వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాల నుంచి మన పెట్టుబడిని ఎలా రక్షించుకోవాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్టాక్ మార్కెట్లు

- గతవారం అమెరికా ఫెడ్ పాలసీ సమావేశం అనంతరం వడ్డీ రేట్లు 0.75% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని గంటలలో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ 2% దాకా పడిపోయింది.

- 2018 ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర బడ్జెట్ ప్రకటన జరిగిన కొన్ని గంటల్లో సెన్సెక్స్ 2.5% పడిపోయింది.

- చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు తాము తీసుకున్న నిర్ణయాలు ప్రకటించిన గంటల్లోనే చాలా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి.

- యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన వెంటనే మార్కెట్లు కుప్పకూలాయి.

ఇలాంటి వార్తలు తరుచుగా పత్రికలలో కనిపిస్తుంటాయి. సహజంగానే మార్కెట్ మొత్తంగా పడిపొయినప్పుడు చాలామంది మదుపరులు నష్టాలు చవిచూస్తారు.

కొందరికి నష్టం తక్కువ, మరికొందరికి ఎక్కువ. ఈ పరిణామాల మధ్య మనం చేసిన మదుపు లాభదాయకంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ముందుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు ఒకసారి తెలుసుకుందాం.

మార్కెట్ ఆటుపోట్లను ముందే ఊహించడం చాలా కష్టమైన పని. కానీ ఎక్కువగా ప్రభావితం అయ్యే రంగాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

సరైన సమయంలో మదుపు చేయడం ఎంత కీలకమో.. అలాగే సరైన సమయంలో బయటికి రావడం కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రధానమైన విషయాల మీద అవగాహన కలిగి సరైన మదుపు నిర్ణయాలు తీసుకుని నష్టభయం తగ్గించుకోవాలి.

స్టాక్ మార్కెట్లు

అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్లు

అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల మీద అనేక దేశాల ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి. ఫెడ్ ఏడాదికి ఎనిమిదిసార్లు కీలకమైన వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.

కోవిడ్, ఆర్థిక మాంద్యం లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యేక సమావేశాలు కూడా జరుగుతాయి. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ ఫెడ్ ప్రధాన ధ్యేయం.

ద్రవ్యోల్బణం హద్దు దాటుతుంది అనుకుంటే వడ్డీ రేట్లను పెంచి తద్వారా ద్రవోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇలా వడ్డీ రేట్లను పెంచడం వల్ల వ్యాపార సంస్థలకు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండే డబ్బు (అప్పు) మరింత ప్రియం అవుతుంది. దాని వల్ల వ్యాపార విస్తరణ లేదా కొత్త వ్యాపారాల స్థాపన తగ్గిపోతుంది. ఇది ఉద్యోగావకాశాలను తగ్గిస్తుంది.

అయితే, ఉపాధి అవకాశాలను పెంచడం ఫెడ్ లక్ష్యాలలో ఒకటి. ఇది చూడటానికి కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా అనిపిస్తున్నా ఎప్పటికప్పుడు ఆర్థిక రంగంలో వచ్చే మార్పులకు తగినట్టుగా ఫెడ్ నిర్ణయాలు ఉంటాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణం గురించి తీసుకునే చర్యలు భారతదేశంలో మదుపరులను ఎలా ప్రభావితం చేస్తాయి అనే ప్రశ్న ఈ సందర్భంలో సహజంగా ఉత్పన్నం అవుతుంది.

ప్రపంచీకరణ వల్ల మనదేశంలో ప్రధాన రంగాలు ఏదో ఒక రకంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి. అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులలో భారతీయ కంపెనీలు అనుబంధంగా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్, బయోటెక్ లాంటి రంగాలే కాకుండా అనేక స్టార్టప్ కంపెనీలకు సీడ్ ఫండింగ్, టెక్నాలజీ పరమైన సహాయం అమెరికా నుంచి అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ సంస్థలు తమ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కొత్త నియామకాలు చేపట్టకపోతే అది భారతీయ కంపెనీల మీద కూడా ప్రభావం చూపుతుంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అదే స్థాయికి చేరడానికి సెన్సెస్ రెండేళ్ళకు పైగా సమయం తీసుకుంది.

స్టాక్ మార్కెట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశ ఆర్థిక రంగానికి విధానపరమైన దిక్సూచిలా పనిచేస్తుంది. ఇది కూడా ఫెడ్ లాంటి సంస్థ అయినా కొన్ని మౌలిక పరమైన తేడాలు ఉన్నాయి.

ప్రతీ త్రైమాసికం చివరన ఆర్బీఐ ప్రకటించే వడ్డీ రేట్ల వల్ల దాదాపు అన్ని మదుపు మార్గాలు ప్రభావితం అవుతాయి. స్టాక్ మార్కెట్లో ఉండే మదుపు మార్గాలే కాకుండా ఫిక్సిడ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ లాంటివి కూడా ఆర్బీఐ నిర్ణయాల వల్ల ఒడిదొడుకులకు లోనవుతాయి. కాబట్టి ఆర్బీఐ తీసుకునే విధాన పరమైన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

మరోవైపు ఒక మదుపరి కోణంలో చూస్తే ఆర్బీఐ చేసే మేలు ఇంతా అంతా కాదు. మన బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎన్నో జాగ్రత్తలు ఆర్బీఐ తీసుకుంటుంది. ఈ కారణం వల్ల బ్యాంకింగ్ రంగం మదుపుకు ఎంతో ఆకర్షణీయంగా మారింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కోవిడ్ పరిస్థితులకు మునుపు బీఏసీ బ్యాంక్ ఇండెక్స్ మిగిలిన అన్ని రంగాలను మించిన ఫలితాలను అందించింది. ఆ ఇండెక్స్ ఆధారంగా నడిచే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన వారికి నష్టభయం చాలా తక్కువ.

స్టాక్ మార్కెట్లు

ఒపెక్ దేశాల నిర్ణయాలు, అంతర్జాతీయ ఘర్షణలు వగైరా

చమురు నిల్వలు ఆధీనంలో ఉన్న ఒపెక్ దేశాలు చమురు రేట్లకు సంబంధించిన నిర్ణయాలు సమయానుకూలంగా ప్రకటిస్తూ ఉంటారు. వీటి వల్ల మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లలో మార్పులు వస్తుంటాయి.

వీటి ప్రభావం రవాణా, మౌలిక వసతుల కల్పన రంగం మీద అధికంగా ఉంటుంది. పెట్రో రేట్ల వల్ల ఎల్&టీ లాంటి కంపెనీల లాభదాయకతలో మార్పులు వస్తుంటాయి. ఈ రంగాలలో మదుపు చేసేవారికి ఈ అవగాహన చాలా ముఖ్యం.

మరోవైపు అంతర్జాతీయ ఘర్షణల వల్ల కూడా పెట్రోలియం లాంటి రంగాలలో అనేక మార్పులు వస్తుంటాయి. ఈ రంగాలలో మదుపు చేసేవారికి ఇది చాలా కీలకం.

ఇప్పుడు మన పోర్ట్‌ఫోలియో లాభదాయకత గురించిన కొన్ని మౌలికమైన విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. గతంలో ఎన్నో సార్లు చెప్పినట్టు మన పోర్ట్‌ఫోలియో లాభదాయకతను దెబ్బ తీసే అవకాశాం కేవలం రెండు అంశాలకు మాత్రమే ఉంది:

1. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను

ప్రస్తుతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ టాక్స్ (LTCG) పెరుతో 10% కడుతున్నాం. ఈ టాక్స్ విషయంలో ఇప్పట్లో మార్పులు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

2. ద్రవోల్బణం

ద్రవ్యోల్బణం పెరిగితే అది నేరుగా మన ఖర్చుల మీద ప్రభావితం చూపుతుంది. తద్వారా మనం మదుపు చేసే మొత్తాన్ని కూడా తగ్గించగలుగుతుంది. ద్రవోల్బణం 6% ఉంటే మన దగ్గర ఉండే లక్ష రూపాయల విలువ పదేళ్ళ తర్వాత యాభై మూడు వేలకు పడిపోతుంది. అది ద్రవ్యోల్బణం శక్తి. దురదృష్టవశాత్తు ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.

అంతే కాక అంతర్జాతీయ పరిణామాలు కొన్ని రంగాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. ఉదాహరణకు ఖనిజాలు, వాటి అనుబంధ రంగాలు బీజింగ్ ఒలింపిక్స్ వల్ల పెరిగిన డిమాండ్ కారణంగా చాలా లాభదాయకమైన ఫలితాలు చూశాయి. కానీ ఆ తర్వాత ఆ స్థాయి ఫలితాలు సాధించలేకపోతున్నాయి.

బఫెట్ వ్యూహం

పైన చెప్పిన అంశాలన్నీ ఏదో ఒక స్థాయిలో మన మదుపును ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన పోర్ట్‌ఫోలియో లాభదాయకత తగ్గకుండా ఎలా ఉండాలి అనేదానికి సమాధానంగా బఫెట్ గారి అగడ్తా (మోట్) ఉదాహరణను అర్థం చెసుకోవాలి.

ఒక కోటకు చుట్టూ లోతుగా తవ్విన కందకాన్నీ మోట్ (అగడ్త) అంటారు. అంటే బయటి శక్తులు కోటలోకి ప్రవేశించాలంటే ఎంతో దుర్లభమైన అగడ్తా దాటుకుని రావాలి. బఫెట్ గారి సూచన ప్రకారం మన పోర్ట్ ఫోలియో కూడా అలానే ఉండాలి.

అంటే ఫెడ్ విధానపరమైన నిర్ణయాలు, ఒపెక్ దేశాల నిర్ణయాలు ప్రభావితం చేయలేని విధంగా మన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఉదాహరణకు బఫెట్ గారికి కోకాకోలా కంపెనీలో ఐదు శాతం వాటా ఉంది. గత ముప్పై ఏళ్ళుగా ఆయన ఇందులో ఆయన ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఆయన చెప్పిన అగడ్త(మోట్). ఎందుకంటే కోకాకోలా కంపెనీకి డిమాండ్ తగ్గే అవకాశం లేదు. ఆ కంపెనీ అమ్మకాల మీద ఎలాంటి బయటి సంఘటనల ప్రభావం ఉండదు.

అలాగే రాకేష్ ఝంఝన్ వాలా టైటాన్ కంపెనిలో తన వాటాను పదేళ్ళకు పైగా అట్టిపెట్టుకున్నారు. టైటాన్ సంస్థలో భాగమైన తనిష్క్ తమ వ్యాపారానికి ఎలాంటి ఆర్థిక మాంద్యం కానీ ఒడిదొడుకులు కానీ లేవని ప్రకటించింది.

అలాగే ఎఫ్ఎంసీజీ రంగానికి కూడా ఎప్పుడు డిమాండ్ తగ్గకుండా ఉంటుంది. ఇలా ఎప్పుడూ డిమాండ్ ఉండే రంగాలలో మదుపు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో లాభదాయకత దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to protect our investment from international financial crises?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X