గుప్తనిధి కోసం బాలుడి బలి: ముక్కలు చేసి తిన్నారు
నాగ్‌పూర్: మహారాష్ట్రలో కొందరు దుండగులు మూఢనమ్మకాలతో దారుణానికి ఒడిగట్టారు. గుప్త నిధుల కోసం ఓ తొమ్మిదేళ్ల బాలుడ్ని బలిచ్చారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి తిన్నారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. రూపేశ్ హిరామూలే(9) అనే బాలుడు గత వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ అనుమానితులను పట్టుకున్నప్పుడు ఈ దారుణం వెలుగు చూసిందని వార్దా పోలీస్ స్టేషన్‌లోని ఓ అధికారి చెప్పారు.

వార్దా జిల్లాలోని దివోలి గ్రామంలో అసిఫ్ షా అలియాస్ మున్నా పఠాన్(47) పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. కొంత కాలం కిందట పొలంలో గుప్తనిధి ఉందన్న నమ్మకంతో దానిని వెలికి తీసేందుకు మరో ఐదుగురితో కలిసి ఓ కార్యక్రమం నిర్వహించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో మనిషిని బలివ్వాలని వారందరూ కలిసి నిర్ణయించుకున్నారు.
బాలుడ్ని హత్య చేసిన ప్రధాన నిందితుడు మున్నా పఠాన్, ఇతర నిందితులైన ఉత్తమ్ పొహానే, అంకూష్ గిరి, సురేష్ ధానోర్, దిలిప్ భోగె, దిలిప్ ఖంకర్‌లపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. మున్నా పఠాన్‌ను నవంబర్ 24 వరకు, మిగతా ఐదుగురు నిందితులను నవంబర్ 20వరకు న్యాయస్థానం పోలీసు కస్టడీకి పంపింది.
ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మిడిగేసి హొబళీ చీలనహళ్లి గ్రామ సమీపంలో పొదల్లో దాగి వున్న ఎలుగుబంటి, ఇంటి నుంచి పొలానికి బయల్దేరిన సొమన్న(45)పై దాడి చేసింది.
బాధితుడి కేకలు విని ఘటనా స్థలికి చేరుకున్న తిమ్మన్న, రంగప్పపై కూడా ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది. సోమన్న ఘటనా స్థలంలోనే మృతి చెందగా తిమ్మన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నమూశాడు. చికిత్స కోసం రంగప్పను జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పొదల్లో ఉన్న ఎలుగుబంటిని కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications