వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తీస్తా సెతల్వాద్

2002 గుజరాత్ అల్లర్ల కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారనే ఆరోపణలపై మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ అరెస్టు వరకు ఆమె పట్ల సుప్రీంకోర్టు అనుసరించిన విధానంలో నాటకీయ మార్పులు కనిపిస్తున్నాయి.

జూన్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌లను ఆ మరుసటి రోజే అరెస్ట్ చేశారు. ఈ ఘటన గతంలో జరిగిన ఘటనలకు భిన్నంగా ఉంది.

అంతకు ముందు, గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అనేక కేసుల్లో తీస్తా సెతల్వాద్, ఆమె నడిపించే సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) స్వచ్ఛంద సంస్థ వేసిన అనేక పిటిషన్లను, వాదనలను సుప్రీంకోర్టు ఆమోదించింది.

2015లో తీస్తాపై ఎఫ్‌సీఆర్‌ఏ కింద కేసు నమోదైనప్పుడు సీబీఐ అరెస్ట్‌ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

కానీ, ఈసారి జూన్ 25, 2022 న, ఆమెపై అహ్మదాబాద్‌లోని క్రైమ్ బ్రాంచ్ తన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే నమోదు చేసింది.

జాకియా జాఫ్రీ చేసిన 'విస్తృతమైన కుట్ర' ఆరోపణల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరికొందరిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తీర్పును సమర్థించింది. జాకియా భర్త అహసాన్ జాఫ్రీ కాంగ్రెస్ మాజీ ఎంపీ. గుజరాత్ అల్లర్లలో ఆయన చనిపోయారు.

జాకియా జాఫ్రీతో తీస్తా సెతల్వాద్

కోర్టు ఆదేశాల్లోని 88వ పేరాలో రాసిన విషయాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీని ఆధారంగా తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్, మరో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ పేర్లను ఇందులో పేర్కొన్నారు. కస్టడీ డెత్‌కు సంబంధించిన పాత కేసులో సంజీవ్ భట్ ఇప్పటికే జీవిత ఖైదును అనుభవిస్తున్నారు.

అయితే, 88 వ పేరాలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఈ కేసులో సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్ అల్లర్లో సుమారు వెయ్యిమంది చనిపోయారని నిర్ధరణ అయ్యింది. మరణించిన వారిలో ఎక్కువమంది ముస్లింలే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి.

ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్థిస్తూ, జాకియా జాఫ్రీ ఫిర్యాదు పై ప్రొసీడింగ్స్ లోని పేరా 88లో ''గత 16 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతోంది..ఇందులో పాల్గొన్న ప్రతి అధికారి చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహరాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్న వారందరినీ చట్ట ప్రకారం శిక్షించాలి' అని కోర్టు పేర్కొంది.

అయితే, సుప్రీం కోర్టు చేసిన ఈ అసాధారణ వ్యాఖ్యల పట్ల న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ కూడా 'ది వైర్' కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వీరి ఆందోళనకు మద్దతుగా మాట్లాడారు.

''తీస్తాను అరెస్టు చేసి అహ్మదాబాద్‌కు పంపడం మా ఉద్దేశం కాదు'' అని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం రిజిస్ట్రీ ద్వారా స్పష్టం చేస్తుందని లోకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, సీనియర్ న్యాయవాది కామినీ జైస్వాల్ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈ తీర్పుపై 'పునరాలోచన' చేయాలని అన్నారు.

తీస్తా సెతల్వాద్

జాకియా జాఫ్రీ కేసులో సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ కూడా తీస్తా సెతల్వాద్‌ పట్ల సానుభూతితో మాట్లాడారని బీబీసీ ఇంటర్వ్యూలో కామినీ జైస్వాల్ గుర్తు చేసుకున్నారు.

రామచంద్రన్ తీస్తా సెతల్వాద్‌ను కలిసినప్పుడు, ఆమెపై ఆయన ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదని కామినీ జైస్వాల్ అన్నారు. అంతేకాదు, కామినీ జైస్వాల్ అభిప్రాయం ప్రకారం ''జాకియా జాఫ్రీ, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థలు చేస్తున్న విస్తృతమైన కుట్ర ఆరోపణలపై దర్యాప్తు ఆవశ్యకతను రామచంద్రన్ నొక్కి చెప్పారు''

అహ్మదాబాద్‌కు చెందిన న్యాయవాది ఆనంద్ యాగ్నిక్ మాట్లాడుతూ, "సుప్రీం కోర్టు తీస్తా సెతల్వాద్‌ను వాదనలు వినిపించడానికి అనుమతించడమే కాకుండా ఆమె వాదనలను అంగీకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పూర్తి భిన్నమైన వైఖరిని చూస్తున్నాం'' అన్నారు.

ఈ కేసులో న్యాయం కోసం తీస్తా సెతల్వాద్, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో కలిసి పనిచేశారు. దీనికి తొలుత మాజీ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. వర్మ నేతృత్వం వహించగా, ఆ తర్వాత మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్. ఆనంద్ నాయకత్వం వహించారు.

2002లో జరిగిన అల్లర్లకు సంబంధించిన మరో ప్రధాన కేసు బెస్ట్ బేకరీ కేసులో 14 మందిని సామూహిక హత్యకు కారణమైన మొత్తం 21 మందిని 2003 జూన్ 27న వడోదరలోని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది జస్టిస్ ఆనంద్ హయాంలో జరిగింది.

జాకియా జాఫ్రీ

ఈ హైప్రొఫైల్ కేసు కోర్టులో రుజువు కాకపోవడానికి ప్రధాన కారణం ఫిర్యాదుదారు, బేకరీ యజమాని కుమార్తె జహీరా షేక్, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలను ఉపసంహరించుకోవడం. అయితే కోర్టు ఉత్తర్వులు వెలువడిన 10 రోజుల తర్వాత తీస్తా సెతల్వాద్ విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో జహీరా షేక్ ఆమె పక్కనే కూర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా విచారణ సమయంలో తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆమె విలేఖరులకు చెప్పారు.

జహీరా షేక్ మానవ హక్కుల కమిషన్ ముందు తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ ఆనంద్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. జహీరా షేక్‌ను ఒప్పించడంలో తీస్తా సెతల్వాద్ పాత్ర ముఖ్యమైనది. బెస్ట్ బేకరీ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని, గుజరాత్ వెలుపల కేసును మళ్లీ విచారించాలని కమిషన్ తన పిటిషన్‌లో సీబీఐని కోరింది.

బెస్ట్ బేకరీ కేసులో హైకోర్టులో చేసిన అప్పీలుపై నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ వీఎన్ ఖరే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ వేచి ఉంది. 2003 డిసెంబర్ 26న హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్‌ను మళ్లీ విచారణకు తోసిపుచ్చిన హైకోర్టు, నిందితులందరిని నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది.

మానవ హక్కుల కమిషన్‌, తీస్తా సెతల్వాద్‌ లపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్య చేస్తూ.. తమ స్వలాభం కోసం ఇప్పటికే ఆరిపోయిన మంటలకు ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తున్నారని, పరిస్థితిని ఉద్రిక్తంగా మారుస్తున్నారని అన్నది.

ఈ తీర్పు సుప్రీంకోర్టు నుంచి 2004, ఏప్రిల్ 12 నాటి చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. జహీరా షేక్ అప్పీల్‌ను అనుమతిస్తూ జస్టిస్ అరిజిత్ పసాయత్ బెస్ట్ బేకరీ కేసును గుజరాత్ వెలుపల మళ్లీ విచారించాలని ఆదేశించారు. మానవ హక్కుల సంఘం, తీస్తా సెతల్వాద్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తొలగించింది.

సుప్రీంకోర్టు

బెస్ట్ బేకరీ కేసు

బెస్ట్ బేకరీ కేసును బాంబే హైకోర్టు ట్రిబ్యునల్‌కు బదిలీ చేయడం, బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, సామూహిక హత్య వంటి కేసులలో ఇదే తరహా చర్యలకు కారణమైంది. బెస్ట్ బేకరీ కేసులో గుజరాత్ పోలీసుల పక్షపాత పాత్రను దృష్టిలో ఉంచుకుని, సుప్రీం కోర్టు మరో తొమ్మిది కేసులపై కూడా రాష్ట్రం వెలుపల విచారణకు నిర్ణయించింది. వీటిలో గోద్రా, గుల్బర్గ్ సొసైటీ, నరోడా పాటియా కేసులు ఉన్నాయి.

2003 నవంబర్ 21న ఆ కేసులన్నింటిపై విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2008 మార్చి 26న సుప్రీంకోర్టు ఆ తొమ్మిది కేసులకు సిట్‌ను ఏర్పాటు చేసే వరకు ఈ స్టే ఐదేళ్లపాటు కొనసాగింది.

2009 ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు సిట్ పరిధిని విస్తరించి, జాకియా జాఫ్రీ, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఫిర్యాదులపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో ఈ న్యాయ పోరాటంలో తీస్తా సెతల్వాద్ పాత్ర మరోసారి తెరపైకి వచ్చింది.

కానీ, ఇప్పుడు సుప్రీం కోర్టు ఇప్పుడు తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయమని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gujarat Riots Case: How the Supreme Court's Stand on Teesta Setalvad Has Changed Till Now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X