నేను సైనికుడిని, విచారం లేదు: బెంగళూరు టెక్కీ మెహిదీ
బెంగళూరు: తాను సైనికుడిని, మెసెంజర్‌ని అని ఇస్లామిక్ స్టేట్ ట్విట్టర్ ఖాతా నిర్వాహకుడు, బెంగళూరు కంపెనీ ఎగ్జిక్యూటివ్ మెహిదీ మస్రూర్ బిశ్వాస్ అన్నాడు. తాను చేసిన పనికి ఏ మాత్రం విచారించడం లేదని అతను అన్నాడు. ఈ మాటలను ఆయన ఓ న్యాయవాదితో బెంగళూరు సివిల్ కోర్టు ఆవరణలో గురువారంనాడు ఓ న్యాయవాదితో అన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐఎస్ఐఎస్ ట్విట్టర్ ఖాతా నిర్వహణకు గాను మెహిదీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనికి కోర్టు 15 రోజుల కస్టడీ విధించింది. ఇదంతా ఎందుకు చేశావు అని ఓ న్యాయవాది కోర్టు వెలుపల అడిగితే, అందుకు తాను విచారించడం లేదని మెహిదీ అన్నట్లు వార్తలు వచ్చాయి.
మెహిదీ తల్లిదండ్రులు కూడా కోర్టుకు వచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో పుట్టి పెరిగిన మెహిదీ బెంగళూరులోని ఓ బహుళ జాతి కంపెనీలో పనిచేస్తూ వచ్చాడు. శనివారంనాడు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఐదు రోజుల కస్టడీ పూర్తి కావడంతో మెహిదీని పోలీసులు గురువారంనాడు కోర్టులో హాజరు పరిచారు.

గురువారం సాయంత్రం కోర్టు సముదాయం క్రిక్కిరిసిపోయింది. క్రైం బ్రాంచ్ ఎసిపి తమ్మయ్య సారథ్యంలోని పది మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు సాదా దుస్తుల్లో మెహిదీతో పాటు ఐదు వాహనాల్లో కోర్టుకు వచ్చారు. మెహిదీ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు హాల్ న్యాయవాదులతో క్రిక్కిరిసిపోయింది.
మరో 25 రోజుల కస్టడికీ మెహిదీని అప్పగించాలని తమ్మయ్య కోరారు. కోర్టు 15 రోజుల కస్టడికీ అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశం బయటకు మెహిదీని తీసుకుని వెళ్లకూడదని కోర్టు పోలీసులను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన మెహిదీని పోలీసులు ఇదే కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది.
నిర్దోషిగా బయటకు వస్తాడు..
ఈ దేశంలోని చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తమ కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం ఉందని మెహిదీ మస్రూర్ తండ్రి మైఖేల్ బిశ్వాస్ అన్నారు. మెహిదీని పోలీసులు కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు మైఖైల్, ఆయన భార్య ముంతాజ్ బేగం కోర్టు హాల్‌లో ఉన్నారు.
తాము ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదని, తనకు ట్విట్టర్ వంటివేమీ తెలియదని, అయితే తమ కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం ఉందని, తమ కుమారుడు ఆదర్శాల కోసం పనిచేస్తాడని మైఖేల్ అన్నారు. కరడుగట్టిన నేరస్థుడిగా తమ కుమారుడిని చూడడం బాధ కలిగిస్తోందని, అతన్ని మానసికంగా హింసించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications