మహా శక్తివంతుడ్ని, ప్రభుత్వాన్ని కూల్చగలను: 'సాక్షి'
హృషికేశ్: బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ హిందూ జతీయవాద డిమాండ్‌ను విస్మరిస్తే ఏమవుతుందో ఆయన చెప్పారు. నీటిలో పడవను నడపడాన్ని ఉదహరిస్తూ ఆయన తన వ్యాఖ్యలతో దుమారం రేపారు.
మోడీ పడవ నడిపేవాడిగా వ్యవహరించాలని, ఓ తెడ్డుతో ఆర్థిక వ్యవస్థను, మరో తెడ్డుతో హిందూ ఎజెండాను ముందుకు తోస్తూ పడవను నడిపించాలని ఆయన అన్నారు. లేకపోతే పడవ వలయంలో గింగిరాలు కొడుతుందని ఆయన అన్నారు.

మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి, హిందూ మత మనుగడకు హిందూ మహిళలు నలుగురు పిల్లలను కనాలని, ఇతర మతాల్లో చేరేవారికి మరణశిక్ష విధించే చట్టం తేవాలని - ఇలా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సాక్షి మహరాజ్ ఎప్పటికప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు.
తాను చాలా బలవంతుడిననే విషయం తనకు తెలుసునని, తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనూ కూల్చగలనూ అని ఆయన అన్నారు. మోడీ కూడా చాటుగా తన అభిప్రాయాలనే వెల్లడిస్తారని ఆయన అన్నారు. తేడా ఏమిటంటే మోడీ కాస్తా రిఫైన్ అయ్యారని, తాము ముతకగా ఉన్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications