తాలిబన్లపై నిఘా హెచ్చరికలు-జమ్ము కశ్మీర్ పై అమిత్ షా సమీక్ష-కీలక సూచనలు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు త్వరలో భారత్ లోని కశ్మీర్ పైనా కన్నేయొచ్చన్న సమాచారంతో నిఘా సంస్ధలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఐబీతో పాటు రా వంటి సంస్ధలు కూడా కశ్మీర్ లో తాజా పరిస్ధితిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా తాజాగా జమ్ము కశ్మీర్ లో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహించారు.
జమ్ము కశ్మీర్ లో పరిస్ధితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అమిత్ షా.. క్షేత్రస్ధాయిలో శాంతి భద్రతలు, ఇతర పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. తాలిబన్లపై నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని అధికారులకు తెలియజేసి ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లో చేపట్టిన కీలక ప్రాజెక్టుల పురోగతిని కూడా అమిత్ షా తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

అమిత్ షా నిర్వహించిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ ఛీఫ్ నరవణే, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో పాటు పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో అమిత్ షా అధికారులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తూనే ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా తట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల హెచ్చరికలపైనా అమిత్ షా వారితో చర్చించారు.
జమ్ము కశ్మీర్లోకి ఉగ్రవాదులు డ్రోన్ దాడులకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని అమిత్ షా సూచించారు. కాబట్టి సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు ఏమాత్రంఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమిత్ షా అధికారులకు తెలిపారు. దీంతో పాటు జమ్ము కశ్మీర్ లోనూ నిరసనలు జరగకుండా చూడాలని తెలిపారు. తాజా పరిస్దితుల్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరించాలన్నారు.












Click it and Unblock the Notifications