ఇచ్చిన హామీలు నేరవేర్చలేక కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తారా, విడ్డూరంగా ఉంది!
బెంగళూరు/న్యూఢిల్లీ: ఉచిత బియ్యం హామీ విషయంలో కర్ణాటక ప్రభుత్వం రోజుకో సాకులు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంకృతాపరాధం చేసి ప్రజలను మోసం చేసిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి. కుమారస్వామి కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తల మాటలు విన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను ప్రకటించింది, ప్రణాళిక అమలుకు అవసరమైన సన్నాహాలు ముందుగానే చేయాల్సి ఉందని కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచిత బియ్యం హామీపై కేంద్ర ప్రభుత్వానికి మీరు దరఖాస్తు చేశారా? ఉచిత హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ గ్యారెంటీలు అమలు చెయ్యలేకపోతున్నారని, ఒకరిపై నిందలు వేసి మీరు గుడ్లగూబలా కూర్చోవడం ఎంతవరకు న్యాయం అని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఎందుకు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వానికి మీరు బియ్యం కావాలని దరఖాస్తు చేశారా? ఎవరో వచ్చి ఉచితం అని ఎన్నికల వ్యూహకర్త మీకు చెబితే వెనుకా ముందు ఆలోచించకుండా ఉచిత హామీలు ఇచ్చేశారని కుమారస్వామి కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద మండిపడ్డారు.
మంత్రి భార్యకు అన్ని ఫ్రీ, నీ భార్యకు, నా భార్యకు అన్ని ఉచితం అని, అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉచిత బియ్యం పంపిణి పథకం అమలు చెయ్యలేకపోతుందని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
ఉచిత కరెంట్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటిలో ఉన్న వెలుగు చీకటిగా మారిందని, ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన వారు ప్రస్తుత పరిస్థితిని చూడాలని, కరెంటు బిల్లులు చూసి ప్రజలు షాక్ తింటున్నారని, కరెంట్ బిల్లులు చూసి హంపీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గగ్గోలు పెడుతున్నారని, మీరు ఇంకా ప్రజలకు ఇంకెన్ని షాక్‌లు ఇస్తారని మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మండిపడ్డారు.
నేడు రెండు జాతీయ పార్టీల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని, కర్ణాటక ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారని కుమారస్వామి అన్నారు. రెండు పార్టీల డ్రామాలను ప్రజలు గమనించాలని, ప్రజల నెత్తిన టోపీలు ఎలా పెట్టాలో అని రెండు పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చెయ్యలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం, ప్రభుత్వంలోని మంత్రులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని, మీరు ఉచిత హామీలు ఇచ్చే సమయంలో ఇదంతా మీకు తెలియదా? అని కాంగ్రెస్ పార్టీ నాయకులను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ దళపతి కుమారస్వామి సూటిగా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications