ఢిల్లీలో హై అలెర్ట్ .. పార్లమెంట్ సమావేశాలు , ఆగస్ట్ 15 వేడుకలు..డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు ప్లాన్ !!
దేశ రాజధాని ఢిల్లీ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. భద్రతా సంస్థలకు అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు బాంబులతో నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేసే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టార్గెట్ గా టెర్రర్ ఎటాక్
పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. ఆగస్టు 5 న - జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 ను తొలగించిన రోజు , ఈ నేపథ్యంలో అశాంతి సృష్టించడానికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులు చేయవచ్చని భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి.రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో పెద్ద ఎత్తున దాడులను చేయడానికి ఉగ్రవాద గ్రూపులు పెద్ద కుట్ర చేస్తున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

డ్రోన్ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలెర్ట్
జమ్మూలోని ఐఎఎఫ్ స్టేషన్‌పై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి దృష్ట్యా ఢిల్లీ పోలీసు కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ ఢిల్లీలోని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ (డిసిపి), జాయింట్ సిపి మరియు ఇతర ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని మరియు పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రోన్ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జమ్మూలోని భారత వైమానిక దళం స్టేషన్ వద్ద రెండు డ్రోన్లు బాంబు దాడులకు పాల్పడిన తర్వాత మరో డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

డ్రోన్ల దాడులను ఎదుర్కోవటానికి ప్రత్యేక శిక్షణ
జమ్మూలో జరిగిన డ్రోన్ దాడి ఈ కొత్త ముప్పు గురించి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. డ్రోన్ ముప్పు దృష్ట్యా, ఢిల్లీ పోలీసులు ప్రత్యేక నియంత్రణ గదిని కూడా రూపొందించారు. ఈసారి, చారిత్రాత్మక ఎర్రకోట వద్ద 4 యాంటీ-డ్రోన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు . గత సంవత్సరం రెండు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయగా ఈసారి, వాటి సంఖ్యను మరింత పెంచనుంది. డ్రోన్ల బెదిరింపులను ఎదుర్కోవటానికి మొదటిసారిగా ఢిల్లీ పోలీసులు మరియు ఇతర భద్రతా సంస్థలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

డ్రోన్ల ముప్పుపై అధికారులకు ఆదేశాలిచ్చిన ఢిల్లీ పోలీస్ బాస్
డ్రోన్ ముప్పును పరిష్కరించడమే కాకుండా, నగరంలోని మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని బాలాజీ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో మహిళల భద్రతకు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు.ఇక ఇటీవల ఉగ్రవాద సంస్థలు తమ కార్యాకలాపాల కోసం డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు గుర్తించిన భారత భద్రతా దళాలు వాటిని ఎదుర్కోవటం కోసం రెడీ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications