దీదీ ప్రత్యర్థి ప్రియాంక ఫస్ట్ రియాక్షన్-నేను పుట్టింది,పెరిగింది అక్కడే-ఓటమి భయంతోనే మమతా అలా చేశారు...
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై ప్రియాంక టిబ్రేవాల్ స్పందించారు. భవానీపూర్‌లో తన పోటీ పెద్ద విషయమేమీ కాదని... తన పోరాటమంతా టీఎంసీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైనే అని ప్రియాంక పేర్కొన్నారు. బెంగాల్‌లో గత ఐదు నెలల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో... బాధితులకు న్యాయం చేసేందుకు తానెంతలా పోరాడుతున్నానో ప్రజలకు తెలుసన్నారు.
భవానీపూర్ ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు,తనకు భవానీపూర్ కొత్తేమీ కాదని... అది తన జన్మస్థలమని చెప్పారు. భవానీపూర్ వీధుల్లో ఆడుకుంటూ తాను పెరిగానని... ఆ ప్రాంతమంతా తనకు తెలుసునని అన్నారు.

ఓటమి భయంతోనే మమత అలా : ప్రియాంక టిబ్రేవాల్
తన రాజకీయ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ భవానీపూర్ వదిలి నందిగ్రామ్ నుంచి పోటీ చేశారని... ఇప్పుడు మళ్లీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. భవానీపూర్‌లో ఓటమి భయంతోనే మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారని చెప్పారు. గతంలో ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ వార్డుల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. స్థానిక ప్రజల్లో మమత పట్ల వ్యతిరేకత ఉందని... చూద్దాం... ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా బెంగాల్ ప్రజల కోసమే నిరంతరం పోరాడుతున్నానని... ఆ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజలు తన వైపే ఉంటారని....
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరగనున్న ఉపఎన్నికలో ముఖ్యమంత్రి,టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్‌ను ఇక్కడి నుంచి బరిలో దింపనున్నట్లు తెలిపింది. నాలుగు నెలల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రియాంక... టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్ చేతిలో 58,257 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2014లో బీజేపీలో చేరినప్పటి నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక.. ఎక్కడా విజయం సాధించలేకపోయారు.అయితే టీఎంసీ హింస రాజకీయాలకు ముగింపు పలింకేందుకు తాను కంకణం కట్టుకున్నానని... ప్రజలు తన వైపే ఉంటారని ఆమె ధీమాగా చెబుతున్నారు.

ఎవరీ ప్రియాంక టిబ్రేవాల్
ప్రియాంక టిబ్రేవాల్(41) థాయిలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అంతకుముందు,ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ చదివారు. న్యాయశాస్త్రం కూడా చదివిన ప్రియాంక... ప్రస్తుతం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో న్యాయవాదిగా ఉన్నారు. గతంలో మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకి లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు. 2014లో ప్రియాంక బీజేపీలో చేరారు. బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై టీఎంసీపై అభియోగాలు మోపుతూ ప్రియాంక కోల్‌కతా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.

శోభన్ దేవ్ రాజీనామా.. మమత కోసం త్యాగం...
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థి శోభన్‌దేవ్ బీజేపీ అభ్యర్థి రుద్రనీల్ ఘోష్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. నందిగ్రామ్‌లో మమత బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిపై ఓడిపోవడం... ఆర్నెళ్లలో చట్టసభలకు ఎన్నిక కాకపోతే మమత పదవికి గండం ఏర్పడటంతో... భవానీపూర్ నుంచి పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీంతో శోభన్ దేవ్ మమత కోసం త్యాగం చేయక తప్పలేదు. సెప్టెంబర్ 30న భవానీపూర్ ఉపఎన్నిక జరగనుండా అక్టోబర్ 3న కౌంటింగ్ జరగనుంది. భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి.

భవానీపూర్‌లో ఓటర్లు ఎంతమంది...
భవానీపూర్‌లో మొత్తం 2,06,389 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95,143 మంది స్త్రీలు. అంటే అక్కడి జనాభాలో దాదాపు 46శాతం. సౌత్ కోల్‌కతాలో ఉన్న ఈ ప్రాంతంలో మధ్యతరగతి బెంగాలీలు ఎక్కువగా ఉంటారు. గతంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 2011 నుంచి టీఎంసీ కంచుకోటగా మారింది. 2011,2016,2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపట్లేదు.

ఉపఎన్నికపై అనుమానాలు వ్యక్తమైనా...
ఒకానొక దశలో బెంగాల్‌లో ఉపఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చుననే ప్రచారం జోరుగా సాగింది. మమత బెనర్జీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ ఎన్నికలు వాయిదా వేయించవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమతా బెనర్జీ... తిరిగి ఆర్నెళ్ల లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయితేనే ఆ పదవిని నిలుపుకోగలుగుతారు.
బెంగాల్‌లో శాసనమండలి లేదు కాబట్టి తప్పనిసరిగా మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ సాకుతో ఎన్నికలను వాయిదా వేయించగలిగితే మమతా బెనర్జీని కొద్ది నెలలైనా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించవచ్చునని బీజేపీ భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించడంతో అనుమానాలన్నీ పటాపంచాలయ్యాయి.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం
ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో బీజేపీ బరిలో దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు తమదే అధికారమనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేశారు. అయితే చివరకు,బెంగాల్ ఓటర్లు మాత్రం మమత వైపే నిలబడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం బెంగాల్‌లోనే 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం... ఉద్దేశపూర్వకంగా మమతను టార్గెట్ చేస్తున్నారనే సంకేతాలను జనంలోకి పంపించింది.
ఎన్నికల సమయంలో కాలికి గాయమైనా... మమతా బెనర్జీ తన దూకుడు తగ్గించలేదు. మొత్తంగా 292 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎంసీ ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావించినా.. ఫలితాలు ఏకపక్షంగానే వెలువడ్డాయి. వామపక్ష కూటమి, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి.మొత్తంగా 294 నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు కరోనాతో మరణించడంతో ఎన్నికలు నిర్వహించలేదు.












Click it and Unblock the Notifications