మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ జంట వ్యూహాలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మొండి బకాయిలను రాబట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్దమైంది. దివాళా చట్టం కింద మొండి బకాయిదారులపై చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐకి అధికారాలు దఖలు పరుస్తూ గత నెలలోనే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం - 1949ను సవరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి అనుగుణంగా ద్విముఖ వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం మొండి బకాయి దారులైన 12 మంది డిఫాల్టర్లపై దివాళా చట్టం కింద చర్య తీసుకోవాలని సంబంధిత బ్యాంకులను ఆదేశించింది.

మిగతా మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకునేందుకు ఆరు నెలల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నది. మొండి బకాయిల వసూలు కోసం జాతీయ మౌలిక వసతుల పెట్టుబడి నిధి (ఎన్ఐఐఎఫ్) ఏర్పాటు చేసింది. 'ఎన్ఐఐఎఫ్' ఒక ఆస్తి యాజమాన్య సంస్థగా వ్యవహరిస్తుంది.

రెండు రోజుల క్రితం వివిధ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమీక్షలో మొండి బకాయిల వసూళ్లకు ఆర్బీఐ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదేశించారు. నూతన చట్టం కింద 81 ఖాతాలను గుర్తించి తగు కార్యాచరణ ప్రణాళిక అమలుకు పూనుకున్నది.

ఇందుకోసం అంతర్గత సలహా కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు. మొండి బకాయిల వసూళ్లకు బ్యాంకులు చర్యలు తీసుకుంటుండగానే.. మరోవైపు ఆయా బ్యాంకులను సంఘటిత పరిచేందుకు కేంద్రం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది.

మొండి బకాయిల వసూళ్ల తర్వాతే విలీనాలు

మొండి బకాయిల వసూళ్ల తర్వాతే విలీనాలు

వివిధ జాతీయ బ్యాంకులు సైబర్ సెక్యూరిటీ పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక రంగం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీం ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఆర్థిక సేవల శాఖలో ‘సెర్ట్' అనే పేరిట ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాయి. సైబర్ భద్రత పరికరాలు ఏర్పాటు చేసేందుకు వివిధ బ్యాంకులతో ఆర్థిక సేవల శాఖ సమన్వయంతో వ్యవహరిస్తుంది. ఒకవైపు మొండి బకాయిల వసూళ్ల ప్రక్రియ పూర్తయ్యాకే వివిధ బ్యాంకుల మధ్య విలీన, స్వాధీన ప్రతిపాదనలు పరిశీలించాలని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా 30 - 40 పెద్ద మొండి బకాయిల సమస్యను తీర్చాకే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.‘ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఇది మంచి సమయం కాకపోవచ్చు. ఇప్పటికే ఈ విషయంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ప్రస్తుత ఎన్‌పీఏల పరిస్థితిని చక్కదిద్దాకే.. విలీనాలకు వెళ్లడం మంచిదన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది' అని ఆ అధికారి తెలిపారు.

ఐడీబీఐ విలువ పెంపునకు కేంద్రం ఇలా

ఐడీబీఐ విలువ పెంపునకు కేంద్రం ఇలా

ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కొంత వాటా విక్రయించాలని భావించినా.. ఆ బ్యాంకులో పేరుకున్న మొండి బకాయిలు అందుకు అడ్డుగా నిలిచాయి. 2016-17 జనవరి - మార్చిలో ఈ బ్యాంకు రూ.3,200 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. స్థూల ఎన్పీఏలు 21.25 శాతానికి, నికర ఎన్‌పీఏలు 13.21 శాతానికి పెరిగాయి. ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన రుణాల వసూళ్లు ఆందోళనకరంగా ఉండడంతో, ఆ బ్యాంకు విలువపైనా ప్రభావం పడింది. దీంతో అందులో వాటా తగ్గింపునకు కొత్త వ్యూహం ఆలోచించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఆ తర్వాతే వాటి విలీనం

ఆ తర్వాతే వాటి విలీనం

ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీన ప్రక్రియలో పాల్గొనడానికి ముందు తమ ఆస్తుల నాణ్యత, మూలధన నిష్పత్తి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో మంచి పనితీరు ఉన్న బ్యాంకులో బలహీన బ్యాంకు విలీనం ద్వారా సమస్య పరిష్కరించాలనుకోవడం సరికాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. దీనివల్ల విలీన ప్రక్రియ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థనే బలహీన పరుస్తుందని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు.

బ్యాంకుల బలోపేతానికి రూ.10 వేల కోట్ల నిధి

బ్యాంకుల బలోపేతానికి రూ.10 వేల కోట్ల నిధి

మూలధనం విషయంలో అవసరమైతే మరింత ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ అధికారి పునరుద్ఘాటించారు. రూ.70,000 కోట్ల ఇంద్రధనుష్‌ ప్రణాళికలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నిధులు సమకూర్చాలని భావిస్తోంది. ‘విలీనాలకు ముందే ప్రభుత్వం నుంచి మూలధన మద్దతునివ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం' అని ఆ అధికారి వివరించారు. ఐడీబీఐ బ్యాంకు గురించి మాట్లాడుతూ ‘ఈ బ్యాంకుకు అవసరమైతే మరింత మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే సమయంలో బ్యాంకు కూడా తన ప్రధానేతర ఆస్తులను విక్రయించి మూలధనాన్ని పెంచుకునే ప్రయత్నించాలి' అని పేర్కొన్నారు.

బ్యాంకుల అధిపతుల బదిలీలకు కారణాలివి

బ్యాంకుల అధిపతుల బదిలీలకు కారణాలివి

ఇటీవల కొన్ని పెద్ద బ్యాంకుల అధిపతులను చిన్న బ్యాంకులకు బదిలీ చేయడానికి కారణం.. వారిలో కొందరు మొండి బకాయిల సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయకపోవడమేనని ఆ ఆర్థిక శాఖ అధికారి పేర్కొన్నారు. గత నెలలో అలహాబాద్‌ బ్యాంకుకు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ ఉషా అనంత సుబ్రమణియన్‌, సిండికేట్‌ బ్యాంకుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధిపతి మెల్విన్‌ రెగోను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకుకు అధిపతిని ఇండియన్‌ బ్యాంకుకు, ఇండియన్‌ బ్యాంకు అధిపతిని ఐడీబీఐ బ్యాంకుకు అంతక్రితమే ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: The government and the RBI on Monday indicated that they will step up efforts to clean up bank books that are saddled with record non-performing assets (NPAs), including through the National Infrastructure Investment Fund (NIIF).
Please Wait while comments are loading...