ఓ జగన్, ఓ చంద్రబాబు.. ఇప్పుడు హేమంత్ సోరెన్..!
హోరాహోరీగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఇండియా కూటమి పార్టీలు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ.. అధికారానికి బాటలు వేసుకున్నాయి. దీంతో వరుసగా రెండోసారి జార్ఖండ్ లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అయితే గిరిజన రాష్ట్రంలో ఇండియా కూటమి సునాయాస విజయం వెనుక ఏముందనేది పరిశీలిస్తే ఓ కీలక కారణం మాత్రం తేలింది.
ఈ ఏడాది జనవరిలో భూకేటాయింపు కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. దానికి ఆరు నెలల ముందు నుంచే అరెస్టుపై ఊహాగానాలు వచ్చినా ఎన్నికల ఏడాది జార్ఖండ్ సీఎంను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆరు నెలల తర్వాత అంటే సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలల ముందు సోరెన్ బెయిల్ పై విడుదలయ్యారు. సీన్ కట్ చేస్తే ఈసారి ఎన్నికల్లో 57 సీట్లు సాధించి జార్ఖండ్ ఎన్నికలను ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. అందులోనూ ఒక్క జేఎంఎం మాత్రమే 35 సీట్లు సాధించి టాప్ లో నిలిచింది.

ఎన్నికల ఏడాది హేమంత్ సోరెన్ వంటి గిరిజన నేతను అరెస్టు చేసి జైలుకు పంపిన బీజేపీకి అదే ఈ ఎన్నికల్లో అశనిపాతంగా మారిపోయిందని ఇవాళ అందరికీ అర్ధమైంది. జైలుకెళ్లి వచ్చిన సానుభూతి సోరెన్ గా బాగా కలిసొచ్చిందని బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్న పరిస్ధితి. గతంలో ఏపీలోనూ ఇలాంటి రాజకీయాల వల్లే రాజకీయ పార్టీలు, నేతలు బాగా లబ్ది పొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం వెనుక జగన్ అరెస్టు, 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం వెనుక చంద్రబాబు అరెస్టు కీలక పాత్ర పోషించాయి. తద్వారా జగన్, చంద్రబాబు బాటలోనే సోరెన్ కూడా ఈసారి ముఖ్యమంత్రి కావడానికి జైలు సానుభూతి పనికొచ్చింది.












Click it and Unblock the Notifications