టెన్షన్: నినాదంతో బస్సెక్కిన కిరణ్: అడ్డుకున్నమంత్రులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా సాగింది. జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసేందుకు ఎపి భవన్ నుండి బయలుదేరుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కిరణ్ తన కాన్వాయ్‌లో బయలుదేరగా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర కాంగ్రెసు నేతలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ముందు బైఠాయించారు.
మంత్రులు శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి, డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ తదితరులు ఆయన వాహనం ముందు బైఠాయించారు. దీంతో కిరణ్ తన వాహనం దిగి అక్కడే అంతకుముందు ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కారు.

ఆయన జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ బస్సెక్కారు. బస్సు ముందు కూడా తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు నేతలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి పక్కకు తప్పించారు. ఈ సమయంలో పోలీసులు, తెలంగాణ ప్రాంత నేతలకు మధ్య తోపులాట జరిగింది. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు కూడా తెలంగాణ నేతలను అడ్డుకున్నారు.
ఈ సమయంలో తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి జంతర్ మంతర్ వద్దకు బయలుదేరారు. కిరణ్, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మౌన దీక్ష చేయనున్నారు. బస్సులో కిరణ్, బొత్స, మంత్రులు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications