ఉద్యోగాల తొలగింపుకు ఏఐ ఒక సాకు మాత్రమే: గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత శరవేగంగా విస్తరిస్తోంది. జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తూ వస్తోన్న ఏఐ, టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మానవ వనరుల అవసరం తగ్గుతుందని, భవిష్యత్తులో ఐటీ మరియు టెక్ రంగాలలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ సాకుతో ఉద్యోగులకు ఉద్వాసన
ఇప్పటికే అనేక టెక్ దిగ్గజాలు ఏఐ సాకుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ తీవ్రమైన ఉపాధి సంక్షోభంపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ డీప్ మైండ్ అధినేత (CEO) డెమిస్ హిస్సాబిస్ ఇటీవల స్పందించారు. కార్పొరేట్ కంపెనీల ధోరణిని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐటీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల తొలగింపుకు ఏఐ ఒక సాకు మాత్రమేనని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఏఐ వాషింగ్ పై వ్యాఖ్యలు
పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయని డెమిస్ హిస్సాబిస్ అభిప్రాయపడ్డారు. ఇలా లేఆఫ్స్ ప్రకటించే సంస్థలు తాము తీసుకుంటున్న నిర్ణయాలకు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'ను ఒక సాకుగా చూపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యూహాన్ని ఆయన ఏఐ వాషింగ్ గా అభివర్ణించారు.
ఒక అదనపు ఆయుధంగా ఏఐ సాంకేతికత
వాస్తవానికి వ్యాపారాల ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏఐ సాంకేతికతను ఒక అదనపు ఆయుధంగా ఉపయోగించుకోవాలే తప్ప, దాని పేరుతో సిబ్బందిని తగ్గించుకోవడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. సరైన ముందుచూపు మరియు దీర్ఘకాలిక వ్యూహాలు లేకపోవడం వల్లే చాలా కంపెనీలు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. సాంకేతికత పెరిగితే డెవలపర్ల అవసరం తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐని డెవలపర్లకు ప్రత్యామ్నాయంగా మార్చేవారికి భవిష్యత్ పై అవగాహన లేదు
గూగుల్ ఐఓ (Google I/O) సదస్సులో భాగంగా అధునాతన జెమిని 3.5 ఫ్లాష్ మోడల్‌ను డీప్ మైండ్ సంస్థ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హిస్సాబిస్ మాట్లాడుతూ.. ఇలాంటి శక్తివంతమైన ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల లేదా డెవలపర్ల ప్రాధాన్యత తగ్గిపోతుందని అనుకోవడం పూర్తిగా పొరపాటని కొట్టిపారేశారు. ఒకవేళ కోడింగ్ విభాగంలో కృత్రిమ మేధ మరింత నైపుణ్యం సాధిస్తే, అది మానవ డెవలపర్లకు భారం తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏఐని డెవలపర్లకు ప్రత్యామ్నాయంగా మార్చాలని చూసే సంస్థలకు భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన లేదన్నారు.













Click it and Unblock the Notifications