మీలాగా సీఎం అవుతా.. గౌహతి తీసుకెళ్తారా? షిండేకు బాలిక షాకింగ్ ప్రశ్నలు.. వీడియో వైరల్!!
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఓ చిన్నారి బాలిక ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. ఒక బాలిక ఆయనను విచిత్రమైన పరిస్థితికి లోను చేసింది. తాను కూడా సీఎం కావాలని అనుకుంటున్నానని, వరద బాధిత ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్న బాలిక ఏక్‌నాథ్ షిండేను ఏకంగా గౌహతి తీసుకు వెళతారా ? అంటూ ప్రశ్నించింది. ఇక ఈ ఆసక్తికరమైన సంఘటన ముంబైలోని నందన్ వన్ బంగ్లాలో చోటుచేసుకుంది.
ఏక్‌నాథ్ షిండేను కలిసిన బాలిక సీఎం ఎలా అవ్వాలంటూ ప్రశ్న
ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసిన అన్నడా దామ్రే అనే చిన్నారి మీలాగా సీఎం కావడం ఎలా అంటూ ఆయనను నేరుగా ప్రశ్నించింది. షిండే అంకుల్ నేను సీఎం అవుతా అన్న బాలిక .. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీళ్ళల్లో నడిచారని, మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం కోసం నేను కూడా ముఖ్యమంత్రిని అవ్వగలనా అంటూ ప్రశ్నించింది.

గౌహతికి తీసుకెళ్ళమన్న బాలికకు షిండే సమాధానం
దీపావళి సమయంలో తనను గౌహతికి తీసుకెళ్లమని కూడా ఆమె మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను అభ్యర్థించింది. దానికి ఏక్‌నాథ్ షిండే, తప్పకుండా, మనం వెళదామని బదులిచ్చారు. చిన్నారి మాటలకు సీఎం షిండే నవ్వుతూ నువ్వు ముఖ్యమంత్రివి కచ్చితంగా అవుతావు, అందుకోసం ఒక తీర్మానం కూడా పాస్ చేస్తామంటూ పేర్కొన్నారు. దీపావళికి గౌహతికి తీసుకెళ్తానని అక్కడ ఉన్న కామాఖ్య గుడికి వెళదామా అంటూ షిండే ప్రశ్నించడంతో బాలిక అలాగే అంటూ సమాధానం ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ చిన్నారి చాలా తెలివి గలది, కచ్చితంగా సీఎం అవుతుంది అంటూ ఏక్‌నాథ్ షిండే చెప్పడంతో గదిలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వులతో సందడి చేశారు. తెలిసీ తెలియని వయసులో సీఎం కావాలని, అందుకు గౌహతి వెళ్లాలని చిన్నారికి వచ్చిన ఆలోచనకు అక్కడి వారు అవాక్కయ్యారు. గౌహతి వేదికగా పావులు కదిపిన షిండేకు, చిన్నారి గౌహతి తీసుకెళ్తారా అని అడిగిన ప్రశ్న, సీఎం కావాలని చెప్పిన చిన్నారి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గౌహతి వేదికగా రాజకీయం.. ఆపై సీఎం అయిన షిండే..
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి గత నెలలో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతిలో ఏక్‌నాథ్ షిండే తో చేరడంతో మొత్తం 8 రోజుల ఉత్కంఠ తర్వాత చివరకు జూన్ 29న ఠాక్రే అత్యున్నత పదవి నుండి వైదొలిగారు. జూన్ 30న ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించి మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications