రాష్ట్రాల అభ్యంతరంతో మెట్టుదిగొచ్చిన కేంద్రం.. కంపల్సరీ సబ్జెక్టుగా హిందీని తొలగిస్తూ ముసాయిదా సవరణ.
ఢిల్లీ : కొత్త విద్యా విధానంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని పాఠ్యాంశంగా చేర్చాలన్న మానవ వనరుల అభివృధ్ది శాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌లో మార్పులు చేసింది. విద్యార్థులు తాము కోరుకున్న భాషను ఎంచుకునేలా నిబంధనల్లో మార్పు చేసింది. ఆరో తరగతి నుంచి నిర్బంధ హిందీ బాషను ప్రవేశపెట్టాలన్న సూచనను పక్కనబెట్టింది. త్రిభాషా సూత్రంలో భాగంగా ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు తమకు నచ్చిన భాషలను ఎంపిక చేసుకోవచ్చని తాజా ముసాయిదాలో స్పష్టం చేసింది.
గతంలో రూపొందించిన ముసాయిదా ప్రకారం హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని కూడా తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చాలని సూచించారు. దీనిపై తమిళనాడు, కర్నాటక, బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. తమపై ఏ భాషను బలవంతంగా రుద్దాలని చూసినా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దీంతో హిందీ విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని వారి అభిప్రాయం మేరకు ముసాయిదాలో సవరణలు చేస్తామని కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.

దేశంలో కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలో తొమ్మిది మంది నిపుణులతో కూడిన కమిటీని కేంద్రం నియమించింది. గత శుక్రవారం కమిటీ కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్‌కు నివేదిక అందజేయగా.. అందులో ఇంగ్లీష్‌తో పాటు హిందీని నిర్బంధంగా అమలు చేయాలన్న సూచనపై ఆగ్రహం వ్యక్తమైంది. కొత్త జాతీయ విద్యా విధానంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈ నెల 30లోగా వెబ్‌సైట్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications