ఇదీ హార్దిక్ కసి: పాటిదార్లంటే కమలనాథులకు హడలే మరి!

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: పేరుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ గుజరాత్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మిగిలారు. వివిధ మార్గాల్లో ఆయన సన్నిహితుల ద్వారా 'పాస్'ను బలహీన పరిచి, కొందరి మనస్సులు గెలుచుకునేందుకు మొత్తంగా పటేళ్లను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కొందరు హార్దిక్ పటేల్ సన్నిహితులు బీజేపీలో చేరిపోయారు. కానీ 'నోటుకు సభ్యత్వం' పేరుతో పాటిదార్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. నరేంద్ర పటేల్ అనే హార్దిక్‌పటేల్ అత్యంత సన్నిహితుడు చేసిన ఆరోపణ కమలనాథులకు తలనొప్పిగా పరిణమించింది. 

మరోవైపు అధికార బీజేపీపై సమర్థవంతంగా పోరాడేందుకు తమ పార్టీలో చేరాలని ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు బహిరంగంగా టిక్కెట్ కూడా ఆఫర్ చేసింది. గుజరాత్ రాష్ట్రంలో పాటిదార్ల జనాభా 12 శాతానికి పైమాటే. ఆ పాటిదార్లకు ఓబీసీలుగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చేపట్టిన ఆందోళనతో గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రజాదరణ గల నాయకుడిగా మారిపోయిన హార్దిక్ పటేల్‌ అంటేనే బీజేపీ హడలెత్తిపోతోంది.

 చిన్నప్పుడు వ్యాపారంలో తండ్రికి చేయూత

చిన్నప్పుడు వ్యాపారంలో తండ్రికి చేయూత

హార్దిక్ పటేల్ ప్రజాదరణ యాదృచ్ఛికంగా పెరుగుతూ వస్తోంది. 2015 తొలి అర్థ భాగం వరకు ఎవరికీ తెలియని వ్యక్తిగా ఉన్నారు. పటేళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ర్యాలీలు నిర్వహించడంతో అకస్మాత్‌గా జాతీయ స్థాయి టీవీ చానెళ్ల వార్తల్లో పతాక శీర్షికలకెక్కిన హార్దిక్ పటేల్ గ్రామీణ నేపథ్యం గల యువకుడు. ఆయన చిన్నతనం అంతా అహ్మదాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనే సాగింది. కులం ప్రాతిపదికన ఆందోళనకు శ్రీకారం చుట్టకముందు ఆయన అహ్మదాబాద్ జిల్లాలోని వీరాంగంలో తండ్రి నిర్వహిస్తున్న చిన్న సబ్ మెర్సిబుల్ వాటర్ పంప్ బిజినెస్‌లో సాయం చేసేవాడు. అహ్మదాబాద్ జిల్లా సహజానంద్ కాలేజీలో గ్రేస్‌తో 50 శాతానికి పైగా మార్కులతో పాస్ అయ్యారు.

 మాంద్యంతో పాటిదార్ యువతపై ఇలా ప్రతికూల ప్రభావం

మాంద్యంతో పాటిదార్ యువతపై ఇలా ప్రతికూల ప్రభావం

2010లో పాటిదార్ల యువజన సంస్థ సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ)లో హార్దిక్ పటేల్ (17) చేరారు. 50 వేల మంది పాటిదార్ల యువతతో తొలిసారి ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. ఈ ఇష్టాగోష్టి సమావేశంలో తనకు గల మహత్తర నైపుణ్యాలతో నాయకుల్లో స్ఫూర్తి కలిగించారు. కేవలం నెల రోజుల్లో సర్దార్ పటేల్ గ్రూప్ విరాంగం శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్దిక మాంద్యం వల్ల పాటిదార్ల యువతపై ప్రతికూల ప్రభావం చూపిందని ఎస్పీజీ గ్రూప్ అధ్యక్షుడిగా హార్దిక్ పటేల్ గుర్తించారు. పాటిదార్ల పంటల సాగులో దిగుబడి కూడా తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు ఆన్ లైన్ వ్యాపార లావాదేవీలతో పాటిదార్ల సంప్రదాయ వ్యాపారాలు దెబ్బ తిన్నాయి.వజ్రాల పారిశ్రామికవేత్తలు దుస్థితిని ఎదుర్కొంటుండగా, పాటిదార్లు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలు మూతబడ్డాయి.

 చెల్లి మోనికకు అందని సర్కారీ స్కాలర్ షిప్

చెల్లి మోనికకు అందని సర్కారీ స్కాలర్ షిప్

ఓబీసీలు, ఇతర కులాల వారికి రిజర్వేషన్లు అమలులో ఉండటంతో పాటిదార్ల యువత ఉద్యోగాల కోసం గట్టి పోటీ ఎదుర్కొంటున్న తరుణంలో వారికి ఆశాకిరణంగా యువ కిశోరం హార్దిక్ పటేల్ కనిపించారు. పాటిదార్ల సమస్యల పరిష్కారం కోసం సర్దార్ పటేల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆయన ఆందోళన చేస్తున్నా కొద్దీ.. గ్రూపులోని సీనియర్ నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. చివరిగా 2015లో లాల్జీ పటేల్‌తో విభేదాల వల్ల ఎస్పీజీ నుంచి హార్దిక్ పటేల్ ఉద్వాసనకు గురయ్యారు. ఎస్పీజీ నుంచి ఉద్వాసనకు గురైన హార్దిక్ పటేల్‌ జీవితంలోకి మరో ప్రాముఖ్య సందర్భం అందుబాటులోకి వచ్చింది. హార్దిక్ పటేల్ డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్లకు 2015లో ఆయన చెల్లెలు మోనిక.. ఒక డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్‌లో బీఏ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందారు. కానీ ఆమె ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందడంలో ఫెయిలైంది. ఇది హార్దిక్ పటేల్‌ వెల్‌కమ్ చెప్పే వార్త కాదు.

