సప్తపది, ఆచారాల్లేకుండా హిందూ పెళ్లి చెల్లదు - అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
భారత దేశంలో హిందువుల పెళ్లిళ్లంటేనే ఆచారాలు,సంప్రదాయాలు. అవేవీ లేకుండా సాదాసీదాగా జరిగే పెళ్లిళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. కానీ ఆచారాలు లేకుండా ఇలా జరిగే పెళ్లిళ్లు అసలు చెల్లవని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో ఇకపై ఇలాంటి పెళ్లిళ్లపై వచ్చే కేసులకు ఈ ఆదేశాలు ప్రామాణికం కానున్నాయి. ఆచారాలు లేకుండా జరిగిన ఓ పెళ్లికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
సప్తపది వేడుకతో పాటు ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో ప్రకటించింది. విడాకులు తీసుకోకుండానే విడిపోయిన తన భార్య రెండవ వివాహం చేసుకుందని ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. పెళ్లి అనే పదానికి సరైన వేడుకలతో, సరైన రూపంలో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం వస్తుందని తెలిపారు. అలా జరగకపోతే మాత్రం దాన్ని పెళ్లి అనలేమన్నారు.

పెళ్లి అనేది చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని హైకోర్టు తెలిపింది. హిందూ చట్టం ప్రకారం 'సప్తపది' వేడుక పెళ్లిని చెల్లుబాటుగా గుర్తించేందుకు అవసరమైన కార్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు. కానీ ఈ పెళ్లిలో అలాంటి వేడుక జరగనట్లు హైకోర్టు గుర్తించింది. కాబ్టటి ఈ పెళ్లి చెల్లుబాటు కాదని ప్రకటించింది. 1955 నాటి వివాహ చట్టంలో ఇలాంటి వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని తెలిపింది.
2017లో పిటిషనర్ స్మృతి సింగ్ కు సత్యం సింగ్‌తో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వివాహేతర సంబంధాల కారణంగా ఆమె అత్తమామల ఇంటిని విడిచిపెట్టి, కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విచారణ అనంతరం పోలీసులు ఛార్జిషీటు సమర్పించారు. ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకుందని సత్యం సింగ్ ఆరోపించాడు. దీన్ని స్ధానిక కోర్టు గుర్తించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు దాన్ని రద్దు చేసింది.












Click it and Unblock the Notifications