రేప్ ఇష్యూ: కాంగ్రెసుకు దొరికిపోయిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: డానిష్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ గురువారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఇలాంటి ఘటనను నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేపట్టిన పార్టీ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఆప్ పార్టీ ఇలాంటి ఘటనలపై అధ్యయనం జరగాలని అంటోందని విమర్శించారు.
ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇప్పుడు అధ్యయనాలంటూ తన బాధ్యతను పక్కనపెడుతున్నారని అర్విందర్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి ఘటననే టార్గెట్ చేసుకున్న కేజ్రివాల్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని ఆయన అన్నారు. డానిష్ మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన కాంగ్రెసుకు అంది వచ్చింది. ఆప్‌పై విమర్శలు ఎక్కు పెట్టడానికి అవకాశాన్నిచ్చింది.

అత్యాచారం లాంటి ఘటనపై తాము రాజకీయం చేయదల్చుకోలేదని సింగ్ తెలిపారు. సామూహిక అత్యాచారంపై సంపూర్ణ విచారణ జరిపి, అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, హోంమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్, పోలీసులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
జనవరి 14న డానిష్ మహిళపై దాడి చేసిన కొందరు దుండగులు ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులను, డబ్బును దోచుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయపై అత్యాచారం సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెసు పార్టీని, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను లక్ష్యం చేసుకుని తీవ్ర విమర్శలు చేసింది.












Click it and Unblock the Notifications