చెక్ ఔట్ : మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర..ఈ సారి ఎంత పెరిగిందో తెలుసా?
సామాన్యుడిపై మరోసారి కేంద్రం భారం వేసింది. వంట గ్యాస్ ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎల్పీజీ ధరలు ఒక సిలిండర్ పై రూ.2 పెరగనున్నాయి. ఎల్పీజీ డీలర్లకు కమిషన్ చెల్లిస్తుండటంతో ఆ భారాన్ని సామాన్యుడిపై వేసింది కేంద్రం. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సబ్సీడీ సిలిండర్ రూ. 507.42గా ఉంది. పెంచక ముందు దీని ధర రూ.505.34గా ఉండేది.
డీలర్ల కమిషన్ పెంచినందువల్లే కేంద్ర ఇంధన శాఖ సిలిండర్‌పై రెండు రూపాయలు పెంచాలన్న నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల కమిషన్ రూ.48.89 ఉండగా... అదే 5 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై ఆ కమిషన్ రూ.24.20గా సెప్టెంబర్ 2017లో ఫిక్స్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఇక రవాణా ఖర్చులు, వేజెస్ ఇలా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి డిస్ట్రిబ్యూటర్ కమిషన్‌ను 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50.58 చేయగా... అదే 5కేజీల సిలిండర్ పై రూ. 25.29 చేసినట్లు తాజా ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది.

ఇదిలా ఉంటే వంట గ్యాస్ ధర పెంచడం ఒకే నెల సమయంలో ఇది రెండోసారి. బేస్ ధర పై ట్యాక్స్ పెరగడంతో నవంబర్ 1న రూ.2.94 పెంచింది కేంద్రం. ఇక ఈ ఏడాది జూన్ నెల నుంచి ప్రతి నెల గ్యాస్ ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ముంబైలో ఎల్పీజీ గ్యాస్ ధర 14.2 కేజీల సబ్సీడీ సిలిండర్ రూ. 505.05 గా ఉండగా కోల్‌కతాలో ఆధర రూ. 510.70. చెన్నైలో ఆ ధర రూ.495.39. అయితే ఈ ధరలు ఆయా రాష్ట్రాల పన్నులు, రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉన్నాయి. నవంబర్ 1న సబ్సీడీ లేని ఎల్పీజీ ధర రూ. 60 పెరిగి 14.2 కేజీల సిలిండర్ రూ.939 అయ్యింది. ఇక డీలర్ కమిషన్ పెరగడంతో ప్రస్తుతం సబ్సీడీయేతర సిలిండర్ రూ. 942.50కు పెరిగింది.












Click it and Unblock the Notifications