Himachal Landslide: హిమాచల్ లో విరిగిపడిన కొండచరియలు- 200 మందికి నరకయాతన..
హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన అక్కడకు వెళ్లిన పర్యాటకులకు పీడకలగా మారిపోయింది. బస్సుల్లో,కార్లలో పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన వీరంతా భారీ ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుపోవడమే కాకుండా హోటల్ రూమ్ లు కూడా అందుబాటులో లేకపోవడంతో నరక యాతన చవిచూశారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా చేతులెత్తేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి-కులు జాతీయ రహదారి పక్కన కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ జాతీయ రహదారిపై15 కి.మీ పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. హోటల్ గదులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో ఎన్ని గంటలు ఇలా ఎదురుచూడాలో తెలియని పరిస్దితి. దీంతో అక్కడికి వెళ్లిన దాదాపు 200 మంది పర్యాటకులకు చుక్కలు కనిపించాయి.

కొండ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నిన్న సాయంత్రం నుండి జాతీయ రహదారి బ్లాక్ అయింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కనీసం ఏడు, ఎనిమిది గంటలు పట్టే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
దీంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
హిమాచల్ లో పర్యాటక స్ధలాలు చూసేందుకు వెళ్లిన వీరంతా కుటుంబాలు, పిల్లలతో ఉన్నారు. కొందరు బస్సులను బుక్ చేసుకున్నారు. మరికొందరు ధాబాల వద్ద వేచి ఉన్నారు. వీరిలో ఎవరికీ హోటల్ గది లభించే పరిస్ధితి లేదని బాధితులు ఫోన్లలో తెలిపారు. వారు తమ పిల్లల కోసం ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్ట్‌లు, టూరిస్ట్ రిసార్ట్‌లు ఉన్నాయని, అయితే వాటిని కలిపే ప్రత్యామ్నాయ రహదారి లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications