వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గత ఏడాది మే 13న కొన్ని ట్విటర్ అకౌంట్‌లు, యూట్యూబ్ ఛానెళ్లు... 'లిబరల్ డోజే'ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అందులో పాకిస్తానీ అమ్మాయిలు ఈద్ జరుపుకొంటున్న ఫొటోలు, వాటిపై అభ్యంతరకర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఈ లైవ్ స్ట్రీమ్‌కు ''పాకిస్తానీ గర్ల్స్ రివ్యూ: తమ పదునైన చూపులతో మిమ్మల్ని వేటాడతారు’’ అని హెడ్‌లైన్ పెట్టారు.

sm

ఈ ఛానల్ వీడియోలన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలతో నిండి ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఛానెల్‌ను యూట్యూబ్ రద్దు చేసింది.

మే 13నాటి లైవ్ స్ట్రీమ్‌లో పాకిస్తానీ అమ్మాయిలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వారిని తిట్టారు. అంబ్రీన్ అనే పాకిస్తానీ యువతి ఈ కామెంట్లపై ట్వీట్ చేశారు.

''ప్రతి పాకిస్తానీ అమ్మాయి తన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగిస్తోంది. కొందరు అకౌంట్లను రద్దు చేసుకుంటున్నారు. వారు అభద్రతా భావంలో ఉన్నారు. భయపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

https://twitter.com/Nostalgicc_A/status/1392926910179680256

దీని వెనక ఉన్నదెవరు?

ఈ లైవ్ స్ట్రీమ్‌లో దాదాపు 40 మంది పాకిస్తానీ అమ్మాయిల ఫొటోలను వారి అనుమతి లేకుండా పోస్ట్ చేశారు. 500 మందికి పైగా వ్యక్తులు ఆ లైవ్ స్ట్రీమ్‌లో జాయినయ్యారు. వారు అమ్మాయిలకు రేటింగ్స్ ఇస్తున్నారు.

దిల్లీకి సమీపంలో నివసించే 23 ఏళ్ల రితేశ్ ఝా వీటన్నింటి వెనుక ఉన్నారు.

ఘటన జరిగిన 8 నెలల తర్వాత బీబీసీతో రితేశ్ ఝా మాట్లాడారు.

''నేను అప్పట్లో కోపంతో రగిలిపోయాను. హిందూ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్, రెడిట్, టెలిగ్రామ్‌లలోని కొందరు ముస్లిం వ్యక్తుల హ్యాండిల్స్‌ పోస్ట్ చేయడం గమనించాను. వీటికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను. నేనూ అదే తప్పు చేశాను. తర్వాత క్షమాపణ చెబుతూ వీడియో పోస్ట్ చేశాను’’ అని వివరించారు.

'సుల్లీ డీల్స్','బుల్లీ బాయి'లాంటి యాప్‌ల తయారీదారులు, రితేశ్ ఝా ఒకరినొకరు ఎప్పుడూ ముఖాముఖిగా కలుసుకుని ఉండకపోవచ్చు. కానీ, వారంతా ఒకేరకమైన భావజాలంతో ప్రభావితమైన యువకులు.

వీరంతా ఇంటర్నెట్‌లో వారిలోని మరో రూపాన్ని ముందుకు తెస్తుంటారు.

విద్వేషం వివిధ రూపాలలో

ముస్లింలపై ద్వేషం అనేక కోణాలను తీసుకుంటోంది. ముస్లిం మహిళల ఫొటోలను ఆన్‌లైన్‌లో వేలం వేయడానికి రూపొందించిన 'సుల్లీ డీల్స్', 'బుల్లీ బాయి' యాప్‌ల నుంచి.. యూట్యూబ్‌లో పాకిస్తానీ అమ్మాయిల ఫొటోలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, క్లబ్‌హౌస్ యాప్‌లో ముస్లిం యువతుల శరీరభాగాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వరకు అనేక రూపాలున్నాయి.

ఈ ద్వేషానికి కేవలం ముస్లిం మహిళలు మాత్రమే బాధితులు కాదని మాకు అర్థమైంది. హిందూ మహిళల ఫొటోలనూ నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి వారినీ వేధిస్తున్నారు. అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. దళితులపై విమర్శలు చేస్తున్నారు. అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నారు.

ఈ రాడికల్ రైట్‌వింగ్ ఆన్‌లైన్ ప్రపంచంపై మా పరిశోధనలో భాగంగా... ఈ ప్రపంచాన్ని పెంచిపోషిస్తున్న వారితో, ఇందులో ఎక్కువమందిని భాగస్వాములను చేస్తున్న వ్యక్తులతో మేం మాట్లాడాం.

ఎప్పటి నుంచి మొదలైంది?

2013-14లో నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటిసారి భారతదేశంలో రైటిస్ట్ భావజాలపు బలమైన వేవ్ కనిపించింది.

ఆ సమయంలో తాను మొదటిసారిగా మొబైల్ ఫోన్ వాడటం మొదలు పెట్టానని రితేశ్ ఝా చెప్పారు. అప్పటికి ఆయన తొమ్మిదో తరగతిలో ఉన్నారు. తనకు చదువు మీద అంత శ్రద్ధ ఉండేది కాదు.

''సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చేవి. రాజకీయ నాయకులు ప్రసంగాలు వినిపిస్తుండేవి. 'హిందూమతం ప్రమాదంలో ఉంది’, 'వాళ్లు ఒకరిని చంపితే, మనం పదిమందిని చంపాలి’ లాంటి నినాదాలు వినిపించేవి’’ అని రితేశ్ గుర్తు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో నిరంతరం హిందూ-ముస్లిం మతాలకు సంబంధించిన వాదోపవాదాలు, చర్చల్లో పాలు పంచుకునేవారు రితేశ్. పాకిస్తానీ పౌరులతో ఆన్‌లైన్‌ వాగ్వాదానికి దిగేవారు.

''మీరు ఎప్పుడు రాడికల్‌గా మారిపోయారో మీకు తెలియదు. మీలో కోపం నిండిపోతుంది. మీ మతం కారణంగా మిమ్మల్ని తక్కువ చేస్తున్నారన్న భావన కలుగుతుంది. వివక్ష చూపుతున్నారన్న ఆగ్రహం ఉంటుంది. అప్పుడు మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హింసల గురించి ఆలోచించడం మొదలు పెడతారు’’ అన్నారు రితేశ్.

ట్రైనింగ్ తీసుకుని ఆన్‌లైన్ మీద పట్టుసాధించారు రితేశ్. యూట్యూబ్‌లో 15-20 ఛానెళ్లను ప్రారంభించారు. తక్కువ సమయంలో ఆయన ఛానెళ్ల యూజర్లు లక్షలకు చేరుకున్నారు. వాటి నుంచి డబ్బు కూడా సంపాదించడం ప్రారంభించారు.

ఈ ఛానెళ్లలో ముస్లింలకు సంబంధించిన హలాల్, బురఖా, అధిక సంతానం లాంటి అంశాలపై మాట్లాడేవారు. తన డార్క్ హ్యూమర్‌ కు 'డోజే పంథ్’ అని పేరు పెట్టారు. ఫిర్యాదులు రావడంతో ఈ యూట్యూబ్ ఛానెళ్లన్నీ రద్దయ్యాయి.

రితేశ్ తర్వాత కొత్త ఛానెళ్లు ప్రారంభించారు. విషయం మాత్రం పాతదే. అన్ని వీడియోలలో ముస్లింల వ్యతిరేక ధోరణితో వార్తలు, రిపోర్టులు ఇస్తుంటారు.

ఈ వీడియోల ప్రారంభంలో ఒక డిస్‌క్లెయిమర్ ఉంటుంది. భారత రాజ్యాంగంలో పొందు పరిచిన వాక్‌ స్వాతంత్ర్యం గురించి ఇందులో ఉంటుంది. యూట్యూబ్ కమ్యూనిటీ నిబంధనలు పాటిస్తున్నట్లు చెబుతుంది.

ఇదంతా 'డార్క్ హ్యూమర్' అని రితేశ్ అంటారు. టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్, బ్యూటీ కాంటెస్ట్‌లాంటిదే ఇది కూడా అంటారాయన.

https://twitter.com/ani/status/1480029411155988486

ఇలాంటి వీడియోలను ఎవరు తయారు చేస్తారు?

శ్వేతాసింగ్, వయస్సు 18 సంవత్సరాలు. విశాల్ ఝా, మయాంక్ రావత్, నీరజ్ బిష్ణోయ్‌‌ల వయస్సు 21 సంవత్సరాలు. ఓంకారేశ్వర్ ఠాకూర్‌కు 26 ఏళ్లు, నీరజ్‌ సింగ్‌కు 28 సంవత్సరాలు. 'సుల్లీ డీల్స్', 'బుల్లీ బాయి' యాప్‌ను తయారు చేసినందుకు వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

'క్లబ్‌హౌస్’ కేసులో అరెస్టైన యశ్‌ పరాశర్‌ వయసు 22 సంవత్సరాలు. జైష్ణవ్‌ కక్కర్‌ వయసు 21, ఆకాశ్ వయసు 19 ఏళ్లు.

ఇంటర్‌నెట్‌లో.. మనం ఎవరో తెలియకుండా ఉంచే విధానాల వల్ల చాలామంది మమ్మల్ని ఎవరూ పట్టుకోరన్న ధీమాతో ఉంటారు. దీంతో క్రూరత్వం పెరుగుతుంది. అది ప్రమాదకరమైన రూపం తీసుకుంటుందని ముంబయి పోలీస్ విభాగంలో మొదటి సైబర్ సెల్‌ను ప్రారంభించిన స్పెషల్ ఐజీ బ్రజేశ్ సింగ్ అంటారు.

''ఇలాంటి వారిని పట్టుకునేందుకు అనేక యాంటీ-ఫొరెన్సిక్ విధానాలున్నాయి. కానీ, వీళ్లంతా దొరక్కుండా ఉండేందుకు వీపీఎన్, టోర్, వర్చువల్ మెషీన్, ఎన్‌క్రిప్షన్‌ లాంటి వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు’’ అని బ్రజేశ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ట్విట్ట‌ర్‌లో ముస్లిం మహిళలను ట్రోల్ చేస్తున్న 'ట్రేడ్స్’ అనే గ్రూపులో కూడా ఓంకారేశ్వర్ ఠాకూర్ సభ్యుడని అతని అరెస్టు సందర్భంగా దిల్లీ పోలీస్ డీసీపీ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.

ఇండియన్ రాడికల్ రైట్ వింగ్- ట్రేడ్స్

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైట్ వింగ్ భావజాలానికి ప్రచారం బాగా పెరిగిందని చెబుతారు.

ఇలాంటి రైటిస్ట్ భావజాలం ఉన్న రెండు ప్రధాన గ్రూపుల్లో ఒకట ట్రేడ్స్ కాగా, మరొకటి 'రైతా’. వీటి గురించి ఇటీవలే చాలామందికి తెలిసింది.

'ట్రేడ్స్’ 'రైతా’ అనే వీటి పేర్లలోనే వాటి భావజాలం ఉంది. పాత సంప్రదాయాలను నిలబెట్టాలన్నది ఆయా గ్రూపులలోని వారు బలంగా నమ్ముతారు.

సంప్రదాయాన్ని వదులుకోవద్దని, సతీ సహగమనం గొప్ప ఆచారమని, బాల్య వివాహాలు మంచివని, పరదా పద్ధతి సరైనదేనని, కుల వ్యవస్థలో బ్రాహ్మణులు అగ్రస్థానంలో ఉండాలని వీరు వాదిస్తారు.

ఇలాంటి వారంతా ప్రధాని నరేంద్ర మోదీని అభిమానించాలని ఏమీ లేదు. వీరిలో కొందరు మోదీని వ్యతిరేకిస్తారు. స్త్రీలు ఉద్యోగాలు చేయరాదని, ఇంట్లోనే ఉండాలని వాదిస్తుంటారు.

'బుల్లీ బాయి', 'సుల్లీ డీల్స్' బాధితురాలు సానియా సయ్యద్ 'ట్రేడ్స్’ గ్రూప్ గురించి మాట్లాడారు.

''ఇందులో ఒకరిద్దరు లేరు. 20-23 ఏళ్ల వయసున్న వారు చాలామంది ఉంటారు. వాళ్లు కేంద్రంలో(ప్రభుత్వంలో) ఒక బలమైన, నియంతలాంటి నాయకుడు ఉండాలని కోరుకుంటారు’’ అని అన్నారు.

''వీళ్లంతా హత్యలను, క్రూరమైన చర్యలను మెచ్చుకుంటారు. కులవ్యవస్థను నమ్ముతారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఉండకూడదని అంటారు’’ అని సానియా తెలిపారు.

గ్రూప్‌లలో ఏం బోధిస్తారు?

ట్విటర్‌లో హెచ్చార్ అనే పేరున్న హ్యాండిల్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తి తాను కూడా 'ట్రేడ్స్’ గ్రూపులో భాగస్వామినని వివరించారు.

ఆయన దళితుడు. అయితే, తన అసలు పేరును దాచాలని ఆయన అభ్యర్థించారు.

2020 సంవత్సరం ప్రారంభంలో ఆయన ట్రేడ్స్ గ్రూప్‌కు చెందిన ఇన్‌స్టా ఎకౌంట్‌లో హెచ్చార్‌ ను చేర్చారు. సోషల్ మీడియాలో ముస్లింలతో సమర్థంగా వాదించగలనని ఆయన చెప్పుకొచ్చారు.

హిందూ మతం గురించి సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడమే ఈ గ్రూప్ ఉద్దేశమని ఆయనకు ట్రేడ్స్ నిర్వాహకులు చెప్పారు.

హెచ్చార్‌ అలా ట్రేడ్స్ గ్రూపులో చేరారు. ''నేను హిందూ మత సంప్రదాయాలైన సతీ సహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం వంటి వాటిని నమ్ముతాను. నేను మన గత చరిత్రను చూసి గర్విస్తాను. అందుకే ఆ గ్రూపులో చేరాను’’ అని ఆయన వెల్లడించారు.

14-15 ఏళ్లలోపు హిందూ యువతను ఈ గ్రూపులో చేర్చాలని హెచ్చార్‌ని ట్రేడ్స్ గ్రూప్ కోరింది.

అయితే, కాలక్రమేణా ఆ గ్రూపు సభ్యులు ద్వేషం, హింసా ప్రవర్తనను ప్రోత్సహించారని, దళితులను హిందువులుగా పరిగణించక పోవడం, హిందూ దేశాన్ని సృష్టించాలనడం, ముస్లిం మహిళలపై అత్యాచారం చేయాలనడం లాంటివన్నీ తాను గమనించినట్లు హెచ్చార్‌ వెల్లడించారు.

వీటితోపాటు పరువు హత్యలను సమర్థించే వారని, కులాంతర, మతాంతర వివాహాలను వ్యతిరేకించాలని, అలా చేసుకునే వారిని బెదిరించాలని కూడా చెప్పినట్లు హెచ్చార్‌ తెలిపారు.

'ట్రేడ్స్’ గ్రూపులో వేధింపులు అధికంగా ఉండేవని, ఇందులో చేరిన కొందరు యువతులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని హెచ్చార్‌ వెల్లడించారు.

అయితే, 'ట్రేడ్స్’ గ్రూప్ భావజాలాన్ని సమర్థించే వారిలో కేవలం అబ్బాయిలే ఉండరని, అమ్మాయిలు కూడా ఉన్నారని, పరదా పద్ధతిని వారు సమర్థిస్తారని, అలాగే కర్వాచౌత్‌ లాంటి పండగలకు దూరంగా ఉండే మగవారిని ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా చేస్తుంటారని హెచ్చార్‌ చెప్పారు.

'ట్రేడ్స్’ గ్రూపులో ఉన్నంతకాలం హెచ్చార్‌ తన కులాన్ని వెల్లడించలేదు.

''నేను వారికి కొన్ని విషయాలను వివరించాలనుకునేవాడిని. కానీ, వారు వినేవారు కాదు. ఒక్కోసారి వీళ్లకు అసలు హృదయం లేదని అనిపించేది’’ అని హెచ్చార్‌ చెప్పుకొచ్చారు.

''తమ ప్రాంతంలో ముస్లిం యువకుడిని ఎలా కొట్టామో గొప్పగా చెప్పుకునేవారు. దాని వీడియోలను 'ట్రేడ్స్’ గ్రూప్‌లో షేర్ చేసుకునేవారు’’ అన్నారు హెచ్చార్.

చివరకు హెచ్చార్ ట్రేడ్స్ గ్రూప్ నుంచి బయటకు వచ్చారు. ఇలాంటి గ్రూప్‌లను అడ్డుకోవడానికి ఆయన తనలాంటి మనస్తత్వం ఉన్నవారితో కలసి కృషి చేస్తున్నారు.

'ట్రేడ్స్’తో విభేదించే వారు 'రైతా’

రైట్ వింగ్ అయినప్పటికీ, తమ భావజాలాన్ని అంగీకరించని వారిని 'రైతా’ అని పేరు పెట్టి పిలవడం ప్రారంభించారు ట్రేడ్స్ గ్రూప్ సభ్యులు.

మోనా శర్మ హిందూ రైట్-వింగ్‌కు చెందినవారు. ఆమెను కూడా 'రైతా’ కింద జమకట్టారు. అయితే, ఈ పదాన్ని వాడటం అవమానకరంగా భావిస్తారు మోనా శర్మ.

''రైతా గ్రూప్ సభ్యులు సంఘ్ భావజాలికులు. వీరు బీజేపీకి మద్ధతుదారులు. మోదీ, యోగీలాంటి నేతలను వారు అభిమానిస్తారు. ట్రేడ్స్‌తో పోలిస్తే వీరు చట్టానికి లోబడి వ్యవహరిస్తారు’’ అంటూ మోనా శర్మ రెండు గ్రూపుల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.

ప్రగతిశీల అభిప్రాయాలను వ్యక్తపరచడం వల్ల తనను ట్రేడ్స్ గ్రూప్ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారని, వేశ్యనంటూ దుర్భాషలాడారని, తన భర్త వ్యక్తిగత సమాచారాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారని మోనా శర్మ చెప్పారు.

ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో తాను ఉదారవాద, వామపక్ష భావజాలికులతో వాదోపవాదాలు చేస్తుంటానని, వారిని ట్రోల్ కూడా చేస్తుంటానని మోనా అంగీకరించారు. అయితే, ట్రేడ్స్ చాలా ప్రమాదకరమైందని ఆమె అన్నారు.

''వాళ్ల ఆలోచనలు తాలిబాన్ల మాదిరిగా ఉంటాయి. మహిళలు ఇంట్లోనే ఉండాలని, పిల్లలను కనాలని, పరదా వేసుకోవాలని వారు వాదిస్తుంటారు. వారి దృష్టిలో స్త్రీలకు చదువు అనవసరం. ప్రేమ వివాహాలు తప్పు. వీరి సిద్ధాంతాలను ఇలాగే కొనసాగిస్తే దేశంలో శాంతిభద్రతలు ఉండవు. మహిళలు 16 శతాబ్ధం నాటి స్థితికి దిగజారతారు’’ అన్నారు మోనాశర్మ.

మొదటి లాక్‌డౌన్ కాలం నుంచి ట్రేడ్స్ లాంటి గ్రూపులు యాక్టివ్‌గా మారాయని మోనా శర్మ చెప్పారు.

''మొదట్లో వాళ్లను చూసి బీజేపీ మద్ధతుదారులు అనుకున్నా. నాలాగే ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అనుకున్నా. కానీ, నాలాంటి మితవాద మహిళలు వారి పాత సంప్రదాయ భావాలను ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు మమ్మల్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు’’ అన్నారు మోనా శర్మ.

“ఆధునిక విద్యావంతులైన మహిళలు మద్యం సేవించడం, పాశ్చాత్య దుస్తులు ధరించడాన్ని వారు సహించరు. దళితులు, ముస్లింలపై హింసను ప్రచారం చేయడం లేదు కాబట్టి మేం వారి దృష్టిలో స్వచ్ఛమైన హిందువులం కాదు’’ అన్నారామె.

మోదీ వ్యతిరేకత

మోనా అభిప్రాయం ప్రకారం, ట్రేడ్స్ గ్రూపు ప్రధాని మోదీని కూడా ఇష్టపడదు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన సమర్థుడు కాదని వారు భావిస్తారు. ఆయన్ను 'మౌలానా మోదీ’ అని పిలుస్తారు.

మితవాద భావజాలంపై వ్యాసాలు రాసే కాలమిస్ట్ అభిషేక్ బెనర్జీ కూడా తనను తాను 'రైతా'గా అభివర్ణించుకుంటారు. విభిన్నంగా కనిపించే రైట్‌వింగ్‌ను వామపక్షాలతో పోల్చారు.

''ఇలాంటి రైట్ వింగ్ గ్రూపులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది రైట్‌వింగ్ ప్రభుత్వం కాబట్టి అవి చర్చల్లోకి వస్తున్నాయి. రాజకీయాల్లో, ప్రజల్లో ఇవి ఆదరణ పొందుతున్నాయి’’ అని బెనర్జీ బీబీసీతో అన్నారు.

ట్రేడ్స్, రైతా, యూనియనిస్ట్స్, బ్లాక్ పిల్లర్స్ లాంటి గ్రూపులు ఇలాంటి రైటిస్ట్ గ్రూపుల్లో కొన్ని.

ఈ గ్రూపులతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి చెప్పినదాని ప్రకారం, యూనియనిస్టులుగా చెప్పుకుంటున్న గ్రూప్... దళితులను అపవిత్రులుగా భావిస్తుంది. వారు తమ గ్రూపులో ఉండరాదని చెబుతుంది.

భారతదేశం హిందు దేశం ఎప్పటికీ కాదని, సమస్యలకు అసలు కారణం దేశం లౌకిక ప్రజాస్వామ్యం కావడమేనని 'బ్లాక్ పిల్లర్స్’ గ్రూప్ వాదిస్తుంది.

ట్రేడ్స్, రైతా గ్రూపుల గురించి మీడియా రాయడం మొదలుపెట్టడం, అంతకు ముందు బుల్లీ బాయి, సుల్లీ డీల్స్ నిందితులపై పోలీసులు కేసులు పెట్టడంతో ఈ వర్గాలు తమ స్వరాన్ని తగ్గించాయి.

కొందరు తమ అకౌంట్లను రద్దు చేసుకున్నారు. మరికొందరు సైలెంట్ అయ్యారు.

ముందున్న మార్గమేంటి ?

సుల్లీ డీల్స్, బుల్లీ బాయి కేసుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రెడిట్, టెలిగ్రామ్‌లాంటి సోషల్ మీడియా యాప్‌లలో ద్వేషపూరిత ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ వ్యవహారంలో విచారణ జరుగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని బీబీసీతో ముంబయి సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండీకర్ అన్నారు.

విదేశీ సోషల్ మీడియా సంస్థల నుంచి అవసరమైన సహకారం లేకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.

''మేం సమాచారం కోసం అడిగినప్పుడు తాము అమెరికా చట్టాలను మాత్రమే అనుసరిస్తామని సోషల్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. నేరం జరిగిందా లేదా అన్నది నిర్ధరణ అయ్యాకే సమాచారం ఇస్తామంటారు’’ అని ముంబయి పోలీస్ స్పెషల్ ఐజీ బ్రజేశ్ సింగ్ అన్నారు.

''యాప్‌లు తయారు చేసే వాళ్లను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. యాప్‌స్టోర్‌ను అడిగితే వివరాలు ఇస్తారు. కానీ, ఇలా ఒక ఐడియాలజీ ఉన్నవారు ఒక గ్రూపుగా ఏర్పడినప్పుడు ఈ సమాచారం ఆ సోషల్ మీడియాలో మాత్రమే ఉంటుంది. వారిలో కొందరి సమాచారం మాత్రమే దొరుకుతుంది. కొన్ని సాంకేతికతలను ఉపయోగించి చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు’’ అన్నారు బ్రజేశ్ సింగ్.

లెక్కకు మిక్కిలిగా ఉన్న ఇలాంటి ఖాతాలను పర్యవేక్షించడానికి అవసరమైన వనరులు పోలీసులు దగ్గర లేవని, ఫిర్యాదు చేసిన కేసులను మాత్రమే విచారిస్తామని బ్రజేశ్ సింగ్ అన్నారు.

సోషల్ మీడియాలో ట్రేడ్స్ లాంటి గ్రూపులకు మద్ధతు, ఆదరణ పెరుగుతున్న కారణంగానే వాటిపై ఫిర్యాదులు చేయడానికి, చర్యలు తీసుకోవడానికి మిగతా గ్రూపులు భయపడుతున్నాయని, అందుకే వారి ద్వేషపూరిత ఉపన్యాసాలను మౌనంగా అంగీకరించాల్సి వస్తోందని కొందరు రైట్‌వింగ్ గ్రూప్ సభ్యులు బీబీసీతో అన్నారు.

అయితే, కాలమిస్ట్ అభిషేక్ బెనర్జీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ట్రేడ్స్ గ్రూపును సమర్ధించే పెద్ద హ్యాండిల్స్ ఏవీ తనకు కనిపించలేదని ఆయన అన్నారు.

ఈ గ్రూపులను లేకుండా చేయడం సాధ్యం కాదని, చట్టం పరిధిలో ఉండేలా చేస్తే చాలని అభిషేక్ అన్నారు.

జరిగిన ఘటనల తర్వాత తనను తాను ఒక బాధితుడిగా రితేశ్ అర్థం చేసుకున్నారు. అమ్మాయిల ఫొటోల లైవ్ స్ట్రీమింగ్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో తాను ఒంటరి వాడయ్యారు.

ప్రజలు తనకు దూరం అయ్యారని, మీడియా కంపెనీలో ఉద్యోగం కూడా పోయిందని రితేశ్ చెబుతున్నారు.

“ఇదంతా పనికిమాలిన పని అని అర్థమైంది. దీనివల్ల నాకుగానీ, సామాన్యులకు గానీ ఎలాంటి ప్రయోజనం లేదు. దీని కోసం రహస్య అజెండా నడుపుతున్న వ్యక్తులే ప్రయోజనం పొందారు’’ అన్నారు రితేశ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How is hate spreading on social media targeting Muslims and women? - BBC Research
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X