తవ్వి తీస్తోన్న సువేందు: బెంగాలీ సూపర్ స్టార్లపై ఎఫ్ఐఆర్: 2021 నాటి ట్వీట్
ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూట్ మార్చింది. పాత ట్వీట్లను తవ్వి తీస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలకు దిగుతోంది. ఈ విషయంలో సెలెబ్రెటీలనూ కూడా వదలట్లేదు. ఈ విషయంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు సైతం ఉన్నారిందులో.
తాజాగా ఇద్దరు సూపర్ స్టార్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే దీనికి కారణమైంది. అయిదేళ్ల కిందట ప్రముఖ బెంగాలీ నటులు పరంబ్రత ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ పెట్టిన పోస్టులు ఇప్పుడు వారిని చిక్కుల్లో పడేసింది. కోల్ కతలోని గారియాహాట్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జోయ్‌దీప్ సేన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2021 మేలో పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన భారీ ఎన్నికల అనంతర హింసాత్మక పరిస్థితులు చెలరేగడానికి పరంబ్రత ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ పెట్టిన పోస్టులు కూడా కారణం అయ్యాయని జోయ్ దీప్ సేన్ ఆరోపించారు. వారిపై గారియాహట్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి ఘటనలకు వీరి వ్యాఖ్యలే ప్రేరేపించాయని ఆరోపించారు.
2021 మే 2న సాయంత్రం 4 గంటలకు పరంబ్రత ఛటర్జీ బెంగాలీలో "ఈ రోజును ప్రపంచ రోగోరాణి కొట్టుడు దినంగా ప్రకటించుదాం" అని ట్వీట్ చేశారు. దీనికి నటి స్వస్తికా ముఖర్జీ రిప్లై ఇచ్చారు. "హహహహా హోక్ హోక్" అంటూ బదులిచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను జోయ్ దీప్ సేన్ తన ఫిర్యాదుకు జత చేశారు. అత్యంత సున్నితమైన సమయంలో ఈ సమయంలో భారీ హింసను ప్రోత్సహించాయని, దాడులకు ప్రేరేపించాయని పేర్కొన్నారు.
పరంబ్రత ట్వీట్ చేసిన సుమారు గంట తర్వాత, బెలియాఘాట్ కు చెందిన బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ హత్యకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో నిందితులకు ఇప్పటికే శిక్ష పడింది. 2021 మే 2 సాయంత్రం నుండి పశ్చిమ బెంగాల్ అంతటా బీజేపీ కార్యకర్తలపై వ్యవస్థీకృత భారీ హింస ప్రబలిందని, హత్యలు, దాడులు, లైంగిక హింస, నిప్పుపెట్టడం, బలవంతపు వసూళ్లు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications