Bihar Polling:బీహార్లో మధ్యాహ్నమే సగం పోలింగ్ పూర్తి-ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ..!
బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతాలు నమోదవుతున్నాయి. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ నమోదు కానంత స్ధాయిలో పలు చోట్ల పోలింగ్ శాతాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచీ ఓటర్లు భారీగా పోలింగ్ బూత్ లకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఈసారి పోలింగ్ శాతం రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో రికార్డు స్దాయిలో 64.66 శాతం ఓట్లు నమోదయ్యాయి.
ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఒంటి గంట కల్లా రెండో దశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో దాదాపు సగం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఒంటి గంట కల్లా 122 సీట్లలో సగటున 47.62 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటికే రికార్డులు సృష్టించిన తొలి దశ ఎన్నికల్లో సైతం ఈ సమయానికి ఇంత పోలింగ్ నమోదు కాలేదు. తొలి దశలో మధ్యాహ్నం ఒంటి గంటకు కేవలం 42.31 శాతం ఓట్లే పడ్డాయి.

బీహార్ లోని 18 జిల్లాల్లో ఉన్న 122 సీట్లలో మధ్యాహ్నానికే సగం పోలింగ్ పూర్తయింది. మిథిలా, కోసి బెల్ట్, పశ్చిమ బీహార్, మగధ్, అంజికా, సీమాంచల్ ప్రాంతాల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు తర్వాత బీహార్ వ్యాప్తంగా బూత్‌ల వద్ద భారీ భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 57.29 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. కానీ ఈసారి తొలివిడతలోనే ఈ రికార్డు చెరిగిపోయింది. ఇప్పుడు రెండో విడత పోలింగ్ సరళని గమనిస్తే 70 శాతం వరకూ పోలింగ్ జరగవచ్చని అంచనా.

రెండో విడతలో భారీ పోలింగ్ జరగబోతోందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఉదయమే చెప్పేశారు. స్వాతంత్రం వచ్చాక బీహార్ లో ఇంత భారీ పోలింగ్ శాతాలు ఎప్పుడూ నమోదు కాలేదు. కానీ ఈసారి ఓటింగ్ శాతాలు కచ్చితంగా మార్పుకు సంకేతమని ఆయన తెలిపారు. మరోవైపు ఈ భారీ పోలింగ్ శాతాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వెలువడాల్సిన ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చిన పలు సర్వేలు తప్పని తేలడంతో ఈసారి జనం వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications