గోవా ఎన్నికల్లో దీదీ దూకుడు; టీఎంసీ-ఎంజీపీ కూటమి నుండి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: టీఎంసీ ఎంపీ
ఫిబ్రవరిలో జరగనున్న గోవా ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ గోవా రాజకీయ సమీకరణాలను మార్చే పనిలో పడ్డారు.

గోవా ఎన్నికలపై టీఎంసీ ఫోకస్ ... బీజేపీని గద్దె దింపటమే లక్ష్యం
ఇప్పటికే గోవా రాజకీయాలలో టీఎంసీ కీలకంగా మారుతుంది. కాంగ్రెస్ నుండి రాజీనామా చేసిన నేతలు టీఎంసీలో చేరుతున్నారు. అలాగే టీఎంసీతో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ పొత్తు పెట్టుకోవటం కూడా గోవా రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. బీజేపీని ఓడించాలని, బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగింది టీఎంసీ. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ (TMC), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ పొత్తులలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికలలో పోరాడుతుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో టీఎంసీ పొత్తు
కోస్తా రాష్ట్రంలో తమ ప్రధాన ఎన్నికల ప్రణాళికగా సుపరిపాలన అందించబడుతుందని పేర్కొంది. 2022 ప్రారంభంలో జరగనున్న 40 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ గోవాలోని పురాతన ప్రాంతీయ సంస్థ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా తృణమూల్ కాంగ్రెస్ యొక్క గోవా ఇంచార్జ్ ఎంపీ మహువా మొయిత్రా దక్షిణ గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, తద్వారా ఎన్నికలకు వెళ్తాము అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టం చేశారు.

కూటమి పార్టీలతో చర్చించి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
కూటమి భాగస్వాములతో సమాలోచనలు జరిపిన తర్వాత గోవాలో అత్యున్నత పదవి ముఖ్యమంత్రికి టీఎంసీ అభ్యర్థిని ప్రకటిస్తామని మొయిత్రా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన లోక్‌సభ ఎంపి అధికార బిజెపిపై విరుచుకుపడ్డారు మరియు గోవా ప్రజలలో మత విబేధాలను నాటుతున్నారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ పోరాటం (బీజేపీతో) మాత్రమే కాదు, నైతిక పోరాటం కూడా, అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. బిజెపి దేశంలో మత సామరస్యాన్ని నాశనం చేస్తోందని, ఇది కర్ణాటకలో క్రిస్‌మస్ వేడుకలకు విఘాతం కలిగించడం వంటి ఇటీవలి సంఘటనలలో ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ ను వీడి టీఎంసిలో చేరిన కారణం చెప్పిన ఫిరాయింపు నేతలు
కాంగ్రెస్‌ను వీడి ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ మరియు స్థానిక నాయకుడు అలెక్సో రెజినాల్డో లారెన్కోతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. సుస్మిత దేవ్ మాట్లాడుతూ, తాను మరియు లారెన్కో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, అయితే బిజెపితో పోరాడే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి లేనందున తాము పార్టీని వీడి టీఎంసీలో చేరామని వెల్లడించారు. సుపరిపాలన రాజకీయాలు చేసేందుకే టీఎంసీ గోవాకు వచ్చిందని సుస్మితా దేవ్ పేర్కొన్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, గోవా అభివృద్ధికి పాటుపడే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications