బెంగాల్ లో విజయం పై బీజేపీ ధీమా వెనుక, సునామీ- అసలు లెక్కలు..!!
పశ్చిమ బెంగాల్ లో తొలి విడత పోలింగ్ పూర్తయింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగ నుంది. బెంగాల్ లో గెలుపు కోసం బీజేపీ... అధికారం నిలబెట్టుకొనేందుకు టీఎంసీ హోరా హోరీ గా పోరాటం చేస్తున్నాయి. తొలి విడత తరువాత టీఎంసీ బీజేపీ పైన మాటల యుద్దం పెంచింది. ఇదే సమయంలో బీజేపీ బెంగాల్ లో తమ జెండా ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేస్తోంది. దీని వెనుక కొత్త లెక్కలు తెర మీదకు తీసుకొస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ బెంగాల్ లో గెలుపు పైన విశ్వాసంతో ఉన్నారు. దీని వెనుక అసలు లెక్కల పై విశ్లేషణలు మొదలయ్యాయి.
పశ్చిమ బెంగాల్ లో తమ విజయం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి విడత పోలింగ్ జరిగిన స్థానాల్లోనే తాము 120 స్థానాలు గెలుచుకుంటామని అమిత్ షా చెబుతున్నారు. మే 4న బెంగాల్ లో మమత ప్రభుత్వం ఓడిపోవటం ఖాయమని పదే పదే చెబుతూ.. రెండో విడత పోలింగ్ వేళ కేడర్ లో జోష్ పెంచుతున్నారు. బీజేపీ ఇక్కడ తొలి నుంచి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు, స్థానిక పరిస్థితులు... మహిళలకు రూ 3 వేల హామీ బాగా పని చేసిందనేది బీజేపీ నేతల విశ్లేషణ. అయితే, టీఎంసీ సైతం తమకే ప్రజలు తిరిగి పట్టం కడుతున్నారని చెబుతోంది. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని, బంగ్లాదేశీయుల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.

బీజేపీ లో పెరుగుతున్న ధీమా
బెంగాల్‌లో జరిగిన మొదటి విడత పోలింగ్‌లో బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారి పోయిందని, బీజేపీ సునామీ కనిపిస్తోందని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహించిందని శర్మ ఆరోపించారు. బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ కోసం బీఎస్ఎఫ్‌కు భూమిని టీఎంసీ కేటాయించ లేదని చెప్పారు. సురక్షిత భారతదేశం కావాలని కోరుకుంటే పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చితీరాలని, చొరబాట్లను ఆపకుంటే దేశంలోని ఈశాన్య ప్రాంత మొత్తం బంగ్లాదేశ్‌లో భాగమవుతుందని హెచ్చరించారు. రెండో విడత పోలింగ్‌లోనూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాబోయే రెండేళ్లలో పశ్చిమబెంగాల్, అస్సాంలో హిందువులు మెజారిటీ కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అ తర్వాత బిహార్, జార్ఖాండ్‌కు కూడా విస్తరిస్తుందన్నారు. ఆ దృష్ట్యా ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తూర్పు, ఈశాన్యభారతానికి చాలా కీలకమని చెప్పారు.
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ ఈనెల 29న జరుగుతుంది. మే 4న రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి.













Click it and Unblock the Notifications