 2015 జూలైలో ‘పాస్' ఆవిర్భావం

2015 జూలైలో ‘పాస్' ఆవిర్భావం

మోనిక స్నేహితురాలికి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన ఓబీసీ కోటాలో స్కాలర్‌షిప్ అందిన సంగతి తెలుసుకున్న హార్దిక్ పటేల్‌ను హక్కుల కార్యకర్తగా మార్చేసింది. అప్పటికే సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) నుంచి ఉద్వాసనకు గురైన హార్దిక్ పటేల్.. 2015 జూలైలో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్)ని స్థాపించారు. అప్పటివరకు పాటిదార్లకు ఓబీసీ రిజర్వేషన్ సాధించడమే ‘పాస్' లక్ష్యాల్లో ఒకటిగా ఉన్నది. కానీ అప్పటికైతే ఈ ‘పాస్' రాజకీయాలకు అతీతమైన సంస్థగా నిలిచింది. తన లక్ష్యాలను చేరుకునేందుకు హార్దిక్ పటేల్ ముందుచూపుతో వ్యవహరించారు. పాటిదార్ల యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

 ఇలా యువతను ఆకర్షించిన హార్దిక్

ఇలా యువతను ఆకర్షించిన హార్దిక్

సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత జిల్లా మెహ్‌సానాలోని విస్‌నగర్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించి మీడియా ద్రుష్టిని ఆకర్షించారు. నాటి నుంచి నిర్వహించిన ప్రతి ర్యాలీలోనూ పాటిదార్ విద్యార్థికి 90 శాతం మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సులో సీటు రాలేదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు మాత్రం 45 శాతం మార్కులు వచ్చినా సీటు లభించిందని పదేపదే నొక్కి చెప్పి పటేళ్లలో పట్టు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ర్యాలీల్లో ప్రసంగించడం ద్వారా పాటిదార్లను ఆకర్షించారు. సూరత్ నగరంలో నిర్వహించిన ర్యాలీకి భారీ స్థాయిలో 4.5 లక్షల మంది యువత హాజరైనట్లు వార్తలొచ్చాయి. హార్దిక్ పటేల్ తరుచుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పాటిదార్లు పోటెత్తడం గుజరాత్ ప్రభుత్వానికి సంకటంగా మారింది. గాంధీనగర్, రాజ్ కోట్, వడోదర నగరాల్లో నిర్వహించిన ర్యాలీలు జాతీయ స్థాయిలో టీవీ చానెళ్లు, దిన పత్రికల్లో హార్దిక్ పటేల్ పతాక శీర్షికలకు ఎక్కారు. ఆయన ఇంతటితో ఆగలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కుర్మీలు, రాజస్థాన్ రాష్ట్రంలోని గుజ్జర్లతోనూ బంధం పెనవేసుకున్నారు. పాటిదార్ల సామాజిక వర్గానికి మద్దతుగా పెద్ద గ్రూపును రూపొందించారు. జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు పటేల్ నవనిర్మాణ సేన ప్రారంభించారు.

 హార్దిక్ సభలకు భారీగా ప్రజల హాజరు

హార్దిక్ సభలకు భారీగా ప్రజల హాజరు

ప్రజాదరణ పెరిగినా కొద్దీ హార్దిక్ పటేల్ చట్టపరంగా, న్యాయపరంగా వివాదాల్లో చిక్కుకున్నారు. రాజ్ కోట్‌లో జాతీయ పతాకాన్ని కించ పరిచినందుకు హార్దిక్ పటేల్‌పై 2015 అక్టోబర్‌లో కేసు నమోదైంది. మెహ్‌సానా జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో కానిస్టేబుళ్లను చంపేయాలని పిలుపునిచ్చారని హార్దిక్ పటేల్‌పై మరో దేశ ద్రోహ కేసు నమోదైంది. సూరత్‌లో మరో కేసు నమోదైంది. దేశ ద్రోహ నేరం కింద హార్దిక్ పటేల్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు గుజరాత్ రాష్ట్రానికి దూరంగా ఉండాలని, మెహ్ సానా జిల్లాలోకి తొమ్మిది నెలల పాటు ప్రవేశించరాదన్న ఆంక్షలు విధిస్తూ గతేడాది జూలైలో న్యాయస్థానం హార్దిక్ పటేల్‌కు బెయిల్ మంజూరుచేసింది. ఈ నిషేధ కాలంలో హార్దిక్ పటేల్ పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బస చేశారు. తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు పాటిదార్ల మద్దతు కూడగట్టేందుకు మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధ్రుతంచేశారు. పాటిదార్ల సమస్యల పరిష్కారంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ చేపట్టిన ప్రచారోద్యమం గుజరాతీల ద్రుష్టిని ఆకర్షించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ హార్దిక్ పటేల్ నిర్వహిస్తున్న సభలకు భారీగా గుజరాతీలు హాజరవ్వడం అధికార బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. బీజేపీకి, హార్దిక్ పటేల్‌కు మధ్య ఆసక్తికరమైన అనుబంధం కూడా ఉందండోయ్. బీజేపీ మాదిరిగానే తానూ స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు, శ్రీరాముడికి అభిమానినని పేర్కొనడం గమనార్హం. అయినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితం రావడానికి హార్దిక్ పటేల్ కారణమవుతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel has emerged as the biggest challenge to the BJP government in Gujarat even though he maintains that he will not contest election. The BJP has been trying to pacify him through back channels or weaken his organisation by winning over his close aides. Some of them have even joined the party ahead of Gujarat election. But, the 'cash-for-membership' allegation by Narendra Patel has embarrassed the BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి