వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా నుంచి పారిపోయి ఈదుకుంటూ యూరప్ చేరిన అక్కాచెల్లెళ్ల కథలో ఎన్ని మలుపులో...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిరియా

యుస్రా, సారా మర్దిని అక్కాచెల్లెళ్లు. తండ్రి శిక్షణలో వారు మంచి స్విమ్లర్లుగా రాటుదేలారు.

ఈతలో వారికున్న నైపుణ్యం వారిని సిరియా నేషనల్ యూత్ స్విమింగ్ టీమ్‌కి ఎంపికయ్యేలా చేసింది.

సిరియాలో యుద్ధం బీభత్సంగా సాగుతున్న కాలంలో ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ శిక్షణలో ఉన్నప్పుడు వారు ఈత కొడుతున్న స్విమింగ్ పూల్‌లో బాంబు పడింది.

దాంతో వారు సిరియా విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సిరియా నుంచి వెళ్లేందుకు మానవ అక్రమ రవాణా సాగించే ఏజెంట్ల సాయంతో వారు ఓ బోటు ఎక్కారు.

నడి సముద్రంలో ఆ బోటు మునిగిపోవడంతో ఈ అక్కాచెల్లెళ్లు ఈదుకుంటూ గ్రీస్ చేరారు. అక్కడి నుంచి జర్మనీ వెళ్లారు.

ఆ తరువాత యుస్రా రియో ఒలింపిక్స్‌లో విజయం సాధించడంతో పాటు శరణార్థుల తరఫున మాట్లాడారు.

యుస్రాతో పాటు గ్రీస్ చేరిన అక్క సారా ఇప్పుడు అక్కడ విచారణ ఎదుర్కొంటున్నారు.

వీరి కథ స్ఫూర్తితో 'ది స్విమ్మర్స్’ పేరిట నెట్‌ఫ్లిక్స్ ఒక చిత్రం రూపొందించింది.

ఈజిప్ట్‌కు చెందిన డైరెక్టర్ 'సాలీ ఎల్ హొసైనీ’ ఈ చిత్రం రూపొందించారు. లెబనాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు నథాలీ, మనాల్ ఇస్సాలు యుస్రా, సారాల పాత్రలను పోషించారు.

సిరియా యుద్ధం

2015 సంవత్సరం యుస్రా, సారాల జీవితాన్ని మార్చేసింది.

''ఆ రోజు ఉదయం ఈత ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ పూర్తి చేసుకుని అమ్మ కోసం వెయిట్ చేస్తుండగా బాంబు పడింది’’ అని సారా బీబీసీ జర్నలిస్ట్ మాగ్దలీనా సోడోంకోవాతో చెప్పారు. బీబీసీ యుస్రా, సారాలపై అప్పట్లో డాక్యుమెంటరీ చిత్రీకరించింది.

''ఒక్కసారిగా బాంబు దూసుకొచ్చి పడింది. ఎటుచూసినా చెల్లాచెదురుగా గాజు పెంకులు పడి ఉన్నాయి. మేం హడలిపోయాం. చాలామంది స్నేహితులను కోల్పోయాం. ఈ పేలుడులో ఒక స్విమింగ్ కోచ్ కూడా చనిపోయారు ’’ అని సారా చెప్పారు.

అరబ్ దేశాలలో 2010 ప్రాంతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటాలు మొదలయ్యాయి. అక్కడి కొద్ది కాలంలోనే సిరియాలోనూ ఇది మొదలైంది.

సిరియాలో యుద్ధం తీవ్రం కావడంతో ఆ దేశం నుంచి సగం జనాభా వలస వెళ్లిపోయింది.

యుస్రా, సారాలు కూడా సిరియా విడిచి వెళ్లాలనుకున్నారు. కానీ, వారి తల్లిదండ్రులు మాత్రం అందుకు అంగీకరించలేదు. కానీ స్విమింగ్ పూల్‌లో బాంబు పడిన ఘటన తరువాత వారి తల్లిదండ్రుల ఆలోచనా మారింది.

అదే సమయంలో యుస్రా, సారాల స్నేహితురాలు ఒకరు సురక్షితంగా యూరప్ చేరడంతో తాము కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.

శరణార్థులు

అప్పటికి యుస్రా వయసు 17 ఏళ్లు కాగా సారా వయసు 20 ఏళ్లు. వాళ్లిద్దరూ జర్మనీ చేరుకోవాలని కోరుకున్నారు.

2015 డిసెంబరు నాటికి యూరప్ దేశాల సముద్ర తీరాలకు 9,11,000 మంది శరణార్థులు చేరుకున్నారు. అలా చేరే క్రమంలో 3,550 మంది సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు 'యూఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్’(యూఎన్‌హెచ్‌సీఆర్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

లిబియా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీకి.. అలాగే తుర్కియే నుంచి లెస్బోస్ వంటి గ్రీస్ దీవులకు శరణార్థులు చేరుకుంటుంటారు.

ఈ క్రమంలో అత్యంత కఠిన పరిస్థితులతో కూడిన ప్రయాణాలను ఎంచుకుని వేలమంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

యుస్రా, సారాలు కూడా తుర్కియే మీదు లెస్బోస్ దీవులకు చేరే మార్గాన్ని ఎంచుకున్నారు.

తుర్కియేలోని ఇజ్మీర్ నుంచి ఏజియన్ సముద్రం మీదుగా గ్రీస్ చేరుకోవడానికి వారు చేసిన మొదటి ప్రయత్నం పోలీసులు అడ్డుకోవడంతో విఫలమైంది. సముద్రంలో ప్రయాణానికి సిద్ధమైనప్పుడు వీరిని బయటకు లాగేశారు పోలీసులు.

దీంతో తమలా దేశం దాటాలని ప్రయత్నించే మరికొందరితో కలిసి వీరు అక్కడే అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు ఉన్నారు.

''మానవ అక్రమ రవాణా ముఠాలు అక్కడ రాజుల్లాంటివారు. మళ్లీ టైం వచ్చింది అని చెప్పారు వారు’’ అని యుస్రా తమ ప్రయాణం రోజును గుర్తుచేసుకున్నారు.

సముద్రం దాటడం ఏమంత కష్టం అనిపించలేదు. పోలీసులకు దొరక్కుండా గంటన్నర ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు.

కానీ ఈ స్మగ్లర్లు ఏడుగురిని మాత్రమే తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న బోటులో 21 మందిని ఎక్కించారు. 17 మంది మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు, ఒక చిన్నారి బోటులో ఎక్కారు. బోటు మోటార్ కూడా అంత సమర్థంగా ఏమీ అనిపించలేదు.

''ప్రయాణం మొదలైన పావు గంటకే బోటు ఇంజిన్ ఆగిపోయింది’’ అని యుస్రా చెప్పారు. ఇంజిన్ పనిచేయకపోవడంతొ బోటు సముద్రంలో కొట్టుకుపోవడం మొదలైంది.

''మా నాన్న స్నేహితడుు ఒకరు మాతో పాటే ప్రయాణిస్తున్నారు. బోటులో చేరిన నీటిని బయటకు తోడుతూ ఆయన.. ఎవరూ భయపడొద్దని, ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచించారు’’ అని యుస్రా గుర్తు చేసుకున్నారు.

''బోటులో ఉన్నవారంతా తమ ప్రాణాలు కాపాడాలంటూ దేవుడిని వేడుకోవడం ప్రారంభించారు. వారిలో చాలామందికి ఈత కూడా రాదు’’ అన్నారు యుస్రా.

ఏం చేయాలో తోచక బోటులో ఉన్నవారంతా తమ వస్తువులను బయటపడేయడం మొదలుపెట్టారు. అయినా, కూడా పడవ మునిగిపోతూనే ఉంది.

ఇంకా బరువు ఎక్కువగా ఉండడంతో ఎవరో ఒకరు బోటు నుంచి బయటకు దూకక తప్పని పరిస్థితి.

అలాంటి పరిస్థితుల్లో నా సోదరి సారా ఒక్కసారిగా సముద్రంలోకి దూకేసింది. పడవ పక్కనే ఈదుతూ పడవ మునిగిపోకుండా లాగుతోంది.

అక్క సారా సముద్రంలో దూకేయడంతో యుస్రా భయపడింది. తాను కూడా అక్కతో పాటే దూకాలని నిర్ణయించుకుంది.

సారా వద్దని వారించినా కూడా వినకుండా యుస్రా కూడా సముద్రంలోకి దూకేసింది.

''పడవకు రెండో వైపున ఉన్న సారా నన్ను మళ్లీ పడవలోకి ఎక్కమని చెప్పింది. కానీ, నేను వినలేదు. నేను కూడా సహాయం చేస్తాను’’ అని చెప్పాను.

సముద్రంలో చిక్కుకున్న అందరి పరిస్థితీ దయనీయంగా ఉంది.

''సముద్రంలో దూకిన రెండు గంటల తరువాత కూడా అదే స్థితిలో ఉన్నాం. మా శరీరాలు, మనసులు అన్నీ కుదేలైపోయాయి’’ అని ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు యుస్రా.

''బోటులో ఇంకా నీరు ఉంది. ఇంజిన్ అప్పుడప్పుడు పనిచేస్తూ అప్పుడప్పుడు ఆగిపోతోంది’’

''అందరి మనసుల్లో ఒకటే ఆలోచన. ఎందుకు ఈ ప్రయాణం ప్రారంభించాం. ఎందుకు సిరియాను వదిలేయాలనుకున్నాం. తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి ఎందుకు వస్తున్నాం’’అన్నదే అందరి ఆలోచన.

మేం దూకిన తరువాత మగవాళ్లలో కొందరు నీటిలో దూకారు. ఈత రాని వ్యక్తి కూడా ఒకరు కిందకు దూకారు. బోటుకు ఉన్న తాడు పట్టుకుని వేలాడుతున్నాడాయన.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.. రాత్రవుతోంది.. వాతావరణం చల్లగా మారిపోయింది.

ఆ సమయంలో చాలా దూరంగా లెస్బోద్ ద్వీపం కనిపించింది యుస్రాకు. కానీ... అది చేరుకోగలిగేలా ఏమాత్రం లేదు.

''మేం సముద్రంలో ఈదుతూ ముందుకు కదులుతున్నాం. కానీ, ఎంత ముందుకు వెళ్తున్న ఆ ద్వీపం సమీపిస్తున్నట్లుగా లేదు, నెమ్మదిగా ప్రాణంపోతున్నట్లు అనిపిస్తోంది’’ చెప్పారు యుస్రా.

గ్రీస్ తీరం

''మా స్నేహితుడు ఒకరు సహాయం కోసం గ్రీకు, తుర్కియే పోలీసులకు కాల్ చేశాడు. మేం మునిగిపోతున్నామని వారికి చెప్పాడు. కానీ... గ్రీస్ పోలీసుల నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. అది కూడా.. తిరిగి వెళ్లిపోమని వారు అరబిక్‌లో చెప్పారు.

ఎట్టకేలకు మరో నాలుగు గంటలు కష్టపడిన తరువాత గ్రీస్ తీరానికి చేరుకోగలిగాం.

తీరం చేరగానే మొత్తం ప్రపంచం నా సొంతమైందనిపించింది. ఏడ్చేశాను. నా శరీరంలో నా ఆత్మ ఇంకా ఉన్నందుకు థాంక్స్ చెప్పుకొన్నాను’’ అని యుస్రా అన్నారు.

అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కానీ , వారంతా అనేక అడ్డంకులను దాటుకుంటూ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

లెస్బోస్ చేరిన తరువాత యుస్రా, సారాలు అక్కడి నుంచి ఒక ఫెర్రీలో ఏథెన్స్ బయలుదేరారు. ఏథెన్స్ నుంచి మాసిడోనియాకు బస్‌లో వెళ్లారు. అక్కడి నుంచి రైలులో సెర్బియా వెళ్లారు. అక్కడి నుంచి నడుచుకుంటూ హంగరీ సరిహద్దుకు చేరారు.

అక్కడ నుంచి వారు యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి వెళ్లకుండా ముళ్ల కంచె అడ్డంగా కనిపిచింది.

అది దాటి ముందుకు వెళ్తే పోలీసులు వారిని పట్టకుంటారు. ఆ తరువాత శరణార్థులుగా గుర్తించాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ, అక్కాచెల్లెళ్లిద్దరూ జర్మనీలో శరణార్థులుగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. అందుకే.. వారు అక్కడ పోలీసులకు దొరక్కుండా దాక్కున్నారు.

ఆ సరిహద్దుల్లోనూ మానవ అక్రమ రవాణా చేసేవారు ఉన్నట్లు తెలుసుకుని అక్కడే మొక్కజొన్న పొలాల్లో దాక్కున్నారు.

రాత్రి ఎముకలు కొరికే చలిలోనూ అక్కడే ఉన్నారు. చివరకు ఓ స్మగ్లర్ వచ్చి బుడాపెస్ట్ తీసుకెళ్తానని చెప్పాడు. అందుకు ఎన్ని వందల యూరోలు చెల్లించాలో కూడా చెప్పాడు.

అక్కడకు చేరుకున్న తరువాత కొందరి అవయవాలను అమ్మేశారని, అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టారన్న ప్రచారం ఉండడంతో యుస్రా, సారాలు అక్కడ దిగగానే వెంటనే పారిపోయారు.

చాలామందిలాగే వారు కూడా సురక్షిత స్థానంగా భావించి అంతర్జాతీయ రైలు స్టేషన్‌కు చేరుకున్నారు.

అక్కడ అప్పటికే 5 వేల మంది శరణార్థులు రైలు ఎక్కాలనే ఆశతో పగలూరాత్రీ పడిగాపులు కాస్తున్నారు.

పోలీసులు అక్కడ శరణార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది.

బుడాపెస్ట్‌లో రైలు ఎక్కేందుకు శరణార్థుల కష్టాలు.. 2015 నాటి చిత్రం

ఆ గందరగోళం కొనసాగుతుండగానే వీరు ఒక బండి ఎక్కేశారు. కానీ, ఒక మహిళ పోలీసులకు వీరి సంగతి చెప్పేసింది.

దీంతో వారు అక్కడ దొరికిపోయారు. దాంతోవారిని శరణార్థి శిబిరానికి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి వారు మళ్లీ పారిపోయారు. అదేసమయంలో సిరియా శరణార్థులను తమ దేశంలోకి తీసుకోవడానికి అప్పటి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా పార్కర్ అంగీకరించారు.

ఆ క్రమంలో బుడాపెస్ట్‌కు ప్రత్యేక బస్సులను పంపించడంతో యుస్రా, సారాలు మొదట అక్కడి నుంచి ఆ బస్సుల్లో ఆస్ట్రియాకు, అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు.

యుస్రా

''మేం వియన్నా చేరుకున్నప్పుడు వర్షం పడుతోంది. స్థానికులు తమ ఇళ్ల కిటికీలలోంచి శరణార్థులకు వేడివేడి టీ, కాఫీ ఇవ్వడం వంటివి కనిపించాయి’’ అని యుస్రా గుర్తుచేసుకున్నారు.

''వారు మా కోసం ఎదురుచూస్తున్నారు. మాకు స్వాగతం పలికారు. మాకు బొకేలు, టెడ్డీ బేర్స్, షాంపూలు ఇచ్చారు’’

''ఆన్ అనే మహిళ మమ్మల్ని తన ఇంట్లో స్నానం చేయడానికి అనుమతించింది. మాకోసం వేడి భోజనం తయారుచేసి పెట్టింది. అత్యంత క్లిష్ట కాలాన్ని దాటుకుంటూ వచ్చిన తరువాత మళ్లీ మనుషుల్లా అనిపించింది మాకు’’

సిరియా

ఇన్ని కష్టాలు ఎదురైనా యుస్రా తన ఆశను వదులుకోలేదు. స్విమ్మర్‌గా కొనసాగాలని కోరుకుంది.

శరణార్థి శిబిరంలోని ఓ వ్యక్తి సహాయంతో కోచ్ స్వెన్ స్పాన్‌బ్రెక్స్‌ను కలిశారు. ఈ అక్కాచెల్లెళ్ల ఈతను చూసిన తరువాత వారిని ఆ స్విమింగ్ క్లబ్‌లో చేర్చుకున్నారు.

2016 రియో డిజనీరో ఒలింపిక్స్‌లో శరణార్థుల టీమ్ తరఫున పాల్గొన్న యుస్రా బటర్‌ఫ్లై విభాగంలో పతకం గెలుచుకుంది.

2017లో యుస్రాను యూఎన్‌హెచ్‌సీఆర్ గుడివిల్ అంబాసిడర్‌గాప్రకటించింది. ఈ హోదా పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా యుస్రా గుర్తింపు సాధించింది.

మరోవైపు అక్క సారా బెర్లిన్‌లోని బార్డ్ కాలేజీలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ సాధించింది. లెస్బోస్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఇంటర్నేషనల్‌’లో వలంటీర్‌గా పనిచేయడం ప్రారంభించింది.

2018లో గ్రీస్ అధికారులు సారాను అరెస్ట్ చేశారు. ఆమె, ఆమెతో పాటు వచ్చినవారిలో మరో ఇద్దరు మానవ అక్రమ రవాణా, గూడఛర్యానికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు.

బెయిలుపై విడుదలై బెర్లిన్ వెళ్లడానికి ముందు 100 రోజులు ఆమె గ్రీస్‌లో పోలీస్ కస్టడీలో ఉన్నారు.

ప్రస్తుతం సారా, యుస్రాల కుటుంబం మొత్తం బెర్లిన్‌లోనే ఉంటోంది.

సారాపై ఆరోపణలు అవాస్తవమని, అన్యాయమని హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How many twists and turns in the story of sisters who fled Syria and reached Europe by swimming...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X