20 కొలనులు, చెరువుల్లో వీటిని విడుదల చేస్తున్నారు. పెద్ద మొత్తంలో దోమల లార్వాలను ఈ చేపలు తినడం ద్వారా దోమల నివారణ సాధ్యమవుతోంది" అని శాస్త్రి బీబీసీతో చెప్పారు.

బడ్జెట్ ఫిష్

సాధారణంగా దోమల లార్వాలను చాలా చేపలు తింటాయి. కానీ, ఈ పనిలో గాంబూసియా ప్రత్యేకత వేరు. నీటిలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటే అక్కడ ఇతర చేపలు జీవించలేవు. కానీ గంబుసియా జీవించగలదు. అలాగే వేడి వాతావరణంలో చాలా చేపలు ఉండలేవు. కానీ, ఈ చేపలు వేడిని తట్టుకుని, చిన్నిచిన్న కుంటల్లో కూడా జీవిస్తాయి.

ఎటువంటి వాతావరణంలోనైనా జీవించే చేపలు ఇవి. సముద్రంలో పెద్ద చేపల నుంచి రక్షణ కోసం ఈ చేపలు తక్కువ లోతు ఉన్న చోట జీవిస్తుంటాయి. వీటి జీవితకాలం రెండు నుంచి నాలుగేళ్లు.

"బడ్జెట్ లో దోమల నివారణ చేయాలంటే గంబుసియా చేపకు మించిన ఆప్షన్ మరొకటి లేదు. జ్వరాల నియంత్రణలో భాగంగా గాంబూసియా చేపలను ప్రధాన ఆస్త్రంగా వాడుతున్నాం. ఈ చేపల పెంపకానికి ఖర్చు కూడా చాలా తక్కువే. నాలుగు వారాలకు రెండు వందల వరకూ పిల్లలను ఆడ గంబుసియా చేప పెడుతుంది. దోమలు ఎక్కువగా లార్వాలను గుంటల్లోనూ, చెరువుల్లోనూ, కొలనుల్లోనూ పెడతాయి. అటువంటి చోట్ల గాంబూసియా చేపలు రోజూ లార్వాలను తినేయగలవు. లార్వా నియంత్రణకు గాంబూసియా చేపను విడుదల చేసే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం" అని శాస్త్రి తెలిపారు.

గాంబూసియా చేపలు వేడిని తట్టుకుని, చిన్నిచిన్న కుంటల్లో కూడా జీవిస్తాయి.

కరోనాకు తోడు, జ్వరాలు కూడా..

జూన్ నుంచి ఆగష్టు వరకు సీజనల్ జ్వరాలు ప్రబలే సమయం. దీంతో జీవీఎంసీ అధికారులు సాధారణ జ్వరాలకు కారణమైన దోమల నియంత్రణపై దృష్టి పెట్టారు. ఇప్పుడు కరోనా కూడా ఉండటంతో, జ్వరం వస్తే అది కరోనా జ్వరమో, సాధారణ జ్వరమో తేల్చుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు, వైద్యులు చెబుతున్నారు.

"కరోనా తగ్గుతున్న సమయంలోనే మలేరియా, డెంగ్యూ జ్వరాలు సంఖ్య పెరుగుతోంది. విశాఖలో ఇప్పటీకే 50 డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి జ్వరం వస్తే అది కరోనా జ్వరమా, ఇతర రకమైన జ్వరంమా అనేది కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుంగా చాలా వరకు నివారించవచ్చు. మీ ప్రాంతాల్లో మురికి గుంటలు, కొలను ఉంటే అధికారులకు చెప్తే అక్కడ గాంబూసియా చేపలను విడుదల చేస్తాం" అని శాస్త్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gambusia fish: If these fish are raised, mosquitoes will eat them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X