సరస్సులో దూకి అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జి
ఛండీగఢ్: తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ న్యాయమూర్తి సరస్సులో మునిగిపోతున్న బాలికను కాపాడారు. తన భద్రతా సిబ్బంది పక్కనే ఉన్నప్పటికీ వారికంటే ముందే సరస్సులో దూకి బాలికను రక్షించారు. ఆ న్యాయమూర్తి ఎవరో కాదు పంజాబ్-హర్యానా రాష్ట్రాల హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం జైపాల్.
కాగా, హర్యానాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 30న జస్టిస్ జైపాల్ తన భద్రతా సిబ్బందితో కలిసి సుఖ్నా సరస్సు ఒడ్డున మార్నింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ గుమిగూడిన స్థానికులు సహాయం చేయాలంటూ అరుపులు కేకలు వేస్తున్నారు.
వెంటనే అక్కడికి వెళ్లిన జడ్జి జైపాల్.. నదిలో ఓ అమ్మాయి మునిగిపోతున్నట్లు గుర్తించారు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకేశారు. ఆ తర్వాత ఆయన భద్రతా సిబ్బంది యశ్‌పాల్ కూడా నదిలో దూకాడు. నదిలో మునిగిపోతున్న బాలికను జస్జిస్ జైపాల్ బయటికి తీసి ఒడ్డుకు చేర్చారు.

అపస్మారక స్థితికి చేరిన బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం బాలిక స్పృహలోకి వచ్చింది. కాగా, తాను చదువులో రాణిస్తున్నప్పటికీ తన తండ్రి పేదరికం కారణంగా తనను చదివించలేకపోతున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలని సరస్సులో దూకినట్లు బాధిత బాలిక తెలిపింది.
బాలికను కాపాడిన జడ్జి జైపాల్.. బాధిత బాలిక కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించారు. ఆమె చదువుకునేందుకు సహకరించాలని ఆమె కుటుంబసభ్యులను కోరారు. అంతేగాక, తనతోపాటు బాలికను కాపాడేందుకు సరస్సులో దూకిన భద్రతా అధికారికి క్యాష్ రివార్డుతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కాగా, జడ్జి చూపిన ధైర్యం, చేసిన సాయం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications