వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైనోసార్‌లు సెక్స్ ఎలా చేసుకునేవి.... ఆడ జంతువులను శృంగారానికి ఎలా ఆహ్వానించేవి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డైనోసార్‌లు

నేను జాకోబ్ వింథెర్ కార్యాల‌యంలో కూర్చున్నాను. ఒక విష‌యం గురించి బాగా ఆలోచిస్తున్నాను. దాని గురించి రాయడం అంత సులువేమీ కాదు.

టిరానోసార‌స్‌కు పురుషాంగం ఉండేదా? అన్న‌దే ఆ ప్ర‌శ్న‌. దానిని అడిగిన‌ప్పుడు మొహ‌మాటంతో మాట‌లు త‌డ‌బ‌డ్డాయి. సిగ్గుతో ముఖం ఎర్ర‌బారింది. అయితే, "ఎవ‌రైనా సెక్స్ చేయాల్సిందే క‌దా'' అని ఆయన నిదానంగా వాస్త‌వాన్ని చెప్పారు.

మ‌నం బ్రిటన్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ బ్రిస్ట‌ల్‌లో ఉన్నాం. అక్క‌డ మ్యాక్రో రివ‌ల్యూష‌న్ విభాగం ప్రొఫెస‌ర్‌గా వింథెర్ ప‌నిచేస్తున్నారు. శిలాజాలకు సంబంధించిన ఫాసిల్ రికార్డు విభాగంలో ఆయ‌న పరిశోధన చేస్తున్నారు.

ఆయ‌న ఇచ్చిన స‌మాధానంతో తేరుకున్న త‌రువాత నేరుగా ఆయ‌న క‌ళ్ల‌లోకి చూడ‌లేక‌పోయాను. అందుకే ఆ గదిని స‌ర్వే చేస్తున్నట్లుగా అటూఇటూ చూశాను.

అయితే, ఇలాంటి స‌మ‌యంలోనే మీలోని దాగున్న పిల్లాడు బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ పాలెయెంటోల‌జిస్ట్ నుంచి ఎదో తెలుసుకోవాల‌ని ఆశిస్తాడు.

అక్క‌డి పుస్త‌కాల షెల్ఫ్‌లో శిలాజాల ముక్క‌ల‌ను దొంత‌ర‌లుగా పేర్చారు. సంపుటాల కొద్దీ గ్రంథాలు, ప‌త్రాలు కూడా ఉన్నాయి. కనుమరుగైన ఓ ప్ర‌పంచానికి చెందిన అవశేషాల‌తో ఈ గది నిండిపోయింది.

అక్క‌డ ఉన్న ముఖ్య‌మైన‌వాటిలో ఓ ప్రాచీన‌ కాలపు కీట‌కం అవ‌శేషం కూడా ఒక‌టి. చాలా సున్నిత‌మైన రెక్క‌లు దానికి ఉండేవి. దాని ర‌క‌ర‌కాల రంగులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇదొక "వాంపైర్ స్క్విడ్‌''. దాని శిలాజాలను చాలా జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌రిచారు. వాటిలో ఇప్ప‌టికీ చ‌ర్మానికి సంబంధించిన మెలనిన్ ఉంది. ఆ ప్రాచీన కీట‌కానికి ప్ర‌స్తుతం ప‌గ‌డాల దిబ్బ‌ల్లో దొరికే కీట‌కాల‌కు దగ్గర సంబంధాలున్నాయి.

అక్క‌డ ఓ మూలన ప్రాచీన కాలంనాటి ఒక కర్ర పెట్టె కనిపించింది. దాని సొరుగుల్లో ఎంతో ఆస‌క్తిని క‌లిగించే శిలాజాల అవ‌శేషాలు ఉండే అవ‌కాశం ఉంది. ఆ స్థ‌లం అటు పూర్తి మ్యూజియం, ఇటు పూర్తి గ్రంథాల‌యం కాకుండా రెండింటికి మ‌ధ్య‌లో ఉన్న‌ట్టుగా అనిపిస్తోంది.

అక్క‌డికి కేవ‌లం ఒక అడుగు దూరంలో ''స్టార్ ఆఫ్ ద షో''లాంటి సిట్టాకోసార‌స్ అవ‌శేషాలు ఉన్నాయి. సిట్టాకోసార‌స్ అంటే "చిలుక బ‌ల్లి''. ముద్దుముద్దుగా చిన్న ముక్కు క‌లిగిన ఇది శాకాహారి. ట్రైసెరాటాప్ జాతి డైనోసార్ల‌కు ఇది ద‌గ్గ‌రి బంధువు. ప్ర‌స్తుతం ఆసియాగా పిలుస్తున్న ప్రాంతంలోని అడ‌వుల్లో 13.3-12 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఇది తిరుగుతుండేది.

సిట్టాకోసార‌స్ చ‌ర్మం ఇంకా చెక్కుచెద‌ర‌లేదు. దానిని తాకితే అక్క‌డ‌క్క‌డ శారీరాన్ని త‌డుముతున్న‌ట్టే అనిపిస్తుంది. దాని తోక‌పై సూదిగా కనిపించే ప్ర‌త్యేక‌మైన ఈక‌లు ఉన్నాయి. అయితే, శరీర కింది భాగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భ‌విష్య‌త్తు త‌రాలు ప‌రిశోధ‌న చేయ‌డానికి విలువైన స‌మాచారాన్ని ఇది వ‌దిలిపెట్టి వెళ్లింది.

నేను మొద‌ట చెప్పిన విష‌యంపై మ‌ళ్లీ దృష్టి పెట్టాను. చైనాలోని ప్ర‌ముఖ శిలాజాల ప్రాంతంలో ల‌భ్య‌మైన దీని గురించి వింథెర్ చాలా ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నారు. చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లో ఉన్న విజియాన్ ఫార్మేష‌న్ ఇలాంటి ప్రాచీన అవ‌శేషాల‌కు పెట్టింది పేరు.

అక్క‌డ ఉన్న ఓ పురాత‌న స‌ర‌స్సులో ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న రెండు టిరానోసార‌స్‌లు దొరికాయి. ఆ జంట‌కు శరీరం మొత్తం ఈక‌లు ఉండ‌డం విశేషం.

నాలో అనుమానం రెట్టింపైంది. రెండింటి శిలాజాలు పక్కపక్కనే ఉన్నాయంటే.. అవి చనిపోయేముందు సెక్స్ చేసుకున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని అనుకున్నాను.

ముళ్ల స‌మ‌స్య

శాస్త్రవేత్త‌లు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం సాయంతో డైనోసార్ల జీవితాల‌కు చెందిన చిన్నచిన్న విష‌యాల‌ను కూడా రికార్డు వేగంతో కనుక్కోగలుగుతున్నారు. ద‌శాబ్దాల క్రితం ఊహ‌కు కూడా అంద‌ని అంశాల‌ను గుర్తించి నూత‌న ప‌రిశోధ‌న‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్నారు.

మాలిక్యులర్ డిటెక్టివ్ పరిజ్ఞానం సాయంతో 7.6 కోట్ల ఏళ్లకు చెందిన థెరాపాడ్ల ఎర్ర ర‌క్త క‌ణాలు, కొల్లాజెన్‌ల‌ను గుర్తించారు. అనంతర ర‌సాయ‌న ప‌రీక్ష‌ల్లో విస్ప‌ష్ట‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ట్రైసెరాటాప్స్‌, స్టెగోసార‌స్‌లు చ‌ల్ల‌ని ర‌క్తం క‌లిగిన‌వని వీటిలో తేలింది. డైనోసార‌స్ జాతుల్లో ఇలాంటివి కనబడటం అసాధార‌ణం.

ఒళ్లంతా ముళ్లుండే నోడోసార్ చాలా భారీగా ఉంటుంది. ఇది చిన్న చిన్న వెంట్రుక‌లు క‌లిగిన జింజ‌ర్‌జాతికి చెందిన‌ది.

వెనుక‌భాగంలో పెద్ద "తెర‌చాప‌"లాంటి శరీర నిర్మాణం క‌లిగిన స్పినోసార‌స్ గురించి శాస్త్రవేత్త‌లు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంగతులను కనిపెట్టారు. బ‌హుశా వీటికి ఆరు అంగుళాల పొడ‌వున్న ప‌ళ్లు ఉండేవి. మొస‌లిలో కనిపించే లాంటి ద‌వడ‌లు దీనికి ఉండేవి. వీటి సాయంతో లోతైన నీటిలోనూ ఇది వేట కొన‌సాగించేది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇగండోన‌స్‌లు చాలా తెలివైన‌వ‌న‌డానికి రుజువులు ల‌భించాయి.

టెరోసార‌స్‌లు (సాంకేతికంగా ఇవి డైనోసార్‌లు కావు. నిజానికి రెక్క‌లు ఉన్న పాములులాంటివి) ఎర వేసి త‌మ ఆహారాన్ని సంపాదించేవి.

అయితే డైనోసార్లు ఏ విధంగా సెక్స్ చేసేవి?, ఇతర డైనోసార్లను ఎలా ఆక‌ర్షించేవి అనే దానిపై ఇంత‌వ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌నల్లో స్పష్టమైన విషయాలు బయటపడలేదు. ఇప్పటివర‌కు దొరికిన అవ‌శేషాల్లో ఏవి మ‌గ‌వి, ఏవి ఆడ‌వి అని శాస్త్రవేత్త‌లు స్ప‌ష్టంగా గుర్తించ‌లేక‌పోతున్నారు. అలాంట‌ప్పుడు అవి ఏ విధంగా అవి సెక్స్ చేసేవి? ఎలాంటి మ‌ర్మాంగాలను కలిగి ఉండేవి? అనే విషయంలో స్పష్టత ఎలా వస్తుంది?

ప్రాథ‌మిక అవగాహన లేకుండా వాటి శ‌రీర ధ‌ర్మాలు, ప్ర‌వ‌ర్త‌న‌ను తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం. ఒక‌టి మాత్రం స్పష్టం.. అవి కచ్చితంగా సెక్స్ చేసేవి.

తాబేళ్ల సాయంతో..

మ‌రోసారి టిరనోసార‌స్‌ శిలాజాల ద‌గ్గ‌రికి వ‌స్తే, వింథ‌ర్ ఇంకో విష‌యాన్ని వివ‌రించారు. జ‌ర్మ‌నీలో ఒక‌ప్ప‌టి స‌ర‌స్సు అయిన మెస్స‌ల్ పిట్‌లో ల‌భించిన శిలాజాల ఆధారంగా కొన్ని అంశాలు తెలుసుకోవచ్చని ఆయన అన్నారు.

ప్ర‌స్తుతం క్వారీలా ఉన్న ఈ ప్రాంతంలో చాలా శిలాజాలు లభించాయి. ఇవి పుస్త‌కాల పేజీల మ‌ధ్య భ‌ద్రంగా పెట్ట‌కున్న నెమ‌లి ఈక‌ల్లా క‌నిపిస్తాయి.

న‌క్కంత పొడ‌వుండే గుర్రం, రాక్ష‌స చీమ‌ల శిలాజాలు ఇక్కడ దొరికాయి. ఒక పాము క‌డుపులో అయితే పేడ పురుగు, బ‌ల్లి కూడా క‌నిపించాయి.

పెద్ద సంఖ్య‌లో మంచినీటి తాబేళ్లు దొరికాయి. వీటిలో సెక్స్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన‌ తొమ్మిది జంట‌లు కూడా ఉన్నాయి. వాటి తోక‌లను చూస్తే చాలా జాలి, క‌నిక‌రం క‌లుగుతుంది. నాటి జంతువులు ఎలా సెక్స్ చేసేవనే అంశంపై జాకోబ్ ప్ర‌తిపాదించే సిద్ధాంతానికి ఇవి కీల‌కంగా మారాయి.

ప్రాచీన చ‌రిత్రకు చెందిన విలువైన శ్మ‌శానంగా మెస్స‌ల్ పిట్‌ను ప‌రిగ‌ణిస్తుంటారు. ఇది శ్మ‌శానంగా మార‌డం వెనుక ఓ ర‌హ‌స్యం ఉంది. అందుకు ఓ విష‌మే కార‌ణం.

ఇయాసీన్ కాలానికి(5.7 కోట్ల నుంచి 3.6 కోట్ల ఏళ్లు వెన‌క్కి) వెళ్తే ఈ ప్రాంతం నీటితో నిండిన అగ్ని ప‌ర్వ‌తం ముఖ ద్వారంగా ఉన్నట్టు అనిపిస్తోంది. దానికి ఏట‌వాలుగా ఉండే అంచులు ఉండేవి. చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌వులు ఉండేవి. అయితే ఆ ప‌ర్వ‌తం ఈ జీవుల‌ను ఎలా చంపింద‌న్న‌ది ఎవ‌రికీ స్ప‌ష్టంగా తెలియ‌దు. కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఊపిరి ఆడ‌కపోవడంతో అవి చనిపోయి ఉండొచ్చు.

అందుకే సెక్స్ చేసుకుంటున్న తాబేళ్లు దుర‌దృష్టవ‌శాత్తు అలాంటి ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో చిక్కుకొని అదే స్థితిలో ప్రాణాలు కోల్పోయాయి. ఇవి స‌ర‌స్సు అడుగు భాగానికి చేరుకున్నాయి.

కోట్లాది సంవ‌త్స‌రాలుగా వాటి ప్రేమ.. ప్రాణ వాయువులేని భూమి పొర‌ల్లో నిక్షేపిత‌మ‌యింది.

ఏమిటీ ఆ సంబంధం?

అయితే, ఓ కొమ్ముల తాబేళ్ల జంట‌ మాత్రం సెక్స్ చేస్తున్నట్లుగా లేవు. సహజమైన రీతిలోనే ఒక దానిపైన మ‌రొక‌టి ఉన్నట్టు, ఆక‌స్మికంగా మ‌న‌సు మార్చుకొని కిందకు దిగి దూరం జ‌రిగిన‌ట్టు అవి కనిపిస్తున్నాయి.

నా అనుమానాల‌ను గుర్తించిన వింథెర్ ఒక‌సారి కుర్చీలో వెన‌క్కి వాలారు. ఆయ‌న సాధార‌ణ సంభాష‌ణ‌ల్లోనే ప్రీహిస్టారిక్ సెక్స్ ఓ అంశంగా ఉంటుంది. సెక్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కొమ్ము తాబేళ్ల‌పై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌ర‌ణించిన త‌రువాత నిజానికి అవి దూరంగా జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదు. వాటి జ‌న‌నాంగాల ద్వారా అవి క‌లిసే ఉన్నాయి. మగ తాబేలు పురుషాంగం కార‌ణంగా ఇవి ఇన్నేళ్లుగా విడిపోకుండా ఉన్నాయి.

దీనిని గమనించిన తరువాత మ‌రోసారి టిర‌నోసార‌స్ జంట‌ శిల‌జాల ద‌గ్గ‌రికి వ‌స్తే... దానికి దీనికి ఓ అసాధార‌ణ పోలిక క‌నిపిస్తోంది. "అవి ఒక‌దాని నుంచి మ‌రొక‌టి దూరంగా ఉన్నాయి. తోక‌లు మాత్రం క‌లిసే ఉన్నాయి. దీంతో అవి సెక్స్‌లో ఉన్న‌ట్టు అనిపిస్తోంది ''అని వింథెర్ చెప్పారు.

ఇత‌ర ఉదాహ‌ర‌ణ‌లేవీ లేక‌పోవ‌డంతో ఇది కేవ‌లం ఊహ మాత్ర‌మేన‌ని ఆయ‌న‌ తెలిపారు. ఇది ప్ర‌చుర‌ణ‌కు నోచుకోని ఐడియాలాంటిద‌ని అన్నారు.

ఈ ప్రాచీన కౌగిలిని ప‌రిశీలిస్తే ఆ జంతువులు నిజంగా బంధంలో పెన‌వేసుకున్నాయ‌న్న భావ‌న క‌లుగుతుంది. అదే నిజ‌మైతే శిలాజాల్లో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌ని సున్నిత‌మైన శ‌రీర భాగాల విష‌యాన్ని వెల్ల‌డి చేస్తుంది. అంటే టి.రెక్సెస్ స‌హా టిర‌నోసార‌స్‌లు పురుషాంగం క‌లిగి ఉండేని అర్థ‌మ‌వుతుంది.

డైనోసార్‌లు

స‌ర‌స్సు అడుగులో ఏముంది?

డైనోసార్ల సెక్స్‌కు సంబంధించిన మరో కీలక సమాచారం పరిశోధకులకు ల‌భించింది. ఆ శిలాజం ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. అదే సిట్ట‌కోసార‌స్‌.

విలువైన ఆ శిలాజాలను జాకోబ్ నాకు చూపించారు. దాని క‌థ‌ను వివ‌రించారు.

అది ఉత్త‌ర చైనాలోని జెహోల్ బ‌యోటాలో దొరికిన తొలినాటి క్రెట‌సేయ‌స్ జాతికి చెందిన‌ది.

ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా ఉండే ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన అడ‌వులు ఉండేవి. ఒక రోజున నీరు తాగ‌డానికి ఆ సిట్ట‌కోసార‌స్‌ స‌ర‌స్సు దగ్గరకు వెళ్లి ఉంటుంది. దాని పొడ‌వు త‌ల నుంచి తోక వ‌ర‌కు సుమారు మూడు అడుగులు ఉంది. అంటే బాగా ఎదిగిన లాబ్రాడ‌ర్ శున‌కంలా ఉంద‌న్న‌మాట‌. మంచి వ‌య‌సులో ఉన్న‌దే అయిన‌ప్ప‌టికీ అనుభ‌వం లేనిది.

స‌ర‌స్సు ఒడ్డుకు రెండు కాళ్ల‌తో న‌డిచి వెళ్లింది. సాధార‌ణంగా పెరిగే కొద్దీ అవి నాలుగు కాళ్ల‌తో న‌డ‌వ‌లేవు. రెండింటితోనే తిరుగుతాయి. అప్పుడే ప్ర‌మాదం జ‌రిగింది. చిల‌క ముక్కులాంటి నోరుతో నీరు తాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు జారి ప‌డి మునిగిపోయింది. కాళ్లు చాచుకుంటూ కిందికి దిగిపోయింది. అడుగు భాగానికి చేరుకొని అవ‌శేషంగా మిగిలిపోయింది.

ప్ర‌మాద‌వ‌శాత్తు అయిన‌ప్ప‌టికీ దాని జ‌న‌నాంగాలు భ‌ద్రంగా ఉన్నాయి.

నా ఆశ్చ‌ర్యాన్ని గ‌మ‌నించి, దాని కింది భాగం(బాటమ్)ను త‌డిమి చూడాల‌ని జాకోబ్ నాకు చెప్పారు. దాని తోక కింది భాగంలో గుండ్రంగా ఉన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌ని చూపించారు. అదే.. డైనోసార్ ప్రైవేట్ పార్ట్‌.

ఆదిమ క్రెట‌సియ‌స్ కాలం అంటే 16 లక్షల సంవ‌త్స‌రాల నుంచి అన్ని అడ్డంకుల‌ను ఎదుర్కొంటూ భ‌ద్రంగా ఉన్న భాగ‌మ‌ది.

అయ్యో! జాకోబ్ ఆఫీసులో ఉన్న‌ది నిజ‌మైన శిలాజం కాదు. ఒక వేళ స‌జీవ‌మైన డైనోసార్ ఉంటే ఎలా ఉండేదో చెప్పే జీవ కళ ఉట్టి ప‌డే న‌మూనా అది. అది నిజ‌మైన జీవిలా క‌నిపించేందుకు ఆయ‌న చాలా శ్ర‌మ తీసుకున్నారు. అస‌లు చ‌ర్మాన్ని, దానిపైన ఉండే గీత‌ల‌ను అచ్చుగుద్దిన‌ట్టు దించారు.

ఈ చిన్న డైనోసార్ వెనుక భాగం మ‌న‌కు ఏం చెబుతోంది?

మొద‌టగా డైనోసార్ల‌కు వాటి ద‌గ్గ‌ర బంధువులైన ప‌క్షులు, మొస‌ళ్లు మాద‌రిగానే దీనికి విస‌ర్జ‌న మార్గం (క్లొయాకా) ఉంది. భూమి మీద నివ‌సించే అన్ని వెన్నెముక ఉండే జంతువుల(క్షీర‌దాలు మిన‌హాయించి)కు ఉన్న‌ట్టుగానే ఈ విసర్జన మార్గం చాలా రకాలు ఉపయోగపడుతుంది. మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌, లైంగిక కార్య‌క‌లాపాలు, ప్ర‌స‌వాల‌కు ఇదే మార్గం.

ఇది అనూహ్య‌మైన‌ది కాక‌పోయినా, నూత‌న ప‌రిశోధ‌న‌. డైనోసార్ల‌కు కూడా త‌ద‌నంత‌ర ప‌రిణామ క్ర‌మంలో వ‌చ్చిన సోదరులైన ప‌క్షులు, మొస‌ళ్లకు ఉన్న‌టు వంటి అంగాలే ఉండేవని తేలింది. ఈ విష‌యాన్ని అంత‌కు ముందు ఎవ‌రూ నిర్ధారించలేదు.

సిటిరోకార‌స్ తోక కింద ఉన్న క్లొయాకును చూపించిన జాకోబ్ "మీరు ఇక్క‌డ చాలా రంగుల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు'' అని అన్నారు. ఇది మెలానిన్. ఇంత‌కాలం పాటు ఇది చెక్కు చెద‌ర‌కుండా ఉందంటే ఈ అసాధార‌ణ ప‌దార్థ‌మే కొంతవరకు కార‌ణ‌మ‌ని చెప్పారు.

మెలనిన్‌తో..

డార్క్‌గా ఉండే మెలనిన్ కార‌ణంగానే శ‌రీరం రంగు అధార‌ప‌డి ఉంటుందని మనం భావిస్తాం. కానీ, ఇది ప్ర‌కృతిలో ఉన్న‌ భిన్న రంగులు కలగలసిన పిగ్మెంట్‌. రంగును ఇచ్చే స్క్విడ్ ఇంక్‌గా ప‌ని చేస్తుంది. క‌ళ్ల వెనుక భాగం పొర‌ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటుంది. ఉభ‌య‌చ‌ర జీవులు, స‌ర్ప జాతుల‌కు యాంటీ మైక్రోబియ‌ల్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. వాటి కాలేయంల‌లో ఇది పెద్ద మొత్తంలో ఉంటుంది. చెడు మైక్రోబ్‌ల పెరుగుద‌ల‌ను అరిక‌డుతుంది. చాలా సంద‌ర్భాల్లో ప్ర‌యోజ‌నాలు కలిగించేలా పలు చోట్ల ఇది క‌నిపిస్తుంది.

"ఉదాహ‌ర‌ణ‌కు కీట‌కాల‌కు అంటు వ్యాధులు సోక‌కుండా మెలనిన్ సంర‌క్షిస్తుంది. వాటికి రోగ నిరోధ‌క శ‌క్తిని ఇది ఇస్తుంది. మాట‌వ‌ర‌స‌కు ఒక చిమ్మ‌ట పురుగుకు సూదితో గుచ్చి రంధ్రం చేశామ‌నుకోండి(అలా చేయ‌మని చెప్ప‌డం లేదు).. ఆ రంధ్రం చుట్టూ మెలనిన్ చేరుతుంది'' అని జాకోబ్ చెప్పారు.

మాన‌వులు స‌హా అన్ని జంతువుల్లో మెలనిన్ అధిక మొత్తంలో క‌నిపిస్తుంది. జ‌న‌నాంగాల చుట్టూ చర్మం న‌ల్ల‌గా ఉండ‌డానికి ఇదే కార‌ణం. డైనోసార్ల విష‌యంలోనూ మాన‌వుల‌కు ఉన్న‌ట్టుగానే ఉంటుంది.

జాకోబ్ చెప్పిన‌ట్టు అది గ‌డ్డ‌క‌ట్టిన స్థితిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా.. మెల్ల‌గా అడుగులు వేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. దానికి మ‌న‌కు ఏదో స‌మీప పోలిక‌లు ఉన్నాయి. అయినా దాన్ని అంగీక‌రించ‌డం చాలా క‌ష్టం.

మొహ‌మాటపడాల్సిన అవ‌స‌రం లేని మ‌రికొన్ని వాస్త‌వాలు కూడా ఉన్నాయి. అస్ప‌ష్ట‌త తొల‌గి నాలోని అసౌక‌ర్య ప‌రిస్థితి కూడా క్ర‌మేణా కరిగిపోయింది. ఏమి జ‌రిగింద‌ని ఆలోచించేలోగానే సిట్ట‌కోసార‌స్ కింది భాగం గురించి జాకోబ్ చాలా ఉత్సాహంగా ఎంతో వివ‌రంగా చెప్పారు.

"ఇప్పుడు మ‌నం క్లొయాకా (విస‌ర్జ‌న మార్గం)ను పున‌ర్నిర్మిద్దాం. రెండు పెద‌వులు తెరుచుకున్న‌ట్టు ఇది ఉంటుంది'' అంటూ జాకోబ్ రెండు వేళ్ల‌తో ''వీ'' చిహ్నాన్ని చూపించారు. "బ‌య‌ట రంగులు రంగులుగా క‌నిపిస్తోంది. ఇక్క‌డే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అది తెరుచుకోవ‌డం లేదు. లాజిక‌ల్‌గా ఆలోచిస్తే దానికి మైక్రోబియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ ఉన్న‌ట్టు ఉంది. అందుకే త‌న గురించి తాను చెప్పుకోవ‌డానికి పిగ్మెంటేష‌న్ ద్వారా రంగులు వెద‌జ‌ల్లుతోంది. ఇదే నిజ‌మైతే భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించే విషయంలో ఇది అద్భుత‌మైన ప్రకటన లాంటిది. ఎగిరే డైనోసార్ల‌లో ఇలాంటి ల‌క్ష‌ణం ఉండ‌గా, వాటి వార‌సులైన ఆధునిక ప‌క్షుల్లో ఇది లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం''అని ఆయన వివ‌రించారు. ప‌క్షుల విస‌ర్ణ‌న మార్గం ఈక‌ల‌తో క‌ప్పి ఉండే సంగతి తెలిసిందే.

డైనోసార్‌లు

ఎన్నో రంగులు..

డైనోసార్లు ర‌క‌ర‌కాల సైగ‌లు చేసేవి. ఎన్నో విధాల‌ రంగుల‌ను గుర్తించ‌గ‌లిగేవి. ప్ర‌స్తుత క్షీర‌దాలు కేవ‌లం రెండు రంగుల‌ను మాత్ర‌మే గుర్తిస్తాయి. డైనోసార్లకు మాత్రం రంగుల‌పై అద్భుతమైన అవ‌గాహ‌న ఉండేది.

ప‌క్షుల మాదిరిగానే డైనోసార్‌ల‌కు కూడా అద్భుత‌మైన క‌ల‌ర్ విజ‌న్ ఉండే అవ‌కాశం ఉంద‌ని జాకోబ్ ఊహిస్తున్నారు. "క్లొయోకాను ఎందుకు అడ్వ‌ర్టైజ్ చేసుకోకూడ‌దు?''అని ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్ర‌స్తుతం ప్ర‌స్తావ‌న‌లో ఉన్న సిట్టాకోసార‌స్ ఆడ‌దా, మ‌గ‌దా అని చెప్ప‌డం క‌ష్టం. వాటికి ఎలాంటి జ‌న‌నాంగాలు ఉన్నాయ‌ని చెప్ప‌డ‌మూ సాధ్యం కాదు. శ‌రీరం లోప‌ల అంత‌ర్గ‌తంగా ఆ భాగాలు ఉండేవి.

అయితే, రెండు విధానాల్లో అవి భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించేవ‌ని ఊహించ‌వ‌చ్చు. మేటింగ్ స్ట్రాట‌జీల విష‌యానికి వ‌స్తే "క్లొయోక‌ల్‌ కిస్‌'' గురించి మనం చెప్పుకోవాలి. దీని కోసం రెండు డైనోసార్లు త‌మ మర్మాంగాల‌ను తెరిచి ద‌గ్గ‌ర‌గా నిలుచుంటాయి. మ‌గ‌ది త‌న‌ వీర్యాన్ని నేరుగా ఆడ‌దాని జ‌న‌నాంగంలోకి విడుద‌ల చేస్తుంది. ప‌క్షుల్లో సాధార‌ణంగా ఇలాగే జ‌రుగుతుంది.

లేదంటే మొస‌ళ్ల మాదిరిగా పురుషాంగం ద్వారా సెక్స్ జ‌రుపుతుంద‌ని భావించ‌వ‌చ్చు.

అయితే, ఇతర‌త్రా ఆధారాలు లేక‌పోవ‌డం, డైనోసార్ల విస‌ర్జ‌న మ‌ర్గాల‌కు సంబంధించి రెండో శిలాజ‌మేదీ ల‌భ్యం కాక‌పోవ‌డంతో దీనిపై ఒక స్పష్టతకు రావడం క‌ష్టం.

కానీ డైనోసార్ల జ‌న‌నాంగాల గురించి ఆ స‌మాచారం బ‌హుశా స‌రిపోవ‌చ్చు. అయితే వాటి పున‌రుత్ప‌త్తి మాటేమిటి? సెక్స్ స‌మ‌యంలో పోట్లాట‌లు లాంటి మేటింగ్ ఉత్స‌వాలు జ‌రిగేవా? అస‌లు మ‌గ‌వి, ఆడ‌వి వేరువేరుగా క‌నిపించేవా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇంత‌వ‌ర‌కు దొర‌క‌లేదు. అలాంట‌ప్పుడు భాగ‌స్వామిని ఆకర్షించడానికి ఏమి చేశాయో ఎలా చెప్ప‌గ‌లం?

సెక్సీ సెయిల్‌

ఎప్పుడో అంత‌రించిపోయిన డైనోసార్ల బాటమ్ ఎలా ఉండేదో తెలుసుకోవడం ఎంత క‌ష్ట‌మో, వాటి లైంగిక ధోర‌ణులు ఎలా ఉండేవో తెలుసుకోవ‌డం కూడా అంతే క‌ష్ట‌సాధ్య‌మైన విష‌య‌మని మొద‌ట్లో అనిపించింది.

కానీ శిలాజ రికార్డుల్లోనే ఇందుకు సంబంధించిన ఆధారాలు అంతర్గతంగా దాగి ఉన్నాయ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ లండ‌న్‌లోని క్వీన్ మేరీ కాలేజీకి చెందిన ఎవ‌ల్యూష‌న‌రీ ఎకాల‌జిస్ట్ రాబ్ నెల్ చెప్పారు.

"డైనోసార్ల‌కు సంబంధించి ఒక విష‌యం ఏమిటంటే వాటి గురించి అద్భుత‌మైన స‌మాచారం ఉంది. అయితే కొంత మంది దీన్ని వెర్రిత‌న‌మ‌ని కొట్టిపారేస్తుంటారు. స్టెగోసార‌స్ శ‌రీరంపై ఉండే ప‌ల‌క‌లు (ప్లేట్స్‌), స్పినోసార‌స్‌కు ఉండే పెద్ద తెర‌చాప (సెయిల్‌), ట్రైసేరాటాప్స్ ఇత‌ర సెర‌టోప్సియ‌న్స్‌కు ఉండే కుచ్చులు (ఫ్రిల్స్‌), కొమ్ములు.. హాడ్రోసార‌స్ త‌ల‌పై ఉండే పెద్ద తురాయి (క్రెస్ట్‌)... ఇవ‌న్నీ లైంగికంగా ఆక‌ర్షించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చిహ్నాలు''అని ఆయన వివ‌రించారు.

చాలా సంద‌ర్భాల్లో ఈ శ‌రీర భాగాల ఉప‌యోగ‌మేమిట‌ని శ‌తాబ్దాలుగా శాస్త్రవేత్త‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతునే ఉన్నారు. ఎన్నో సిద్ధాంతాలు వ‌చ్చాయి. అంత‌గా ఆమోదం పొంద‌ని ఓ సిద్ధాంతం ప్ర‌కారం హాడ్రోసార‌స్‌లు నీటిలో ఉండే జ‌ల‌చ‌రాలు. వాటికి ఉండే పెద్ద క్రెస్ట్‌ గాలి పీల్చ‌డానికి గొట్టాలు, గ‌దుల్లా ఉప‌యోగ‌ప‌డేవి.

మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. 1900లలో టి.రెక్స్ త‌ర‌హా డైనోసార్‌ ఎముకల‌ను మొట్ట‌మొద‌టిసారిగా క‌నుగొన్న‌ప్పుడు వాటికి ఉండే రెండు అతి చిన్న చేతులు వాటివి కావేమోన‌ని అనుకున్నారు.

భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించ‌డానికో, లేక‌పోతే వారి కోసం పోట్లాడ‌డానికో ఆ చిట్టి చేతులు ఉన్నాయ‌ని అన్వ‌యించి చెప్ప‌డానికి గ‌తంలో పాలెయెంతోల‌జిస్టులు నిరాక‌రించేవారు. అయితే వాటి అంతిమ వినియోగం మాత్రం అదేన‌న్న భావ‌న త‌మ‌కు ఉంద‌ని కెల్ తెలిపారు. కానీ వీటిని నిరూపించ‌డానికి ఎలాంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో అవి అశాస్త్రీయ అంచ‌నాలుగానే మిగిలిపోయాయ‌ని ఆయన అభిప్రాయ‌పడ్డారు.

అలా చెప్పలేం..

ఆ చిట్టి చేతులు ఎందుకు ఉన్నాయో తెలియ‌ద‌ని లండ‌న్‌లోని నేచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియంలో పాలియోబ‌యాల‌జీ విభాగంలో సీనియ‌ర్ రీసెర్చ‌ర్‌గా ప‌నిచేస్తున్న సుస‌న్నా మిడ్‌మెంట్ అన్నారు. స్టెగోసార‌స్ వీపుపై ఉన్న ప్లేట్లుగానీ, హాడ్రోసార‌స్‌ల త‌ల‌పై గొట్టాల్లా ఉండే తురాయి రూపంలో ఉండే క్రెస్ట్ ప్ర‌యోజ‌నం ఏమిటో కూడా తెలియ‌దు అని చెప్పారు.

ఇక అధునిక సైన్స్ యుగానికి వ‌ద్దాం. ఈ స‌మ‌స్య‌పై క్షుణ్నంగా అధ్య‌య‌నం చేయాల‌ని 2012లోనే నెల్ నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం జీవిస్తున్న కొన్ని జంతువులకున్న సంభోగ చిహ్నాలు డైనోసార్ల‌లోనూ కనిపిస్తుండటంతో వాటిపై దృష్టి పెట్టారు. ఆ శ‌రీర భాగాల‌కు లైంగిక ఆక‌ర్ష‌ణ త‌ప్ప మ‌రో ప్ర‌యోజ‌నం లేద‌న్న వివ‌ర‌ణ‌లు మాత్రమే ఉన్నాయి. వాటిపై ఇంకో అభిప్రాయం ఏదీ లేక‌పోవ‌డంతో ఆ అసాధార‌ణ ల‌క్ష‌ణాల‌పై నెల్ ప‌రిశోధ‌న చేశారు.

కొమ్ములు, ఫ్రిల్స్ ఉన్న ట్రైసెరాటాప్స్‌, వాటి బంధువులైన సిట్ట‌కోసార‌స్‌ల నెల్ అధ్యయనం చేశారు. సిట్ట‌కోసార‌స్‌ల నోటికి ఇరువైపులా ఉండే కోర‌లు, డిలోఫోసార‌స్‌ల త‌ల‌పై ఉండే క్రెస్ట్‌లు, వాటి క‌ళ్ల‌పై ఉబ్బెత్తుగా ఉండే రెండు ప్ర‌దేశాలు, అతి భారీగా ఉండే డిప్లొడోక‌స్‌ల‌కు ఉండే పొడ‌వాటి మెడ‌, ప‌క్షుల పూర్వీకుల ఈకల‌ను ప‌రిశీలించారు.

అయితే, ఈ శ‌రీర భాగాల ఉప‌యోగ‌మేమిట‌ని తెలుసుకోవ‌డానికి క‌చ్చిత‌మైన మార్గ‌మేమీ లేదు. కానీ అంత‌ర్జాతీయ శాస్త్రవేత్త‌ల బృందం సాయంతో నెల్ మాత్రం త్వ‌ర‌గానే కొన్ని అంశాల‌ను గ‌మ‌నించ‌గ‌లిగారు. ప్ర‌స్తుతం ఉన్న కొన్ని జంతువుల‌ను గ‌మ‌నిస్తే ఏయే శ‌రీర భాగాల‌ను ప‌రిశీలించాల‌నే విష‌య‌మై బ‌ల‌మైన సూచ‌న‌లు దొరుకుతాయి.

మొద‌టగా లైంగిక ద్విరూప‌త‌ను ప‌రిశీలించారు. మ‌గ‌, ఆడ జాతులు వేరువేరుగా క‌నిపించ‌డాన్నే లైంగిక ద్విరూప‌త అని వ్య‌వ‌హ‌రిస్తారు. మ‌నుగ‌డ నిలుపుకోవ‌డానికి అనుస‌రించే వ్యూహాల్లో భాగంగా ఈ రెండు జాతులు పూర్తిగా భిన్న‌మైన జీవ‌న విధానాల‌ను అనుస‌రించ‌డం చాలా అరుదు.

వాటి ల‌క్ష‌ణాలు వేరువేరుగా ఉన్న‌ప్పుడు మాత్రం.. ఆడ జంతువుల‌ను మ‌గ జంతువులు నేరుగా ఆక‌ర్షిస్తాయి. అంద‌మైన పింఛాల‌తో మ‌గ‌ నెమ‌లి ఇదే విధంగా ఆడ‌నెమ‌లిని ఆక‌ట్టుకుంటుంది. మ‌రికొన్ని భాగ‌స్వామిపై హ‌క్కు సంపాదించ‌డానికి ఇంకొక జంతువుతో పోటీ ప‌డుతాయి. మ‌గ‌జింకకు కొమ్ములు ఉండ‌డం ఇందుకోస‌మే.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈ సూచ‌న‌లేవీ డైనోసార్ల‌ను అర్థం చేసుకోవ‌డానికి ఉప‌క‌రించ‌వు. ఎందుకంటే ఇంత‌వ‌రకు దొరికిన శిలాజాలు మ‌గ‌వా, ఆడ‌వా అని శాస్త్రవేత్త‌లు ఇంత‌వ‌ర‌కు చెప్ప‌క‌పోవ‌డ‌మే కార‌ణం. కొన్ని డైనోసార్ల మ‌ధ్య తేడాలు ఉన్న‌ట్టు గ‌మ‌నించినా అవి భిన్న‌మైన జాతులువా? ఆడా, మ‌గా అన్న భేదాలు ఉన్న‌వా అని తెలుసుకోవ‌డానికి వారికి అవ‌కాశ‌మే లేదు.

మరో చర్చకు

అయితే, ఇది మ‌రో హింట్‌పై చ‌ర్చ‌కు దారి తీస్తుంది. ఎవైనా కొన్ని చిహ్నాలు.. పిల్ల, కౌమార‌ డైనోసార్ల‌పై కాకుండా బాగా ఎదిగిన వాటిపై క‌నిపిస్తే అవి సంభోగానికి అర్హ‌త పొందిన‌ట్టు గుర్తు అని అనుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌గ సింహం ముఖంపై వెంట్రుక‌లు క‌నిపిస్తే అది సెక్స్‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు అంచ‌నా వేయ‌వ‌చ్చు. డైనోసార్ల విష‌యంలో ఇలా భావించ‌డం కూడా క‌ష్ట‌మైన ప‌నే.

1942కు ఒక‌సారి వెళ్తే.. అమెరికాలోని మొంటానాలో విశేషంగా క‌నిపించే ఓ పుర్రెను శాస్త్రవేత్త‌లు వెలికి తీశారు. అదొక భ‌యంక‌ర‌మైన మాంసాహారిది. ప్రిడేట‌ర్ కింగ్ టి.రెక్స్ డైనోసార‌స్‌తో పోల్చితే ఇది కొంత‌వ‌ర‌కు చిన్న‌ది. స‌న్న‌నైన‌ది కూడా. ఇది కొత్త‌జాతికి చెందిన ఓ పెద్ద వ‌య‌సు ఉన్న డైనోసార్‌ద‌ని నిర్ధ‌రించారు. ద‌శాబ్దాల పాటు చ‌ర్చించిన అనంత‌రం దానికి నానోటైరాన్న‌స్ అని పేరు పెట్టారు. త‌రువాత సంవ‌త్స‌రాల్లో ఇలాంటివి మ‌రికొన్ని ల‌భించాయి.

2020లో ఓ బృందం వాటిని చాలా నిశితంగా ప‌రిశీలించింది. మ‌రుగుజ్జు టైరానోసార‌స్‌లని భావిస్తూ రెండింటి ఎముకల‌ను విశ్లేషించింది. అవి వేరువేరు జాతుల‌వి కావ‌ని నిర్ధ‌రించింది. టి.రెక్స్ జాతికి చెందిన‌వ‌ని, టీనేజ్ ద‌శ‌లోనే మ‌ర‌ణించాయ‌ని తేల్చింది.

ఈ చిన్న, కౌమార జంతువులు పెద్ద‌వాటిక‌న్నా చాలా విభిన్నంగా క‌నిపించాయి. వాటితో ఏమాత్రం సంబంధం లేద‌న్న‌ట్టుగా ఉండేవి.

ఒక్క టి.రెక్స్ జాతిలోనే కాదు ఇత‌ర జాతుల డైనోసార్స్‌లోనూ వ‌య‌సు పెరిగే కొద్దీ నాట‌కీయ మార్పులు చోటు చేసుకున‌ట్టు భావించ‌వ‌చ్చు.

టోరోసార‌స్‌, ట్రైసెరాటాప్స్‌పై పెద్ద‌యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంద‌ని మెయిడ్‌మెంట్ చెప్పారు. రెండూ డైనోసార్లే. రెండూ దాదాపుగా ఒకేలా క‌నిపిస్తాయి. అయితే టోరోసార‌స్‌ల పుర్రె చాలా పెద్ద‌ది. మెడ చుట్టూ పెద్ద ఫ్రిల్ (కుచ్చు) ఉంటుంది. దానికి పెద్ద రంధ్రాలు ఉంటాయి. భూమిపై తిరుగాడిన జంతువుల్లో ఇదే అతి పెద్ద‌ది.

రెండోది కొంత చిన్న‌ది. దాని ఫ్రిల్ కూడా కొంత‌వ‌ర‌కు చిన్న‌గానే ఉంటుంది. దానికి ఎలాంటి రంధ్రాలు ఉండ‌వు.

అన్నిసార్లూ అలా అనుకోకూడదు..

"ఈ రెండు ర‌కాల డైనోసార్‌లూ ఉత్త‌ర అమెరికాలోని క్రెటాసియ‌స్ ప్రాంతం చివ‌రి భూభాగంలో క‌లిసే జీవించాయి. బాగా ముస‌లిదైన ట్రైసెరాటోప్స్‌నే టోరోసార‌స్ అని కొంద‌రు అంటుంటారు. మ‌రికొంద‌రు మాత్రం ఇవి వేరువేరు జాతుల‌ని భావిస్తుంటార‌''ని మెయిడ్‌మెంట్ తెలిపారు. మిగిలిన‌వి కూడా వివిధ జీవిత ద‌శ‌ల‌కు చెందిన ట్రైసెరాటోప్స్ త‌ప్ప వేరు జాతులు కావ‌ని ఇంకొంద‌రు భావిస్తారు.

అవి వేరే జాతుల‌కు చెందిన‌వ‌ని చాలా మంది వాదిస్తారు. నిజానిక‌యితే అవి వివిధ జీవిత ద‌శ‌ల‌కు చెందిన‌ ట్రైసెరాటాప్స్ మాత్ర‌మే. కానీ ఇందుకు ఎవ‌రూ అంగీక‌రించ‌రు అని మెయిడ్‌మెంట్ వివ‌రించారు.

అందువల్ల ఈ సెక్స్ చిహ్నాల‌ను గుర్తించ‌డానికి అనుస‌రించే వ్యూహాలేవీ అన్నివేళ‌లా ప‌నిచేయ‌వు.

అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఇందుకు మ‌రో మార్గం ఉంది. ఏ శ‌రీర భాగం ఇందుకు త‌ప్ప వేరెందుకు ప‌నికొస్తుంద‌ని అంచ‌నా వేసి మోడ‌ల్‌ను రూపొందిస్తే ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

"మ‌నం ఏమి చెప్పొచ్చు అంటే.. ఈ శ‌రీర భాగం ఈ ప్ర‌యోజ‌నం కోసమే ప‌రిణామం చెందింది. ఇది మ‌రో ఉప‌యోగం క‌లిగించ‌డానికి ఏర్ప‌డ‌లేదు.. అలా అని నిర్ణ‌యించడం ద్వారా అంచనాలు వేయవచ్చు'' అని నెల్ తెలిపారు.

ఉదాహ‌ర‌ణ‌కు ట్రైసెరాటాప్స్‌కు కొంగులా ఉండే ఫ్రిల్‌ను ప‌రిశీలించి ఏళ్ల త‌ర‌బ‌డి శాస్త్రవేత్త‌లంతా వాటి భారీ సైజును చూసి గంద‌ర‌గోళ‌ప‌డ్డారు. ఇందుకు ర‌క‌ర‌కాల వివ‌ర‌ణ‌లు ఇచ్చారు. ఇత‌ర డైనోసార్ల నుంచి మెడ‌ను కాపాడుకోవ‌డం కోసం ఇవి ఉన్నాయ‌ని కొంద‌రు చెప్పారు. ఉష్ణోగ్ర‌త‌ల‌ను నియంత్రించ‌డానికి ఉన్నాయ‌ని మ‌రి కొంద‌రు తెలిపారు. కొమ్ముల‌ను బ‌లంగా ఉప‌యోగించుకునేలా కండ‌రాల‌కు అనుసంధానమై ఉన్నాయ‌న్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

తాజాగా వెల్ల‌డ‌యిన అభిప్రాయాల ప్ర‌కారం త‌మ గుంపులోని స‌భ్యుల‌ను సులువుగా గుర్తించ‌డానికి ఇవి ఉప‌యోగ ప‌డి ఉంటాయ‌న్న వాద‌న ముందుకు వ‌చ్చింది.

దీనిపై ప‌రిశోధ‌న జ‌రిపిన నెల్ ఆయ‌న స‌హ‌చ‌రులు మాత్రం ఈ వాదనతో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని అంటున్నారు. వివిధ జాతుల ట్రైసెరాటాప్స్ ఫ్రిల్స్ విష‌యంలో పెద్ద‌గా తేడాలు లేవ‌ని, అందువ‌ల్ల త‌మ గుంపులోని ఇతర స‌భ్యుల‌ను గుర్తించ‌డానికే ఇవి ఉన్నాయ‌న్న‌ది స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ వాద‌న తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నందున మ‌రో కార‌ణంపై మ‌రింత హేతుబ‌ద్ధంగా ఊహాగానాలు చేయాల్సి ఉంది. ఇత‌ర ట్రైసెరాటాప్స్‌ను ఆకర్షించ‌డానికో, లేదంటే పోట్లాడ‌డానికో ఉప‌యోగ‌ప‌డి ఉంటాయ‌ని భావించ‌వ‌చ్చు.

ప్రియురాలి కోసం యుద్ధాలు

ఆడ ట్రైసెరాటాప్స్ కోసం పోట్లాట‌లు జ‌రిగాయ‌న‌డానికి మ‌రికొన్ని ఆధారాలు దొరికాయి. 2009లో ప‌లు ట్రైసెరాటాప్స్ పుర్రెల‌కు ఉన్న గాయాల‌ను విశ్లేషిస్తూ అధ్య‌య‌నం చేశారు. ఇత‌ర‌ ట్రైసెరాటాప్స్‌తో త‌ర‌చూ పోట్లాట‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించారు. ప్రాచీన కాల‌పు సెక్సువ‌ల్ విభేదాల‌కు ఇవి భ‌యాన‌క‌ సంత‌కాలు లాంటివ‌ని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు.

మ‌రి ఇత‌ర సంభోగాల మాటేమిటి--ప్రీ హిస్టారిక్ ప్లాంట్ చిత్రం నిర్మాత‌లు చెబుతున్న‌ట్టుగా ఆడ‌, మ‌గ డైనోసార్‌లు ఆలింగ‌నం చేసుకునేవా? మ‌గ టి.రెక్స్‌లు త‌మ చిట్టి చేతుల‌తో ఆడ‌దాన్ని హ‌త్తుకొని శృంగారానికి ఆహ్వానించేదా? సెక్స్‌ప‌రంగా ఆధిప‌త్యం కోసం పాచీసెఫ్లోసౌర్స్ యుద్ధానికి దిగి త‌లలు ప‌గుల‌గొట్టుకోవ‌డం సాధ్య‌మేనా? మ‌గ వెలొసిరాప్ట‌ర్ విశాల‌మైన‌, అంద‌మైన పొద‌రిల్లును నిర్మించేదా? వాటిని బ్లూ బెర్రీల‌తో అందంగా అలంక‌రించేదా?

కొంచెం విశాల దృక్పథంతో మాట్లాడితే అవి అలా చేసి ఉండొచ్చు అని నెల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో డైనోసార్‌లు, ప‌క్షుల మ‌ధ్య పోలిక‌లు ఉన్నాయి. ఎందుకంటే ప‌క్షుల‌కు కేవ‌లం ముక్కు మాత్ర‌మే ఉంది. దంతాలు లేక‌పోవ‌డం అన్న‌ది త‌మ పూర్వికుల నుంచి వారస‌త్వంగా వ‌స్తున్నదే.

ఎగిరే డైనోసార్‌ల విష‌యంలో ఇది నిజ‌మే. అవే ఆధునిక ప‌క్షులుగా ప‌రిణామం చెందాయి.

ఆధునిక ట‌ర్కీ కోళ్లులా క‌నిపించే వెలొసిర‌ప్టార్స్‌లు ఇలా ఆక‌ర్షించేవి. జురాసిక్ పార్కు సినిమాలో చూపించిన‌ట్టు అవి అంత నున్న‌గా ఉండే డైనోసార్లేమీ కావు.

"ఈ రోజుల్లోని ప‌క్షుల‌ను చూడండి. అవి ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తుంటాయి. అలాంట‌ప్ప‌డు డైనోసార్లు మాత్రం ఎందుకు వేరే విధంగా చేయాలి? మేటింగ్ కోసం ప‌క్షుల్లో లేని విధానాన్ని ఏదో డైనోసార్‌లు అనుస‌రించేవ‌ని చెప్పడానికి కార‌ణాలు ఏవీ లేవు. అయితే విభిన్న‌మైన విన్యాసాన్ని మాత్రం చేసేవి'' అని నెల్ చెప్పారు.

ఆశ్చ‌ర్య‌క‌రంగా దీనికి సంబంధించి కొన్ని భౌతిక ఆధారాలు కూడా ల‌భించాయి. 2016లో శాస్త్రవేత్త‌లు కొల‌రాడోలో త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ప్పుడు రాతి ప‌ల‌క‌ల‌పై గాట్లులాంటివి క‌నిపించాయి. ఇవి ప్రాచీన కాలంనాటి చిన్న‌చిన్న‌ నీటి గుంట్ల‌ల్లా అనిపించాయి.

వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన‌ప్పుడు వాటిని కాలితో గోకిన‌ట్టు గుర్తులు క‌నిపించాయి. మూడు వేళ్లు ఉన్న పాద ముద్ర‌లు కూడా ఉన్నాయి. టి.రెక్స్ లాంటి డైనోసార్‌ల ఉనికికి ఇవి చిహ్నాలు. అవి క్రెట‌సియ‌స్ కాలానికి చెందిన‌వి.

ఇవేవో అనుకోని అల‌ల వంటి నీటి క‌ద‌లిక‌ల కార‌ణంగా ఏర్ప‌డిన చారిక‌లు కావు. అవి డైనోసార్‌లు చేసిన‌వే. ప్ర‌స్తుతం ఆస్ట్రిచ్ ప‌క్షులు ఇంత‌పెద్ద‌వి కాక‌పోయినా ఇలాంటి విల‌క్ష‌ణ విన్యాసాలే చేస్తుంటాయి.

మూడ్‌లోకి తీసుకురావడానికి..

ఆడ ఆస్ట్రిచ్‌లు ఓ ప‌ట్టాన లొంగ‌ని ప్రేమికులు. వాటిని మూడ్‌లోకి తీసుకొనివ‌చ్చి ఆక‌ర్షించ‌డానికి మ‌గ ఆస్ట్రిచ్‌లు ఎన్నో ర‌కాల డ్యాన్స్‌లు చేయాల్సి ఉంటుంది. ప‌రుగు పెట్టడం, రెక్క‌లు ఆడించ‌డం ఇందులో భాగ‌మే. త‌వ్వ‌కంలో నైపుణ్యాన్ని కూడా అవి ప్రదర్శిస్తుంటాయి.

10 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఆ రాతి జాడ‌ల నిర్మాత‌లు కూడా ఇలాంటి విన్యాసాలే చేసి ఉంటార‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

డైనోసార్‌ల మేటింగ్‌కు సంబంధించిన చ‌మ‌త్కార‌మైన వివ‌రాలు మ‌న‌కు ఎన్న‌టికీ తెలిసే అవ‌కాశం లేద‌ని నెల్ చెప్పారు. ప‌రిణామ క్ర‌మంలో వాటికి ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్న‌ ప్ర‌స్తుత ప‌క్షుల‌ను ప‌రిశీల‌న‌గా చూసిన‌ప్పుడు కూడా ఎలాంటి వివ‌రాలు ల‌భించ‌వు. ఇవ‌న్నీ భిన్న‌మైన విన్యాసాలు చేస్తుంటాయి.

అవి ఏమి చేసేవ‌న్న‌దానిపై ఎంతో ప్ర‌య‌త్నించి అంచ‌నాలు వేసినా నాటి వివ‌రాలేవీ దొర‌క‌వు అని నెల్ చెప్పారు.

మ‌రి డైనోసార్‌ల జీవితాల‌కు సంబంధించి గ‌తంలో ఊహ‌కు కూడా అంద‌ని విష‌యాలు ఇటీవ‌ల కాలంలో వెలుగులోకి వ‌చ్చాయి. ఎవ‌రికి తెలుసు-- ప్రేమ‌ను పొంద‌డానికి డైనోసార్లు ఏం చేశాయో అన్న స‌మాచారం కూడా రానున్న ద‌శాబ్దాల్లో అందుబాటులోకి రావొచ్చ‌మో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did dinosaurs have sex... How did they invite females for sex?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X