జీఎస్‌టీ పరిథిలోకి పెట్రోల్, డీజిల్... అరుణ్ జైట్లీ మద్దతు...
పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ (వంట గ్యాస్)లను వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిథిలోకి తేవాలన్న ఆలోచనకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మద్దతు పలికారు.
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ (వంట గ్యాస్)లను వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిథిలోకి తేవాలన్న ఆలోచనకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మద్దతు పలికారు. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిథిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు.

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతోపాటు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిథిలోకి తీసుకురాకుండా అడ్డుకుంటున్న అంశమేమిటని ప్రశ్నించారు. జీఎస్‌టీ మండలిలో దీనిపై ఎప్పుడు చర్చ జరుగుతుందని అడిగారు.
ఇందుకు అరుణ్ జైట్లీ స్పందిస్తూ జీఎస్‌టీ పరిథిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తేవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయం యూపీఏకు తెలుసునని, అందుకే జీఎస్‌టీ ముసాయిదాలో పెట్రోలియం ఉత్పత్తులను యూపీఏ ప్రభుత్వం చేర్చలేదని అన్నారు.
ఈ విషయంలో తాము రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం వేచి చూస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు. త్వరలోనే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications