• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బ్రేకప్

బ్రేకప్ తర్వాత కొన్ని జంటలు సామరస్యంగా విడిపోతాయి. కాన్ని మరికొన్ని జంటలకు మాత్రం ఊహించని అవరోధాలు ఎదురవుతుంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాజీ ప్రేమికులతో కలిసి జీవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు మరింత దిగజారుతుంటాయి కూడా.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వెంటనే కొత్త ఇంటికి వెళ్లిపోయేందుకు షంటల్ టుకెర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 37ఏళ్ల టుకర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లండన్‌లో ప్రస్తుతముంటున్న ఇల్లును కొనుగోలుచేశారు. ఐదేళ్లుగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. కానీ, కరోనావైరస్ మహమ్మారి విజృంభించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

''కోవిడ్-19 మహమ్మారి సద్దుమణిగేవరకు అక్కడే ఉండాలని, అదే ఇద్దరికీ మంచిదని మేం నిర్ణయించుకున్నాం’’అని ఆమె చెప్పారు.

కొన్ని నెలలపాటు ఈ జంట ఒకే ఇంట్లో విడివిడిగా ఉండటం మొదలుపెట్టింది. అయితే, లాక్‌డౌన్‌లో తల్లిదండ్రులకు వైద్యపరమైన సేవలు అందేలా చూసేందుకు వారితోనే ఉండాలని టుకెర్ బాయ్‌ఫ్రెండ్ నిర్ణయించుకున్నారు. అయితే, ఆరు నెలల తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశారు. అప్పుడు వీరిద్దరూ ఒక ఊహించని నిర్ణయం తీసుకొన్నారు.

బ్రేకప్

చాలా మంది ఇలానే...

అప్పటినుంచి టుకెర్, ఆమె మాజీ ప్రియుడు కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. అయితే, వీరు వేర్వేరు బెడ్‌రూమ్‌లలో పడుకొంటున్నారు. ఆ తర్వాత వీరు పెంచుకోవడానికి కొన్ని పిల్లులను కూడా తోడుగా తెచ్చుకున్నారు. నిజానికి ఇది కాస్త వింత సహజీవనమే. కానీ, వీరేమీ ఒంటరులు కాదు. ఇలానే మాజీ ప్రియులతో చాలా మంది కలసి జీవిస్తున్నారు.

ఈ విషయంలో బ్రిటిష్ రియల్ ఎస్టేట్ కంపెనీ జూప్లా ఓ సర్వే నిర్వహించింది. దీనిలో 500 మంది పాల్గొన్నారు. వీరిలో మూడో వంతు మంది తమ భాస్వాములతో కలిసి ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, బ్రేకప్ అయిన తర్వాత కూడా వారితో కలిసి అదే ఇంట్లో జీవిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు బెడ్‌ను కూడా ఇంకా షేర్ చేసుకుంటున్నారు. టుకెర్ లాంటి చాలా మంది మాజీ ప్రియులతో సామరస్యంగా కలిసి జీవిస్తున్నారు. అయితే, ఇలా మాజీ ప్రియులతో కలిసి జీవిస్తున్నవారిలో 91 శాతం మంది ఇదివరకటిలా తమ మాజీ భాగస్వాములతో మాట్లాడలేకపోతున్నట్లు చెబుతున్నారు. 22 శాతం మంది మాత్రం పరిస్థితులు చాలా బాధాకరంగా మారిపోయినట్లు వివరిస్తున్నారు.

బ్రిటన్‌ను ధరల పెరుగుదల సంక్షోభం పీడిస్తోంది. పెరిగిన వడ్డీ రేట్లు, మందగమనంలోనున్న ప్రాపర్టీ మార్కెట్ నడుమ చాలా బ్రేకప్ అయిన జంటలకు వేరే ప్రత్యామ్నాం దొరకడం లేదు. అయితే, ఈ సమస్య మరింత తీవ్రం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా జంటలు సగటున 1.3ఏళ్లు సొంతింటిని వదులుకోలేక కలిసి జీవిస్తున్నట్లు వివరిస్తున్నారు.

బ్రేకప్

ఎందుకు ఇలా?

టుకెర్ విషయంలో మాజీ ప్రియుడితో కలిసి జీవించాలనే నిర్ణయం ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది. మాజీ ప్రియుడికంటే ఆమె జీతం కొంచెం తక్కువ. పైగా మార్కెట్లో ఇళ్ల అద్దె చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు.

ఈ విషయంలో సాయం కోరుతూ తమ దగ్గరకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని లండన్‌కు చెందిన లార్జ్‌మోర్టగేజ్‌లోన్స్.కామ్ బ్రోకర్ మార్క్ పటన్‌షెట్టి వివరించారు. ''విభేదాలు వచ్చినా, బ్రేకప్ అయినా.. ఇప్పటికీ తమ మాజీ ప్రియులతోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో అనిశ్చితి, ఆదాయం తగ్గడమే దీనికి కారణం. మరోవైపు ఆర్థిక మందగమనం కూడా వారిపై ప్రభావం చూపిస్తోంది’’అని ఆయన చెప్పారు.

''కొత్త ఇళ్లను అద్దెకు తీసుకోవడం కంటే మాజీ ప్రియులతో కలిసి జీవించడమే మేలని చాలా మంది భావిస్తున్నారు’’అని ఆయన వివరించారు.

సొంత ఇంటి ఈఎంఐలను మాజీ ప్రియులతో కలిసి కడుతున్నవారిలో 47 శాతం మంది కొత్త ఇంటిని తీసుకుంటే మరింత భారం మోయాల్సి వస్తుందని జూప్లా రీసెర్చ్‌లో తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇళ్లను అమ్మితే వచ్చే నష్టం, కొత్త ఇంటిని కొనుగోలు చేయలేకపోవడం, అద్దె ఇంటి అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటే వచ్చే నష్టం, ఒంటరిగా జీవించడం అనేది ఆర్థికంగా మరింత భారం కావడం లాంటి అంశాలు తమను మరింత ఇబ్బంది పెడుతున్నట్లు అధ్యయనంలో పాల్గొన్నవారు వివరించారు.

ఒంటరిగా ఉండేవారు ఆర్థికంగా మరింత ఎక్కువ భారం మోయాల్సి ఉంటుందని, ఇతరులతో పోలిస్తే వార్షిక ఖర్చులు వీరికి మరింత ఎక్కువగా ఉంటాయని డేటా చెబుతోంది. మరోవైపు గత పదేళ్లలో ఈ ఖర్చులు మరింత పెరిగాయి. ఫలితంగా ఒంటరిగా ఇల్లు అద్దెకు తీసుకోవడం లేదా కొనడం అనేది సమస్యగా మారుతోంది.

కరోనావైరస్ వ్యాప్తికి ముందు కొంతమంది ఎలాగైనా ఈ భారాన్ని మోసి ఒంటరిగా ఉండాలనే నిర్ణయాన్ని కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కానీ, మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత, పడిపోయిన వేతనాలు, పెరిగిన ఖర్చులు లాంటివి ఇప్పుడు మాజీ ప్రియులతోనే కష్టమైనానష్టమైనా కలిసి జీవించే నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయి.

''కోవిడ్-19 నేరుగా మాపై ప్రభావం చూపలేకపోవచ్చు. కానీ, దాని రాజకీయ, ఆర్థిక ప్రభావాలను పరోక్షంగా మేం ఎదుర్కోవాల్సి వస్తోంది’’అని టుకెర్ వివరించారు.

బ్రేకప్

ఇప్పుడు ఎలా?

ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక పరిస్థితి మందగమనంలోకి వెళ్తున్న తరుణంలో తమ పరిస్థితిని మరింత దిగజార్చుకోవడం కంటే మాజీ ప్రియులతో కలిసి జీవించడం మేలని చాలా మంది భావిస్తున్నారు. దీని వల్ల ఇతర సమస్యలు, ఒత్తిడి పెరుగుతాయని పటన్‌షెట్టి అంటున్నారు. చాలా మంది తమ ఆరోగ్యం ప్రభావితం అవుతోందని తమ దగ్గరకు వస్తున్నట్లు ఆయన వివరించారు.

''అన్నింటి కంటే పెద్ద సమస్య ఏమిటంటే.. ఒకవేళ విడిపోతే ఇద్దరికీ కలిపివచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? రుణాలను ఎలా కట్టాలి? ముఖ్యంగా దీనిలో ఒక వ్యక్తి ఆదాయం కాస్త ఎక్కువగా ఉంటే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా ఉంటుంది’’అని ఆయన వివరించారు.

''ఇక్కడ భావోద్వేగ పరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తిని కలిసి ఉండాలని బలవంత పెట్టినప్పుడు ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది’’అని ఆయన వివరించారు.

#HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు

లవ్ బ్యాంక్: ప్రేమ లేఖ నుంచి సినిమా టికెట్ వరకు.. ప్రతీ జ్ఞాపకం పదిలం

మహిళలకు మరింత ఇబ్బంది...

తక్కువ ఆదాయంతో జీవించాల్సి వచ్చే మహిళలకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని బ్రిటన్ విమెన్స్ బడ్జెట్ గ్రూప్‌లోని రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం అధిపతి, సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సారా రేయిస్ వివరించారు.

బ్రిటన్‌లో మూడో వంతు మంది మహిళలు ఆర్థికంగా తమ జీవిత భాగస్వాములపైనే ఆధారపడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా ఆధారపడే మహిళల సంఖ్య 11 శాతం మాత్రమే.

మరోవైపు జూప్లా సర్వేలో 46 శాతం మంది మహిళలు విడిపోయేటప్పుడు తమ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవని వెల్లడించారు. అంటే కొత్త ఇంటిని అద్దెకు తీసుకోవడం, డిపాజిట్లు కట్టడం వీరికి దాదాపుగా అసాధ్యం అవుతోంది.

''మహిళల ఆదాయం, జీతాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బాయ్‌ఫ్రెండ్ నుంచి విడిపోవాల్సి వచ్చినప్పుడు సొంతంగా ఇల్లు తీసుకోవడం అనేది వారికి మరింత కష్టంగా ఉంటుంది’’అని రేయిస్ వివరించారు. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని ఆమె వివరిస్తున్నారు. ''కోవిడ్-19 వ్యాప్తి నడుమ చాలా మంది మహిళల ఆదాయంపై ప్రభావం పడింది. చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు’’అని ఆమె చెప్పారు.

వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈఎంఐలు కట్టే వారిపై ప్రధానంగా ప్రభావం చూపిస్తూ ఉండొచ్చు. అయితే, ఇక్కడ అద్దె ఇంటిలో ఉండేవారిపైనా ఇలాంటి ప్రభావమే పడుతోంది.

28ఏళ్ల ర్యాన్ హ్యారిస్ బ్రేకప్ తర్వాత కూడా లండన్‌లోని అద్దెకు తీసుకున్న ఇంట్లో తన మాజీ ప్రియుడితో కలిసే జీవిస్తున్నారు. మూడేళ్ల లీజు అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేందుకు ఆయన దగ్గర సరిపడా డబ్బులు లేవు. దీంతో మేలో బ్రేకప్ అయిన తర్వాత కూడా వీరు కలిసే జీవిస్తున్నారు.

''ఆ అద్దె అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలంటే ఒక్కొక్కరం 3000 పౌండ్లు (రూ.2.78 లక్షలు) పొదుపు చేయాలి. దీని కోసం మేం డబ్బులు దాచుకుంటున్నాం. కానీ, ధరల పెరుగుదల మాపై ప్రభావం చూపిస్తోంది. అయినప్పటికీ డబ్బులను మేం పోగేసి ఈ ఇంటి నుంచి బయటపడాలని భావిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

''మేం కలిసే జీవించాలని అనుకుంటున్నప్పటికీ, ఇది అంత తేలిక కాదు. కొన్నిసార్లు సామరస్యంగానే ఉంటున్నాం. కొన్నిసార్లు అసలు గొడవలు పడకుండా చూసుకునేందుకు మాటలు కూడా ఆడుకోవడం లేదు’’అని ఆయన వివరించారు.

ర్యాన్, తన మాజీ ప్రియుడు మరో వ్యక్తితో కలిసి ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. అంటే విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. అయితే, పరిస్థితి మరింత దిగజారడంతో ఆ మూడో వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో తన మాజీ ప్రియుడికి, తనకు కాస్త ఎక్కువ స్పేస్ దొరికింది. అయితే, ఇప్పుడు తన మాజీ ప్రేమికుడు మరొక వ్యక్తిని ఇంటికి పిలుపించుకుంటున్నారు. దీని వల్ల ర్యాన్ మరింత ఆవేదనకు గురవుతున్నారు.

''అసలు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ, దీనికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. ఇంకోసారి జీవిత భాగస్వామితో కలిసి ఇల్లు తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’’అని ర్యాన్ చెప్పారు.

భవిష్యత్‌పై భయం..

మాజీ ప్రేమికులతో కలిసి జీవించే విషయంలో టుకెర్ కాస్త అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె బ్రేకప్ చాలా సామరస్యంగా జరిగింది. ఇప్పటికీ మాజీ ప్రేమికుడు ఆమెకు సాయం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకరిని మరొకరు స్నేహితులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సంతోషంగానే జీవిస్తున్నప్పటికీ భవిష్యత్‌పై వీరికి చాలా భయాలు ఉన్నాయి.

''ఒకవేళ మా ఇద్దరిలో ఒకరు వేరొకరితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే రెండో వ్యక్తి పరిస్థితి ఏమవుతుంది. నా మాజీ ప్రియుడు దీని గురించి ఆలోచిస్తుంటారు. అది ఏదో ఒకరోజు జరుగుతుంది కూడా’’అని ఆమె అన్నారు.

టుకెర్‌కు సామరస్యపూర్వక పరిష్కారం లభించినప్పటికీ, చాలా మంది సొంతింటివారు, అద్దెకు ఇల్లుకు తీసుకున్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్థికంగా వారి పరిస్థితి ఇప్పటిలో మెరుపడే సూచనలు కూడా కనిపించడంలేదు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల మొత్తంగా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వచ్చే ఏడాది ఇంటి ధరలు 15 శాతం వరకు తగ్గే అవకాశముందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అయితే, ఇది మళ్లీ పూర్వస్థితికి వచ్చిన తర్వాతే తమ సొంత ఇళ్లను అమ్మాలని బ్రేకప్ అయిన జంటలు ఎదురుచూస్తూ ఉండొచ్చు.

అదే అద్దెకు ఉండేవారి విషయానికి వస్తే, వడ్డీ రేట్లు పెరగడంతో ఇంటి అద్దెలు కూడా పెరుగుతాయి. మరోవైపు ధరల పెరుగుదల వల్ల వారి ఆదాయం కూడా కోతపడుతుంది. ఫలితంగా మాజీ ప్రియులతోనే కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

''భవిష్యత్ చాలా ప్రశ్నార్థకంగా అనిపిస్తోంది’’అని రేయిస్ చెప్పారు. ''మునుపటి స్థాయికి ఈఎంఐలు వెళ్లే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. దీని వల్ల కొత్తగా ఇల్లు కొనడం చాలా కష్టం అవుతుంది’’అని రేయిస్ వివరించారు.

ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, తన జీవితంలో వస్తున్న కొత్త మార్పులను తన మాజీ ప్రియుడికి టుకెర్ ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ''మాజీ జీవిత భాగస్వామి స్నేహితుడిగా మారడం చాలా కొత్తగా అనిపిస్తోంది. దీని వల్ల ఇద్దరమూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అదే సమయంలో మేం భావోద్వేగంగా స్వతంత్రంగా ఉండటమూ అలవాటు చేసుకోవాలి’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to live in the same house with an ex after a breakup?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X