వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాథ్‌రస్: దళిత యువతి గ్యాంగ్ రేప్, మర్డర్ జరిగి ఏడాదైనా భయం నీడలో బాధితురాలి కుటుంబం - గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బాధిత కుటుంబంలో మహిళ

"వీళ్ల (కులాన్నిసూచించే మాట) ఇంటి బయట పోలీసులను కూర్చోపెట్టినంత మాత్రాన, ఠాకూర్‌లు తగ్గిపోతారా, మేం ఎలా ఉన్నామో, అలాగే ఉంటాం".

గ్రామంలో ఒక మహిళ అన్న ఈ మాటలో తాము అగ్రకులం అనే గర్వం, దళితుల పట్ల ఒక చులకన భావన, భారత రాజ్యాంగం, చట్టం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

కులాన్ని సూచించే మాట ఉపయోగిస్తూ ఆ మహిళ ఎంత సహజంగా మాట్లాడేశారంటే, తాను అలా మాట్లాడ్డం చట్ట ప్రకారం నేరం అని కూడా ఆమె ఆలోచించలేదు.

"మీరు గ్రామంలోని దళితులతో కూర్చుంటారా, వారితో కలిసి తినగలరా" అని నేను ఆమెను అడగ్గానే, "నువ్వు కూడా దళితుడివే అనిపిస్తోంది, అందుకే నువ్వీ ప్రశ్న అడుగుతున్నావ్" అన్నారు.

గత ఏడాది ఒక దళిత బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉత్తరప్రదేశ్ హాథ్‌రస్‌లోని ఈ గ్రామం చర్చల్లో నిలిచింది. ఆ నేరం కింద అప్పుడే గ్రామంలోని ఉన్నత వర్గాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

దేశవిదేశీ మీడియా ఈ ఘటనను కవర్ చేసింది. భారత్‌లో దళితుల స్థితిగతులపై తీవ్రంగా చర్చ జరిగింది. కానీ ఏడాది తర్వాత కూడా, ఈ గ్రామంలో కులవివక్ష మరింత వేళ్లూనుకున్నట్లు అనిపిస్తోంది.

బాధిత కుటుంబంతో బీబీసీ ప్రతినిధి

బాధితురాలి కుటుంబంపై ఇప్పటికీ వివక్ష

తాము ఇప్పుడు కూడా కులవివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని బాధితురాలి కుటుంబం చెబుతోంది. గ్రామంలో ఇప్పుడు తన కుటుంబాన్ని తక్కువచేసి చూడడం ఇంతకు ముందు కంటే ఎక్కువైందని బీబీసీతో మాట్లాడిన మృతురాలి అన్న చెప్పారు.

"గ్రామంలో ఉన్నత కులాల వారు మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే నా మేనకోడలు పాలు తీసుకురావడానికి వెళ్లింది. అక్కడొక మంచంపై కూర్చుంది. దానికే వాళ్లు అరిచి పాపను లేవమని చెప్పారు" అన్నారు.

"నా పెద్ద కూతురికి ఐదేళ్లు. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి. మంచీచెడు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక సీఆర్పీఎఫ్ అధికారితో కలిసి డెయిరీలో పాలు తీసుకురావాలని వెళ్లింది. అక్కడ ఆయన పాపను మంచంపై కూర్చోబెట్టారు. కానీ ఉన్నత వర్గాల వాళ్లు పాపను మంచం పైనుంచి లేవమన్నారు. అది తన మనసులో నాటుకుపోయింది. తను ఇప్పుడు పాల కోసం కూడా వెళ్లడం లేదు" అని బాలిక తల్లి, మృతురాలి వదిన అన్నారు.

"మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చేవరకూ కులవివక్ష పోదు. ఇక్కడ అది శతాబ్దాల నుంచి ఉంది. మొదట్లో అది ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే ఉంది" అని చెప్పారు.

గ్రామంలో ఉన్నత వర్గాలుగా చెబుతున్న వారితో కూడా మేం మాట్లాడాం. వారు ఏమాత్రం సంకోచించకుండా "దళితులను మాతో సమానంగా చూడడం జరగదు" అన్నారు. వారిలో నిందితుల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

కుటుంబానికి భద్రత అందిస్తున్న సీఆర్పీఎఫ్

సీఆర్పీఎఫ్ భద్రతలో బాధిత కుటుంబం

135 మంది జవాన్లున్న సీఆర్పీఎఫ్ కంపెనీ బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పిస్తోంది. ఆ కుటుంబాన్ని కలవడానికి వచ్చేవారిని తనిఖీ చేశాక, మెటల్ డిటెక్టర్‌లోంచి లోపలికి పంపిస్తోంది.

అక్కడున్న జవాన్లు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు.

సెక్యూరిటీ ప్రొటోకాల్ వల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరూ సెక్యూరిటీ లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లడానివ్వడం లేదు.

సీఆర్పీఎఫ్ జవాన్లు బాధితురాలి చిన్నాన్న ఇంటి ఆవరణలో వేసిన ఒక గుడారంలో ఉంటున్నారు.

తమకు ఇప్పటికీ భయంగానే ఉందని, భద్రత అవసరమని, కానీ, సెక్యూరిటీ ప్రొటోకాల్ వల్ల కుటుంబం ఒక విధంగా సొంత ఇంట్లోనే బందీలా మారిందని బాధిత కుటుంబం చెబుతోంది.

హాథ్‌రస్ అత్యాచారం

2020 సెప్టెంబర్ 14న ఏం జరిగింది

20 ఏళ్ల యువతి గడ్డి కోయడానికి తన తల్లితో ఇంటి నుంచి దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉన్న పొలం దగ్గరికి వెళ్లింది. అప్పుడు అదే గ్రామానికి చెందిన నలుగురు నిందితులు ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తను కూతురు దగ్గరికి వెళ్లేసరికే ఆమె గాయపడి ఉందని, బట్టలు చినిగిపోయి ఉన్నాయని బాధితురాలి తల్లి చెప్పారు.

మృతురాలి తల్లి, అన్న వెంటనే ఆమెను మోటార్ సైకిల్ మీద దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని చందపా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆమెను తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు బాధితురాలిని అలీగఢ్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు.

బాలికకు స్పృహ వచ్చిన తర్వాత అలీగఢ్ మెడికల్ కాలేజీలో వాంగ్మూలం ఇచ్చింది. దాని ఆధారంగా పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు.

అలీగఢ్ నుంచి ఆమెను సెప్టెంబర్ 28న దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, అక్కడ ఆమె తర్వాత రోజే చనిపోయింది.

ఆ తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులకు బాధితురాలి ముఖం కూడా చూపించకుండా, సెప్టెంబర్ 30న రాత్రి చీకట్లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనిపై కలకలం రేగింది.

ఈ కేసును మొదట యూపీ పోలీసులు, తర్వాత యూపీ పోలీస్ ఎస్ఐటీ, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేసింది.

భాధిత కుటుంబం ఉంటున్న ఇల్లు

ఇప్పుడు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది

సీబీఐ ఈ కేసులో 2020 అక్టోబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 18న చార్జిషీట్ ఫైల్ చేసింది.

సీబీఐ నలుగురు నిందితులపై హత్య, గ్యాంగ్ రేప్ ఆరోపణలు నమోదు చేసింది. చార్జిషీటులో యూపీ పోలీసుల నిర్లక్ష్యంపైనా ఆరోపణలున్నాయి.

"ఇప్పటివరకూ ఈ కేసులో 20కి పైగా విచారణలు జరిగాయి. ఈ కేసులో విచారణ హాథ్‌రస్ ఎస్సీ-ఎస్టీ కోర్టులో జరుగుతోంది. గత విచారణ సెప్టెంబర్ 9న జరిగింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 23న ఉంది" అని బాధితురాలి అన్న చెప్పారు.

నేను ఆ తేదీల్లో వెళ్తుంటాను. ప్రస్తుతం సాక్ష్యుల వాంగ్మూలం, వారిని ప్రశ్నించడం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇది గ్యాంగ్ రేప్ కాదని, పరువు హత్య అని నిందితుల బంధువులు, కొన్ని గ్రూపులవారు చెబుతున్నారు. వారు మృతురాలి అన్నే ఆమెను హత్య చేశాడని ఆరోపణలు చేస్తున్నారు.

"నన్ను సీబీఐ అన్నిరకాలుగా ప్రశ్నించింది. నేను వారికి సమాధానాలు చెప్పాను. సీబీఐ ఆధారాలు సేకరించి, తమ చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఏముందో అందరికీ తెలుసు. ఈ నిరాధార ఆరోపణలకు మేం భయపడం. మాకు కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది. నిందితులు చాలాసార్లు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. కానీ, ప్రతిసారీ వాటిని తోసిపుచ్చారు. నలుగురు నిందితులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు" అని మృతురాలి అన్న చెప్పారు.

బాధిత కుటుంబం ఇల్లు

జీవితం పూర్తిగా మారిపోయింది

మృతురాలి తమ్ముడు గతంలో ఘాజియాబాద్‌లోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేసేవాడు. ఇప్పుడు అతడి ఉద్యోగం పోయింది. అన్న కూడా ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఈ ఘటన తర్వాత నుంచీ అతడు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు.

"మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఏ పనీ లేకుండా పోయింది. మేం ఎక్కడకూ వెళ్లలేకపోతున్నాం. నేను ప్రైవేటు ఉద్యోగం చేసేవాడిని. అది కూడా పోయింది. మేం మా ఇంట్లోనే బందీల్లా ఉంటున్నాం. మొత్తం ఏడాది అంతా మాకు బాధలోనే గడిచిపోయింది. మేం, ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేం. మా భవిష్యత్తు గురించి మేం ఆశతో ఉన్నాం. ముందు ముందు మా జీవితం ఎలా ఉంటుందో మాకు తెలీదు" అన్నారు.

ఇప్పటికీ మేం విషాదంలోనే జీవిస్తున్నాం. మొత్తం రోజంతా ఇంట్లోనే గడుపుతున్నాం. స్నేహితులను కలవడానికి కూడా బయిటికి వెళ్లలేం. ఈ ఊళ్లో నాకు స్నేహితులెవరూ లేరు. ఇక్కడ ఊళ్లో ఉండడం వల్ల ఏం జరగదు. కెరియర్ కోసం బయటకు వెళ్లాల్సుంటుంది. కానీ, సెక్యూరిటీ వల్ల మేం బయటకు వెళ్లలేకపోతున్నాం" అని మృతురాలి తమ్ముడు కూడా చెప్పారు.

హాథ్‌రస్ ఘటనకు కొన్ని రోజుల ముందే మృతురాలి వదిన తన మూడో కూతురికి జన్మనిచ్చింది. ఆ పాపకు ఇప్పుడు ఏడాది నిండింది. నడుస్తోంది.

"తనుంటే ఈ పాపను చూసి ఎంత సంతోషపడేదో. దీన్ని బాగా ఆడించేది. మా ఇంట్లో ఒక ఆడబిడ్డ వెళ్లిపోయింది. ఇక మా దిగులంతా మిగిలిన ఈ ఆడపిల్లల గురించే" అని మృతురాలి వదిన అన్నారు.

ప్రభుత్వంపై ఆగ్రహం, కోర్టులపై నమ్మకం

బాధిత కుటుంబం ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం తమ కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటూ సోదరుడికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ అది ఇప్పటివరకూ నెరవేర్చలేదని వారు చెబుతున్నారు.

"ప్రభుత్వం అప్పుడు రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఇప్పుడు మా ఖర్చులు దానితోనే నడుస్తున్నాయి. కానీ ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి, అది ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఆ దిశగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు" అని మృతురాలి అన్న చెప్పారు.

"ప్రభుత్వం ఈ కేసును అణగదొక్కడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మా బిడ్డకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. కనీసం ముఖం కూడా చూపించకుండా బలవంతంగా అంత్యక్రియలు చేయడం వల్ల మాకు భాధేసింది. ఇప్పుడు మా బిడ్డకు న్యాయం జరగడమే కాదు, దేశంలో ఆడపిల్లలందరికీ న్యాయం, భద్రత అనేది ప్రశ్నగా మారింది. మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే మేం ఊరుకోం" అన్నారు మృతురాలి వదిన.

ప్రభుత్వ పనితీరుపై మాట్లాడిన ఆమె "ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మహిళల భద్రత గురించి నినాదాలు చేస్తారు. కానీ ఆడపిల్లల కోసం ఏం మార్పూ జరగదు. నాకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఆడపిల్లలు గౌరవంగా జీవించేలా, అలాంటి వాతావరణం ఏర్పరిచేలా ఏం చేయడం లేదు. బతికున్నప్పుడు గౌరవం సంగతి పక్కనపెడితే, అది చనిపోయాక కూడా దక్కడం లేదు" అన్నారు.

గ్రామం వదిలి వెళ్లాలనుకుంటున్న కుటుంబం

హాథ్‌రస్‌లోని ఈ గ్రామంలో వాల్మీకి సమాజానికి చెందిన నాలుగు ఇళ్లు ఉన్నాయి. మిగతా జనాభా అంతా ఉన్నత వర్గాలకు చెందినవారు చెబుతారు. వారిలో ఎక్కువ మంది ఠాకూర్లు కుటుంబాలే. కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉన్నాయి.

ఈ గ్రామంలో ఎప్పటికీ భద్రత ఉండదని బాధిత కుటుంబం చెబుతోంది. ఇక్కడ మాకు భవిష్యత్తు లేదని అంటోంది. కుటుంబంలో అందరూ ఆ గ్రామం వదిలి ఎక్కడికైనా బయటకు వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారు.

"మా జీవితాలు ఎప్పటికైనా పట్టాలెక్కుతాయని మాకు అనిపించడం లేదు. మేం ఈ ఊరు నుంచి వెళ్లిపోవాలి. కానీ, ఎక్కడికెళ్తామో, మా తలదాచుకోడానికి ఎక్కడ చోటు దొరుకుతుందో మేం అప్పుడే చెప్పలేం. ఈ గ్రామంలో ఇప్పుడు మాకు ఎలాంటి ఉపాధి లేదు. ఏదో ఒక రోజు మేం ఈ ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే" అని మృతురాలి అన్న చెప్పారు.

నిందితుల కుటుంబం ఎలా ఉంది

నిందితుల కుటుంబాలు ఎలా ఉన్నాయి

ఈ కేసులో నిందితుల కుటుంబాలు ఆ ఘటన జరిగినప్పటి నుంచి అందులో తమ వారి ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నాయి. నిందితుల్లో ఇద్దరు పెళ్లైనవారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు.

మీడియా, అధికారులు, సమాజంపై నిందితుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వారిని తప్పుడు ఆరోపణలతో ఇరికించారని అంటున్నారు.

ఈ కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. జైల్లో ఉన్న నిందితులను కుటుంబ సభ్యులు ఇప్పటివరకూ కలవలేకపోయారు. విచారణ తేదీ వచ్చినపుడు, వారిని చూడ్డానికి కోర్టుకు వెళ్తుంటారు. వారు నిర్దోషులని, ఏదో ఒక రోజు జైలు నుంచి విడుదలవుతారని మీడియాకు చెబుతుంటారు.

"నేను నా భర్త లేకుండానే పిల్లలను చూసుకుంటున్నా. నా దగ్గర ఏం లేదు. రెండు బర్రెలు ఉండేవి. వాటిని కూడా అమ్మేశాం. భర్తతో ఫోన్లో మాట్లాడితే, ఆయన తాను నిర్దోషినని, ఏదో ఒక రోజు కోర్టు తనను విడుదల చేస్తుందని చెబుతుంటారు" అని ఒక నిందితుడి భార్య అన్నారు.

మరో నిందితుడి తల్లి కొడుకును తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

"నా బిడ్డను అన్యాయంగా ఇరికించారు. కానీ, మమ్మల్ని ఎవరూ ఏమీ అడగరు. అందరూ వాళ్ల ఇంటికే వెళ్తుంటారు. వాళ్లకు చాలా డబ్బు కూడా ఇచ్చారు. ఆ డబ్బుతో వాళ్లు మొత్తం బలం చూపించి కేసు వాదిస్తారు. కానీ, మా దగ్గర ఏం లేదు" అన్నారు.

మృతురాలి దహనం జరిగినప్పటి ఫైల్ చిత్రం

గ్రామంలో నిశ్శబ్దం

హాథ్‌రస్‌లోని ఈ గ్రామంలో నిశ్శబ్దం అలుముకుని ఉంది. ఒకరిద్దరు పొలాల్లో పనిచేసుకుంటూ కనిపిస్తున్నారు. బాధితురాలి ఇంటి దగ్గర నుంచి వెళ్లే వాళ్లు, అక్కడికి రాగానే తమ మోటార్ సైకిల్ స్పీడు పెంచుతున్నారు. అక్కడ జనం ఇప్పటికీ ఓపెన్‌గా మాట్లాడ్డం లేదు. మీడియాను చూడగానే అప్రమత్తం అవుతున్నారు.

గ్రామంలోని దళిత కుటుంబాలు మినహా మిగతా వారంతా నిందితులను నిర్దోషులనే భావిస్తున్నారు. "నలుగురు అమాయకులను అన్యాయంగా ఇరికించారు" అని లోలోపలే అంటున్నారు.

గ్రామానికి కొంత దూరంలో బాలికకు అంత్యక్రియలు జరిగిన దగ్గర ఇప్పుడు గడ్డి మొలిచింది. అక్కడ ఏఢాది క్రితం శవాన్ని దహనం చేసిన ఆనవాళ్లు కూడా లేవు. మేం ఆ వైపు వెళ్తుంటే గ్రామంలో ఒక వ్యక్తి మమ్మల్ని గట్టిగా పిలిచారు.

"అక్కడ చూడ్డానికేముంది..బయటి నుంచి ఎవరొచ్చినా అక్కడికే వెళ్తుంటారు. అక్కడ ఇప్పుడు ఏం లేదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Hatras: Dalit girl gang-rape, murder victim's family in the shadow of fear
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X