వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంప్యూటర్, ఫోన్ స్క్రీన్‌ల నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కళ్లు

సాంకేతిక అభివృద్ధి చెంది కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు రావడంతో ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇప్పుడు వర్క్ ఫ్రం హోంతో నాన్న ఆఫీస్ పక్క రూము లోనే. అమ్మ కూరగాయల సంత ఫోన్ యాప్ లోనే. చెస్ ఆడుకోవడానికి మరొక మనిషే అక్కర్లేదు. ఇలా ప్రతి పనికీ, అవసరానికీ, ఆడుకోవడానికీ ఏదో ఒక గాడ్జెట్ ఉంటే చాలు. కానీ, వీటివల్ల ఎన్నెన్ని దుష్ప్రభావాలు మనపై పడుతున్నాయో ఆలోచిస్తున్నామా?

ఒకప్పుడు ఆఫీసులో పెద్దవాళ్లు వాడే కంప్యూటర్ ఇప్పుడు నట్టింటి నిత్యావసరమైపోయింది. వ్యాపకం కోసం చూసే టీవీ, చేతిలో ఫోన్‌లా మారి, ఇప్పుడు వ్యసనమై కూర్చుంది. పిల్లల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువ.

కాలక్షేపం కోసం మొదలైన ఫోన్లలోనే ఇప్పుడు క్లాసు రూములు తెరుస్తున్నాం. ఆటలూ-పాటలూ, స్నేహాలు, సరదాలు అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. కరోనా కాలం వచ్చాక కంప్యూటర్, ఫోన్ వాడకం తప్పనిసరి అయిపోయింది కూడా.

పిల్లల్ని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కట్టేయడానికి తల్లిదండ్రులు వాళ్లకు ఫోన్లు ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం కంప్యూటర్ల ముందు పిల్లల్ని కూర్చోబెట్టాలి వస్తుంది. కారణం ఏదైతేనేమి స్క్రీన్ టైం అనివార్యమై పోయింది. అలాంటప్పుడు, దీని వల్ల ఉపయోగాలు, అనర్థాలు కూడా తెలుసుకుంటే మంచిది. కంప్యూటర్ స్క్రీనన్‌ని ఎంత సమయం ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం.

లాభాలు

సాంకేతిక వల్ల లాభాలుమనకు తెలిసినవే. ఒక్క ఫోన్ కాల్‌తో కరీంనగర్‌ను కాలిఫోర్నియాతో క్షణంలో కలిపేయవచ్చు. అమెరికాలో అప్పుడే పుట్టిన మనుమరాలిని ఆంధ్రాలో అమ్మమ్మ తృప్తిగా చూసుకోవచ్చు వీడియో కాల్‌లో.

ఫలానా పదాన్ని ఫలానా భాషలో ఏమంటారో చెప్పడానికి టీచర్‌తో పని లేదు. క్షేమంగా గమ్యం చేరడానికి గూగుల్ మ్యాప్‌కు మించిన తోడు ఎవరు! కరోనా సోకకుండా క్లాసురూములో కూర్చోవాలంటే జూమ్ క్లాసే మరి.

ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రతి కదలికకు మెదడు ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అన్నట్టు అనిపిస్తుంది.

నష్టాలు

ఇక, కష్టాల గురించి మాట్లాడుకుందాం. అతిగా స్క్రీన్ చూడటం వల్ల జరిగే అనర్ధాలని క్లుప్తంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) అనొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 8-10 సంవత్సరాల వయసు పిల్లలు సగటున రోజుకు 8 గంటలు, కౌమారదశలో ఉన్న వాళ్లు దాదాపు 11 గంటల వరకూ రకరకాల ఎలక్ట్రానిక్ స్క్రీన్ చూస్తున్నట్లు AAP(American Academy of Pediatrics) చెబుతోంది. మన దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల పిల్లలు సైతం ఈ కోవకు చెందుతారు.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వలన బాధపడే వారిలో తొలి దశలో కనపడే లక్షణాలు ఏమిటంటే, తలనొప్పి, కళ్లు నొప్పి, కళ్ల మంటలు, మసకబారడం, మెడ, నడుము నొప్పి, అలసట.

కొద్దిరోజుల తర్వాత, దూరంగా ఉండే వస్తువుల్ని స్పష్టంగా చూడలేకపోవడం, పుస్తకంలో అక్షరాలు కళ్లకు ఎక్కువ శ్రమ అనిపించటం లాంటి సమస్యలు వస్తాయి. దీన్ని మయోపియా లేదా హస్వదృష్టి అంటాం.

ఎలక్ట్రానిక్ స్క్రీన్ నుంచివెలువడే నీలికాంతి వల్ల కంటి రెటీనాలో కొన్ని సున్నితమైన కణాలు అతిఉత్తేజితమవుతాయి. దీని వల్ల నిద్రలేమి, కలత నిద్ర ఉండవచ్చు.

పిల్లలకైతే ప్రవర్తనలో సైతం తేడాలు వస్తాయి. దీర్ఘకాలంలో కంటికి రంగులను గుర్తించే శక్తి తగ్గుతుంది.

నెలల వయసు నుంచి ఫోన్లు చూడటం అలవాటు చేస్తే చిన్న పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుంది. ఆటిజమ్ లాంటి లక్షణాలు కూడా పిల్లల్లో ఉత్పన్నమవుతాయి.

ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చిన్న చిట్కాలు A B C D E F G అన్నంత సులువుగా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు.

స్క్రీన్

A - As big screen as possible

ఆన్లైన్ క్లాసులు వినడానికి వీలైనంత పెద్ద స్క్రీన్ ఎంచుకోండి.

Alignment with face

1. కనీసం ఒక చేయి చాపినంత దూరంలో

2. ముఖానికి ఎదురుగా

3. మోచేతి ఎత్తుకు సరిసమానంగా కంప్యూటర్‌ను అమర్చుకోవాలి.

B - Brightness of screen

తెర వెలుగు మధ్యస్తంగా ఉండాలి

Brightness in the room

చక్కటి పగటి వెలుతురుండాలి. కిటికీ ఎదురు ముఖం ఉండేలా చూసుకోవాలి.

Blinking of eyes

తరచూ కనురెప్పలు కొట్టడం వల్ల కన్నీటి పొర తేమ కోల్పోకుండా కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

C - Change in gaze

గంటలకొద్దీ స్క్రీన్ వైపు చూడకుండా, ప్రతి 20 నిమిషాలకొకసారి కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వేరేదైనా వస్తువు వైపు ఒక 20 క్షణాల పాటు దృష్టి మరల్చాలి. దీనివల్ల కంటి కండరాలకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

Chair position

కుర్చీ, టేబుల్‌కు తగిన ఎత్తులో ఉండి నిటారుగా వీపు ఆనుకోవడానికి వీలుండాలి.

Change posture

కనీసం గంటకొకసారి కొద్ది నిమిషాలు లేచి నిలబడి, కొద్దిసేపు నడిచి, మళ్లీ కూర్చోవాలి.

D - Drink plenty of water

సరైనంత నీరు తీసుకోవడం శరీర ఆరోగ్యానికి, ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. గంటకొకసారి నీరు తాగడానికి కుర్చీలోంచి లేవాలనే నియమం పెట్టుకోవడం ఒక పద్ధతి.

Dairy products

పాలు, పాల ఉత్పత్తులు కంటికి మంచివి.

Diet rich in antioxidants& Vitamin A

కంటి ఆరోగ్యం కోసం.

E - Early to bed and early to rise

త్వరగా నిద్ర లేవడం వల్ల తొమ్మిదింటికి ఆన్లైన్ పాఠాలు మొదలయ్యే సరికి తగినంత సమయం ఉంటుంది. కాలకృత్యాలు, స్నానాలు, అల్పాహారం సమయపాలన ప్రకారం జరిగిపోతాయి.

F - Free from gadgets after the class & in the weekend

ఆన్‌లైన్ క్లాసుల తర్వాత కూడా ఆటలకోసం స్క్రీన్ ముందే కూర్చోకుండా, ఇంట్లోనే ఆడుకునే ఇతర ఆటలు, ఇంటిపనులు, పుస్తకాలు చదవడం వంటివి అలవాటు చేసుకుంటే శరీరం, మెదడు మరింత ఉల్లాసంగా ఉంటాయి. వారాంతరాల్లో పూర్తిగా గాడ్జెట్లు పక్కనపెడితే తల్లిదండ్రులు పిల్లలు కలిసి చక్కని సమయం గడపవచ్చు.

G - Glasses checkup as and when required

ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కంటిచూపులో ఏమన్నా తేడాలొచ్చాయా అని మూడు numci ఆరు నెలలకొకసారి కంటి డాక్టరు వద్ద పరీక్ష చేయించుకోవాలి. ముందే కళ్ళద్దాలు ఉన్నవాళ్లు, పైన చెప్పిన కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ జాగ్రత్త పాటించాలి.

కళ్లు

ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడవచ్చు?

2 సంవత్సరాల లోపు - పూర్తిగా నిషిద్ధం

2-5 సంవత్సరాలు - ఒక గంట, విజ్ఞాన దాయకమైన వీడియోలు, తల్లిదండ్రులతో కలిసి చూడవచ్చు.

6-12 సంవత్సరాలు - తల్లిదండ్రుల పర్యవేక్షణలో సరదా కోసం ఒక గంట, రోజుకు సగటున

చదువు, క్లాసుల కోసం 3 గంటల వరకు చూదవచ్చు.

12 సంవత్సరాల పైన - కచ్చితమైన సమయపాలన. తింటూ, పడుకొని, ప్రయాణిస్తూ, వాహనాలు నడుపుతూ ఫోన్లు చూడకూడదు. పిల్లలు తినే చోటున, పడకగదిలో ఎటువంటి స్క్రీన్లు ఉండకూడదు.

కంప్యూటర్లను అవసరానికి మించి వాడకుండా దూరం పెడితే, కంటికే కాదు అన్ని రకాలుగానూ మంచిదే. శారీరక వ్యాయామం చేసుకోవచ్చు. ఇంటి పనులు నేర్చుకోవచ్చు. సంగీతం లాంటి కళలపై దృష్టి పెట్టవచ్చు. పుస్తక పఠనంతో జ్ఞానం భాష, ఉచ్ఛారణ మెరుగుపడతాయి. కొత్త మనుషులతో పరిచయాలు అవుతాయి. బంధాలు మెరుగవుతాయి.

ఇలా…. అనంతకోటి ఉపయోగాలు మనకీ, మనచుట్టూ ఉన్న సమాజానికి కూడా.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం.

(అభిప్రాయాలు వ్యక్తిగతం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to protect our eyes from computer and phone screens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X