కూతురే దగ్గరుండి మరీ.. 'అమ్మకు ప్రేమ వివాహం' జరిపించింది

Subscribe to Oneindia Telugu

కేరళ : 32 ఏళ్ల తర్వాత సుఖాంతమైన ఓ సుదీర్ఘ నిరీక్షణ ఇది. ప్రేమ విఫలమై ఎవరి దారుల్లోకి వారు వెళ్లిపోయాక.. తాగుబోతు భర్తతో ఆమె..! పెళ్లి ప్రస్తావనే మరిచిపోయి రాజకీయాల్లో మునిగిపోయిన ఆయన..! దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి ఒక్కటయ్యారు. అదీ.. ఆమె కూతుళ్లు చూపించిన చొరవతోనే.

తల్లి ప్రేమించిన వ్యక్తితో ఆమెకు దగ్గరుండి మరీ వివాహం జరిపించింది కేరళకు చెందిన అథిరా అనే ఓ కూతురు. విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం కేరళ అంతటా ఈ పెళ్లి ఓ హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయమేంటంటే.. 1984లో కేరళలోని ఒచిరాకు చెందిన అనిత, విక్రమన్ ప్రేమించుకున్నారు. అనిత ఆ సమయంలో 10వ తరగతి చదువుతుండగా.. ఆమె కంటే ఎనిమిదేళ్లు పెద్దయిన విక్రమన్ సీపీఐ నేతగా అటు రాజకీయాల్లోను, ట్యూటర్ గాను పనిచేస్తుండేవారు. అయితే వయసులో పెద్దవాడు, ఓ సీపీఐ నేత అయిన అతన్ని కూతురు ప్రేమించడం సహించలేకపోయాడు అనిత తండ్రి.

దీంతో వెంటనే అనితను స్కూల్ ను మానిపించేసి.. విక్రమన్ ను మరిచిపోవాల్సిందిగా కూతురుని హెచ్చరించాడు. ఒకవేళ తాను విక్రమన్ నే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే.. అతని లైఫ్ కే డేంజర్ అని హెచ్చరించాడు. దీంతో మనసు చంపుకుని తండ్రి మాటలకు కట్టుబడ్డ అనిత, ఇక అప్పటినుంచి విక్రమన్ ను కలవడం మానేసింది.

Going Viral: Kerala woman plays Cupid for her mother

ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు వివాహం జరగడంతో.. అనితపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విక్రమన్ పెళ్లికని కొనిపెట్టిన చీరను, తాళిని విసిరిపారేశాడు. అనంతరం అనితకు ఓ కూతురు పుట్టగా, అక్కడి నుంచి చవరా అనే ప్రాంతానికి వెళ్లిపోయిన విక్రమన్ విరహ వేదనతో మళ్లీ పెళ్లి జోలికి పోలేదు. అయితే అక్కడి రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్ర వేయగలిగాడు.

ఇదిలా ఉంటే.. అనిత కూతురు అథిరాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే ఆమె తాగుబోతు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒంటరిదైన అనిత అథిరాతో పాటు తన సోదరిని కూడా తన వద్దే ఉంచుకుని కష్టపడి వారిద్దరిని చదివించింది. అనంతరం తల్లి ద్వారా ఊరి ప్రజల ద్వారా విక్రమన్ గురించి, తల్లికి అతనితో ఏర్పడిన ప్రేమ గురించి తెలుసుకుంది కూతురు అథిరా.

తమకోసం ఇంత కష్టపడిన అమ్మకు ఇంతకు మించిన సంతోషాన్ని ఇవ్వలేమని భావించి.. తన తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందిగా విక్రమన్ ను సంప్రదించింది.అయితే ముందు అథిరా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిన విక్రమన్.. ఆమె పెళ్లి తర్వాతే విషయం గురించి మాట్లాడుదామని చెప్పాడు.

విక్రమన్ సలహాతో రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న అథిరా.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమన్ వద్దకు వెళ్లి తన తల్లితో పెళ్లికి ఆయన్ను ఒప్పించింది. దీంతో 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జూలై 21వ తేదీన అనిత (52) విక్రమన్ (68)ల వివాహం జరిగింది. విషయాన్ని అథిరా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వీరి వివాహ వార్త వైరల్ గా మారిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For Aathira, the wedding of 68-year-old Vikraman to her mother Anitha, aged 52, was special more than her own wedding.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి