వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Global Hunger Index: ఆకలిలో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ అధ్వాన్న స్థితిలోకి ఎలా దిగజారింది, కేంద్రం ఏమంటోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నరేంద్ర మోదీ

ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)-2022లో భారత్ స్థానం దిగజారింది. తాజాగా విడుదలైన ఈ నివేదికలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ తక్కువ ర్యాంకులో నిలిచింది.

మొత్తం 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ జాబితాలో పాకిస్తాన్ 99వ ర్యాంకులో నిలిచింది. తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోన్న శ్రీలంక, దక్షిణాసియాలోనే అత్యుత్తమ స్థానంలో ఉంది. జీహెచ్ఐలో శ్రీలంక 64వ స్థానాన్ని దక్కించుకోగా, నేపాల్ 81, బంగ్లాదేశ్ 84వ ర్యాంకులో ఉన్నాయి.

భారత్ పొరుగు దేశాల్లో ఒక్క అఫ్గానిస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాలు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. అఫ్గాన్ 109వ ర్యాంకులో నిలిచింది.

అయితే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ)లో భారత్‌కు 107వ ర్యాంక్ రావడంపై మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ రిపోర్టులో ఆకలిని గణించే కొలమానాలు సరిగా లేవని, తప్పుడు ప్రమాణాలతో భారత్‌ను చెడుగా చిత్రించారని ప్రకటించింది. భారత ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ ప్రకటనలో ఏముంది ?

''ఒక దేశంగా దాని జనాభా ఆహార భద్రత, పోషక అవసరాలను తీర్చలేని స్థితిలో ఉందంటూ భారత దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఈ నివేదిక ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక తప్పుడు సమాచారంతో నిండి ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2022 నివేదికను కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హిల్ఫ్ అనే ఐర్లాండ్, జర్మనీ దేశాలకు చెందిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. కానీ, ఈ రిపోర్టులో ఆకలిని కొలిచే విధానం సరిగా లేదు. హంగర్ ఇండెక్స్‌కు సంబంధించి నాలుగు ప్రమాణాలలో మూడు ప్రమాణాలు కేవలం పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి. ఇవి మొత్తం జనాభాను ప్రతిబింబించకపోవచ్చు'' అని పేర్కొంది. "ఈ మొత్తంలో జనాభా పోషకాహార లోప నిష్పత్తి సూచిక చాలా కీలకమైంది. కానీ, ఇది కేవలం 3వేలమంది నుంచి తీసుకున్న శాంపిల్ నివేదిక'' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ సర్వే మాడ్యూల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)కు చెందిన ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఎక్స్‌పీరియన్స్ స్కేల్ (FIES) ఆధారంగా రూపొందించారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఇది గ్యాలప్ వరల్డ్ పోల్ ద్వారా జరిపిన 'అభిప్రాయ సేకరణ' అని , ఇందులో కేవలం 3,000 మంది నుంచి 8 ప్రశ్నలకు సమాధానం రాబట్టారని, ఇది చాలా చిన్న శాంపిల్ సర్వే అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఎక్స్‌పీరియన్స్ స్కేల్ ద్వారా భారతదేశంలాంటి దేశపు పోషకాహార లోపాన్ని గణించడం తప్పు మాత్రమే కాదు, అనైతికమని, ఇది స్పష్టమైన పక్షపాత ధోరణి ప్రభుత్వం పేర్కొంది.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హిల్ఫ్ అనే సంస్థ నివేదికను విడుదల చేయడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఈ నివేదిక వాస్తవికతకు దూరంగా ఉండటమే కాకుండా, తన ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో అందించిన సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించింది" అని ఆ ప్రకటన పేర్కొంది.

ప్రపంచ ఆకలి సూచీ

ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) అంటే ఏంటి?

ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) అనేది ప్రపంచవ్యాప్తంగా ఆకలి స్థాయిలను కొలుస్తుంది.

మొత్తం పోషకాహార లోపం, శిశువుల్లో తీవ్ర పోషకాహార లోపం, వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాల రేటు అనే నాలుగు సూచికల ఆధారంగా జీహెచ్‌ఐని కొలుస్తారు.

జీహెచ్‌ఐలో 100 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల ఆధారంగా దేశాల ఆకలి తీవ్రత స్థాయిని పేర్కొంటారు. ఉదాహరణకు ఏదైనా దేశం స్కోరు 'సున్నా'గా ఉందనుకోండి. అంటే ఆ దేశం మెరుగైన స్థాయిలో ఉన్నట్లు. అక్కడ ఆకలి స్థాయిలు తక్కువ అని అర్థం. ఏదైనా దేశం స్కోరు 100 అనుకుంటే, ఆ దేశంలో ఆకలి స్థాయిలు చాలా తీవ్రంగా ఉన్నట్లు లెక్క.

తాజా జాబితాలో భారత్ స్కోరు 29.1గా ఉంది. అంటే చాలా తీవ్రమైన ఆకలి స్థాయిలు ఉన్న కేటగిరీలో భారత్ నిలిచింది.

మరో 17 అగ్ర దేశాలు 5 పాయింట్ల కంటే తక్కువ స్కోరును సాధించాయి. ఇందులో చైనా, తుర్కియే, కువైట్, బెలారస్, ఉరుగ్వే, చిలీ దేశాలు ఉన్నాయి.

ఇక ముస్లిం మెజారిటీ దేశాలలో యూఏఈ 18, ఉజ్బెకిస్తాన్ 21, కజిక్‌స్తాన్ 24, ట్యూనీషియా 26, సౌదీ అరేబియా 30వ ర్యాంకులో నిలిచాయి.

ప్రపంచ ఆకలి సూచీ

భారత్ పరిస్థితి ఏంటి?

ప్రపంచ ఆకలి సూచీని కొలిచే నాలుగు ప్రమాణాల్లో 'చిన్నారుల్లో తీవ్ర పోషకాహారలోపం' అనే అంశం కూడా ఒకటి. 2014లో చిన్నారుల్లో పోషకాహారలోపం 15.1 శాతంగా ఉండగా, తాజా జాబితాలో ఇది 19.3 శాతానికి పెరిగింది. అంటే భారత్ ఈ అంశంలో మరింత వెనుకబడినట్లు అర్థం.

పౌష్టికాహార లోపం కూడా దేశంలో గణనీయంగా పెరిగినట్లు తాజా జాబితా సూచిస్తోంది.

జీహెచ్‌ఐ ప్రకారం, భారత్‌లో పౌష్టికాహారలోపం 2018-2020 మధ్య 14.6 శాతంగా ఉండగా... 2019-2021 మధ్య ఇది 16.3 శాతానికి పెరిగింది.

దీని ప్రకారం ప్రపంచంలోని మొత్తం 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా, ఇందులో 22.4 కోట్ల మంది భారత్‌కు చెందినవారు.

అయితే, ఈ సూచీలో భారత్ రెండు అంశాల్లో వృద్ధి సాధించింది. చిన్నారుల వికాసానికి సంబంధించి భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

చిన్నారుల మరణాల రేటు 4.6 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది.

అయితే, జీహెచ్‌ఐ మొత్తం స్కోరులో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2014లో భారత్ స్కోరు 28.2 పాయింట్లు ఉండగా, 2022లో ఇది 29.1కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆకలి స్థాయి ఇటీవలి సంవత్సరాల్లో స్థిరంగా ఉంది. తాజా నివేదికలో మొత్తం ప్రపంచం ఆకలి స్థాయిలు 'మధ్య శ్రేణి'లో ఉన్నాయి. 2014లో ప్రపంచవ్యాప్తంగా ఆకలి స్థాయిల స్కోరు 19.1గా ఉండగా, 2022 నాటికి 18.2కి తగ్గింది.

భారత్ సహా మొత్తం 44 దేశాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా జాబితా తెలిపింది.

నరేంద్ర మోదీ

మోదీ ప్రభుత్వంపై విమర్శలు

ప్రపంచ ఆకలి సూచి నివేదిక వెలువడిన తర్వాత కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు రావడం మొదలయ్యాయి.

మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం దీనిపై ట్వీట్ చేశారు. ''పౌష్టికాహార లోపం, ఆకలి, చిన్నారుల్లో తీవ్ర పోషకాహారలోపం వల్ల వచ్చే సమస్యలపై గౌరవనీయ ప్రధానమంత్రి ఇంకెప్పుడు దృష్టి సారిస్తారు'' అని ఆయన ట్వీట్‌లో ప్రశ్నించారు.

https://twitter.com/PChidambaram_IN/status/1581120764140351488

భారత్‌లోని 22.4 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు అంచనా. 121 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ చివర్లో 107వ ర్యాంకులో నిలిచిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దక్షిణాసియా దేశాల్లో భారత్ కంటే ఒక్క అఫ్గానిస్తాన్ మాత్రమే దిగువ స్థానంలో ఉందని సీపీఎం నాయకుడు, కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ట్వీట్ చేశారు.

https://twitter.com/drthomasisaac/status/1581122223338704896

''2015లో భారత్ ర్యాంక్ 93. చిన్నారుల్లో పోషకాహారలోపం అంశంలో భారత్ స్థితి దిగజారింది. 19.3 శాతానికి చేరుకుంది. ప్రపంచంలో ఇదే అత్యధికం'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంక్ ప్రమాదకరంగా, వేగంగా దిగజారిందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరీ ట్విటర్‌లో అన్నారు.

https://twitter.com/SitaramYechury/status/1581133717061320704

''భారత్‌కు మోదీ ప్రభుత్వం వినాశకరం. ఎనిమిదిన్నరేళ్లలో దేశాన్ని ఇంత అంధకారంలోకి తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి'' అని ఆయన ట్వీట్ చేశారు.

కేశవ్ పంథి అనే ట్విటర్ యూజర్, బీజేపీ నాయకుడు తేజిందర్ పాల్ సింగ్ బగ్గా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... ''మీ చెత్త రాజకీయాల వల్లే ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 107వ ర్యాంకులో నిలిచింది'' అని వ్యాఖ్యను జోడించారు.

https://twitter.com/iamkeshavpanthi/status/1581134008037298176

ప్రపంచ అయిదో పెద్ద ఆర్థికవ్యవస్థ భారత్

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారత్, బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, భారత్ 2022 మార్చి చివర్లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డేటా ఆధారంగా బ్లూమ్‌బర్గ్ ఈ నిర్ధారణకు వచ్చింది.

ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7బిలియన్ డాలర్లు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 816 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ డేటా తెలిపింది.

2022లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.

2023లో ఇది మరింత దిగజారి 6.1 శాతానికి చేరుతుందని కూడా ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని కూడా ఆ నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Global Hunger Index: How did India fall worse than Pakistan, Sri Lanka and Bangladesh in terms of hunger, what does the Center say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X