23న క్యాబినెట్ భేటీ జరిగేదిక్కడే.. ఈ అంశాలపైనే కీలక నిర్ణయాలు, టార్గెట్ అదే!
తెలంగాణ రాష్ట్రంలో నూతన సంక్షేమ పథకాల అమలు, పరిపాలనాపరమైన సంస్కరణలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఉన్నత స్థాయి క్యాబినెట్ భేటీని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. నిజానికి ఈ మంత్రిమండలి సమావేశాన్ని తొలుత మే 21వ తేదీన జరపాలని భావించి, అందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం జారీ చేసింది.
మే 23న క్యాబినెట్ భేటీ యాదాద్రిలో అని ప్రచారం
అదే రోజున అత్యంత పవిత్రమైన 'సరస్వతి అంత్య పుష్కరాలు' ప్రారంభం కానుండటంతో, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ సమావేశాన్ని మే 23వ తేదీకి మార్చింది. మే 23న ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట ప్రాంతంలో పలు ప్రగతి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండటంతో, క్యాబినెట్ భేటీని కూడా అక్కడే నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది.

క్యాబినెట్ భేటీ సచివాలయంలోనే.. మెయిన్ ఫోకస్ దానిపైనే
ఈ ప్రచారాన్ని తోసిపుచ్చిన సచివాలయ వర్గాలు, ఈ కీలక సమావేశం యథావిధిగా హైదరాబాద్‌లోని సచివాలయంలోనే జరుగుతుందని స్పష్టం చేశాయి. చర్చకు రానున్న ప్రధాన అంశాలు మరియు ఎజెండా విషయానికి వస్తే తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ప్రజల్లోకి సరికొత్త కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై చర్చించనున్న మంత్రివర్గం
ఈ నేపథ్యంలో ఈ భేటీలో చర్చించబోయే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల సరైన ఎంపిక, అర్హతలు మరియు మార్గదర్శకాల మార్పులపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది.
హ్యామ్ రోడ్ల పనులు, భూముల రిజిస్ట్రేషన్ ధరల సవరణపై భేటీలో నిర్ణయాలు
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన 'హ్యామ్' (HAM) రోడ్ల టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులపై క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాదు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి మరియు ప్రభుత్వ ఆదాయానికి కీలకమైన భూముల రిజిస్ట్రేషన్ ధరల సవరణపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హెల్త్ కార్డుల జారీ, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపుపై చర్చ
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల కోసం ఉద్దేశించిన హెల్త్ కార్డుల జారీ మరియు నూతన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలు కూడా ఈ సమావేశ ఎజెండాలో ప్రధానంగా చేర్చబడ్డాయి. రాష్ట్ర ప్రగతికి దిశా నిర్దేశం చేసే ఈ క్యాబినెట్ భేటీపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications