రజనీ తేల్చేశారు: ఎలాంటి సంచలనం లేదు.. 'నో పాలిటిక్స్'
ఊహాగానాలన్నింటిని పటాపంచలు చేస్తూ రజనీకాంత్ మరోసారి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు.
చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాలపై తమిళ ప్రజలంతా ఒకింత అసహనంతో ఉన్నారు. అన్నాడీఎంకె కుమ్ములాటలు, అనిశ్చితి రాజకీయాలతో విసిగిపోయిన చాలామంది ప్రజలు.. తమ కొత్త నాయకుడిని 'రజనీకాంత్' రూపంలో ఊహించుకున్నారు. ఆయనైతేనే తమను సమర్థవంతంగా నడిపించగలరన్నది చాలామంది విశ్వాసం.
ఎవరి ఊహాగానాలు, అంచనాల మాటెలా ఉన్నా.. రజనీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీని పలుమార్లు ఖండిస్తూనే వచ్చారు. ఇలాంటి తరుణంలో ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నైకి తరలిరావాలని రజనీ నుంచి పిలుపు వెళ్లడం.. మరోసారి ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తిని రేకెత్తించింది. తలైవా ఇక పొలిటికల్ ట్రాక్ ఎక్కడం ఖాయమని, మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఈ ఊహాగానాలన్నింటిని పటాపంచలు చేస్తూ రజనీకాంత్ మరోసారి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. అభిమానుల సమావేశాన్ని వాళ్లే ఏర్పాటు చేసుకున్నారని, ఆరోజు వారిని కలుసుకోవాల్సి ఉన్నా.. వేరే కార్యక్రమాల వల్ల వీలు కావడం లేదని తెలిపారు. ఈ నెల 11-16మధ్య వారిని కలుసుకుంటానని పేర్కొన్నారు.
అభిమానులు తనతో ఫోటో దిగేందుకే ఈ సమావేశం ఉంటుందని తెలియజేశారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఏదో సంచలన వార్త వెలువడబోతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. కాగా, శుక్రవారం నాడు చెన్నై పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధాని మహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ పోయెస్ గార్డెన్‌లోని రజని ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications