వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశా హోటల్‌లో రష్యా ఎంపీ ఎలా చనిపోయాడు? కొనసాగుతున్న సస్పెన్స్...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పావెల్ ఆంటోవ్

ఒడిశాలోని ఒక హోటల్లో రష్యా ఎంపీ, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్ చనిపోయారు. ఆయన స్నేహితుడు వ్లాదిమర్ బెడెనోవ్ కూడా అదే హోటల్లో చనిపోయాడు. పావెల్ కిందపడడం వల్ల అంతర్గత గాయాలతో చనిపోయారని, బెడెనోవ్ గుండెపోటుతో మృతి చెందారని పోలీసులు తెలిపారు.

పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బుధవారం పోలీసులు ఈ సమాచారాన్ని వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రం రాయగడ నగరంలోని ఒక హోటల్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యా పర్యాటకులు మృతి చెందారు. వారి మరణానికి గల కారణాలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

ఈ కేసును ఒడిశా ప్రభుత్వం, సీఐడీకి అప్పగించింది. అదే సమయంలో ఈ ఘటనపై దృష్టి సారించిన మానవ హక్కుల కమిషన్ కేసును నమోదు చేసింది.

ఒకే హోటల్‌లో బస చేసిన ఇద్దరు రష్యా టూరిస్టులు అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు పెద్ద విషయంగా మారింది.

రాయగడ నగరంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్‌లో వ్లాదిమర్ బెడెనోవ్ (61), ఆయన స్నేహితుడు పావెల్ ఆంటోవ్ (65) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

డిసెంబర్ 22న బెడెనోవ్, తన హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రెండు రోజుల తర్వాత, శనివారం సాయంత్రం హోటల్‌లోని పూల్‌లో రక్తసిక్తంగా పడి ఉన్న రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్‌ని హోటల్ సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆయన కూడా మరణించారు.

హోటల్‌లోని కిటికీ నుంచి కిందపడటంతో ఆంటోవ్ మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే, హోటల్ సిబ్బంది ఎవరికీ పడిపోతున్న శబ్ధం ఏదీ వినిపించకపోవడం ఆశ్చర్యకరం.

ఇద్దరు విదేశీ పర్యాటకులకు సంబంధించిన మృతి కావడంతో ఒడిశా ప్రభుత్వం, ఈ కేసును రాష్ట్ర నేర విభాగానికి అప్పగించింది.

బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్న క్రైం బ్రాంచ్, దర్యాప్తును మొదలుపెట్టింది.

రష్యన్ల మృతి

అంతర్జాతీయ మీడియాలో చర్చ

ఈ ఇద్దరు టూరిస్టుల మృతి విషయం కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మీడియా చర్చల్లోనూ నిలిచింది. ఇంతలా చర్చనీయాంశం కావడానికి మరో కారణం యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎంపీ ఆంటోవ్ విమర్శించడం.

లండన్‌కు చెందిన డెయిల్ మెయిల్ వార్తా సంస్థ ఆంటోవ్‌ను పుతిన్‌కు బద్ధ వ్యతిరేకిగా అభివర్ణించింది. అదే సమయంలో 'న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై రష్యా క్షిపణి దాడులపై ఆంటోవ్ విమర్శల గురించి ప్రస్తావించింది.

ఈ ఇద్దరు రష్యా పర్యాటకుల మరణాల్లో కుట్ర కోణం (ఫౌల్ ప్లే) ఉండే అవకాశాలను కోల్‌కతాలోని రష్యా కాన్సులేట్ అధికార ప్రతినిధి ఖండించారు.

దర్యాప్తులో ఏం జరిగింది?

ఆంటోవ్, బెడెనోవ్‌తో పాటు వచ్చిన రష్యా దంపతులు తురోవ్, నటాలియాలతో పాటు ట్రావెల్ ఏజెంట్ జితేంద్ర సింగ్‌ను క్రైం బ్రాంచ్ బృందం విచారిస్తోంది.

ఈ ముగ్గురిని రాయగడ నుంచి భువనేశ్వర్‌కు తరలించారు. క్రైం బ్రాంచ్ ఐజీ అమితేంద్రనాథ్ సింగ్ అర్ధరాత్రి వరకు వారిని విచారించారు.

బుధవారం రోజున ఈ ముగ్గురిని కటక్‌లోని క్రైం బ్రాంచ్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ వారిని సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మిఖైల్ తురోవ్

ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పారు?

నలుగురు స్నేహితులైన వ్లాదిమర్ బెడెనోవ్, పావెల్ ఆంటోవ్, మిఖైల్ తురోవ్ (63), నటాలియా పనసెంకో డిసెంబర్ 19వ తేదీన దిల్లీకి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్‌తో కలిసి భువనేశ్వర్ వచ్చారు. ఒడిశాలోని ఆదివాసి ప్రాంతాలను సందర్శించేందుకు వారు ఇక్కడికి వచ్చారు.

ట్రావెల్ ఏజెంట్ జితేంద్ర సింగ్ చెప్పినదాని ప్రకారం, వారు మరుసటి రోజు భువనేశ్వర్ నుంచి కంధమల్ జిల్లాలోని హిల్ స్టేషన్ దారింగ్‌బాడీకి వెళ్లారు. దారింగ్‌బాడీ నుంచి బుధవారం సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో రాయగడలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్‌లో బస కోసం దిగారు.

''డిసెంబర్ 22న అంటే గురువారం మేం కోరాపుట్ వెళ్లాల్సి ఉంది. కానీ, ఆరోజు ఉదయం మేం బయల్దేరబోయే ముందు బెడెనోవ్ అపస్మారక స్థితిలో ఉన్నారని మాకు తెలిసింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ అప్పటికే ఆయన చనిపోయారు’’ అని ట్రావెల్ ఏజెంట్ జితేంద్ర చెప్పారు.

ఒడిశాకు చేరుకున్నప్పటి నుంచి బెడెనోవ్ చాలా ఎక్కువగా మద్యం తాగుతూనే ఉన్నారని జితేంద్ర తెలిపారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు గదిలో చూస్తే ఖాళీ మద్యం సీసాలు కనిపించాయని చెప్పారు.

పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం, కార్డియాక్ అరెస్ట్ కారణంగా బెడెనోవ్ మరణించారని పోలీసులు వెల్లడించారు.

అయితే, ఆంటోవ్ మృతికి గల కారణాల విషయంలో ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. తన మిత్రుడి మరణంతో తీవ్ర షాక్‌కు గురైన ఆయన హోటల్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఒక కారణంగా చెబుతున్నారు.

ఆయన బహుశా అతిగా మద్యం సేవించి మత్తులో పైనుంచి జారి కిందపడి మరణించి ఉంటారని మరో కారణాన్ని చూపిస్తున్నారు. అయితే, ఈ రెండు కారణాలు ఊహాగానాలు మాత్రమే.

సాయి ఇంటర్నేషల్ హోటల్

ఇద్దరిని దహనం చేయడంపై సందేహాలు

ఈ ఇద్దరు రష్యా పర్యాటకుల మృతదేహాలను దహనం చేయడంపై కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఒడిశాలోని ఒక హోటల్‌లో రష్యా ఎంపీ పావెల్ ఆంటోవ్ మృతి చెందడంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంటోవ్‌ది అసహజ మరణం అని మనీశ్ తివారీ అన్నారు. పోలీసులు ఆంటోవ్ మృతిని ఆత్మహత్యగా లేదా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడటంతో జరిగిన మరణంగా పిలుస్తున్నారు.

ఈ మేరకు తన అనుమానాలను వ్యక్తం చేస్తూ మనీష్ తివారీ ఒక ట్వీట్ చేశారు. క్రిస్టియన్లు అయిన ఆంటోవ్, బెడెనోవ్‌ల మృతదేహాలను ఖననం చేయకుండా, రష్యాకు పంపించకుండా ఎందుకు దహనం చేశారని ఆయన ప్రశ్నించారు.

అయితే, మృతుల కుటుంబ సభ్యులతో పాటు రష్యా దౌత్య కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే మెజిస్ట్రేట్ సమక్షంలో నిబంధనల ప్రకారమే ఇలా చేశామని డీఐజీ రాజేశ్ పండిత్ చెప్పారు.

https://twitter.com/ManishTewari/status/1607968625281077250

ఫోర్బ్స్ జాబితాలో ఆంటోవ్

మాస్కోకు తూర్పున ఉన్న వ్లాదిమర్ నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తి ఆంటోవ్. ఆయన ఒక బిలియనీర్ కూడా.

వ్లాదిమర్ ప్రావిన్షియల్ అసెంబ్లీలో పావెల్ ఆంటోవ్ కీలక సభ్యుడు. వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన ఒక కమిటీకి ఆయన చైర్మన్‌గా ఉన్నారు.

ప్రావిన్షియల్ అసెంబ్లీ స్పీకర్ వ్యాచెస్పావ్ కార్తుఖిన్ మాట్లాడుతూ, ఆంటోవ్ మరణం విషాదకరంగా సంభవించిందని అన్నారు.

''రాయగడ నగరంలోని ఒక హోటల్ కిటికీ నుంచి కిందపడటంతో ఆంటోవ్ మరణించారు’’ అని రష్యా మీడియాలో ఆంటోవ్ మరణానికి సంబంధించిన వార్తలు వచ్చాయి.

ఆంటోవ్ స్నేహితుడు బెడెనోవ్ కూడా అదే హోటల్‌లో చనిపోయారని వార్తల్లో పేర్కొన్నారు.

పావెల్ ఆంటోవ్ 2019లో మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ 'వ్లాదిమర్ స్టాండర్డ్’ను నెలకొల్పారు.

రష్యాకు చెందిన అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో 140 మిలియన్ డాలర్ల (రూ. 1,159 కోట్లు) సంపదతో ఆంటోవ్ కూడా చోటుదక్కించుకున్నారు.

రష్యా యుక్రెయిన్ యుద్ధం

యుక్రెయిన్ యుద్ధాన్ని ఆంటోవ్ వ్యతిరేకించారా?

పాల్ కిర్బీ, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత, రష్యా చర్యను విమర్శించిన చాలా మంది వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించారు.

బిలియనీర్ ఆంటోవ్ కేసు ఇలా మరణించిన వారి జాబితాలో తాజాది.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఆంటోవ్ విమర్శించారు. అయితే, కొన్నిరోజుల తర్వాత తన వ్యాఖ్యలను ఆంటోవ్ వెనక్కి తీసుకున్నారు. ఈ విమర్శల కారణంగా ఆయనను పుతిన్ వ్యతిరేకిగా చూడటం మొదలుపెట్టారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని తాను వ్యతిరేకించానని వస్తోన్న వార్తలను గతేడాది జూన్‌లో ఆంటోవ్ ఖండించారు. రష్యాపై విమర్శలకు సంబంధించిన సందేశాన్ని ఆయన ఒక వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తాను సమర్థకుడిని అని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

అయితే, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు చెందిన అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనుమానాస్పద రీతిలో మరణించారు.

2022 సెప్టెంబర్ 1న రష్యా ఆయిల్ కంపెనీ లుకోయిల్ అధిపతి రవిల్ మాగనోవ్ ఒక ఆసుపత్రి కిటికి నుంచి కిందపడి చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did Russian MP die in Odisha hotel? Ongoing suspense...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X