ప్రియుడు సూసైడ్ చేసుకుంటే..ప్రియురాలిని శిక్షించలేం : ముంబయి కోర్టు సంచలన తీర్పు
ప్రేమికుని ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రియురాలిని శిక్షించలేమని ముంబయి సెషన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పడు ఇదే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రియురాలు చేసింది నైతికంగా తప్పే అయినప్పటికీ భారతీయ శిక్షా స్మృతిలో ఆమెను శిక్షించడానికి ఎలాంటి చట్టాలు లేవని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే...ముంబయికి చెందిన మనీషా చూడాసమ, నితిన్ కేనీ అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అయితే, వీరివురి మధ్య మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. కానీ, నితిన్ కేనీ మనీషాను మరిచిపోలేకపోయాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె వెంట పడసాగాడు. అదే సమయంలో మనీషా రాజేష్ పన్వర్ అనే మరో యువకుడితో ప్రేమలో పడింది.

ఆ విషయం తెలుసుకున్న నితిన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. చివరికి 2016 జనవరి 15న సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నితిన్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో నితిన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మనీషా, రాజేష్‌లను నిందితులుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు.
నైతికంగా తప్పే అయినప్పటికీ...
ముంబయి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్పీ మెహతా నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తి కేసు పూర్వపరాలను పరిశీలించి మనీషా, రాజేష్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఇష్టం వచ్చినట్టు ప్రియుడ్ని మార్చడం నైతికంగా తప్పే అయినప్పటికీ, ప్రియుడి ఆత్మహత్యకు ప్రియురాలు కారణమని కేసు పెట్టే అవకాశం లేదు.
భాగస్వామి మార్చుకున్నంత మాత్రాన ఆమెను బాధ్యురాలిగా చేయలేం. భాగస్వామి ఏ కారణం లేకుండా సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తే ఒక వ్యక్తి మానసికంగా క్షోభకు గురవుతాడు. ప్రేమలో విఫలమైన మానసిక గాయం కారణంగా ఒక భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే ఈ కేసును IPC 306లోని 107 కిందకు తీసుకురాలేం.. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భావించలేం'' అని స్పష్టం చేశారు. ఈ కారణాలతో మనీషా, రాజేష్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ ఫిబ్రవరి 29న తీర్పును వెల్లడించారు.












Click it and Unblock the Notifications