నేనైతే మా అమ్మను రోజూ కలుస్తాను: ప్రధాని ట్వీట్ పై కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే ఏ అవకాశాన్ని వదులుకోరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రధానిని విమర్శించేందుకు తాజాగా ఆయనకు మరో ఆయుధం దొరికింది.
'ఈ రోజు యోగా చేయలేదు.. ఆ సమయంలో నా తల్లి తో కలిసి అల్పాహారం తీసుకున్నా..' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ట్వీట్ పై కూడా సీఎం కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
తానైతే రోజూ తన తల్లిని కలుసుకుంటానని, తన తల్లి తన ఇంట్లోనే ఉంటుందని, ప్రతిరోజూ ఆమె ఆశీర్వాదాలు తానూ తీసుకుంటానని కేజ్రీవాల్ ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేసారు.

అసలు హిందూ మాట గ్రంథాల ప్రకారం, తల్లిని, భార్యను ప్రతి వ్యక్తి తనతో ఉండనివ్వాలని పేర్కొంటూ... ' ఇప్పుడు మీ ఇల్లు పెద్దదేగా, కనీసం ఇప్పుడైనా మీ తల్లిని మీతో ఉంచుకోండి..' అంటూ కేజ్రీవాల్ తన ట్వీట్ లో సూచించారు.
అంతేకాకుండా, ప్రధాని మోడీ తన తల్లిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత మోడీ తల్లి హీరాబెన్ తన వద్ద నున్న రూ.4,500 లను బ్యాంకుకు తీసుకెళ్ళి కొత్తనోట్లుగా మార్చుకున్న ఉదంతం తెలిసిందే.
దానిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ గుర్తు చేస్తూ.. తానైతే తన తల్లిని ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం బ్యాంక్ క్యూలో నిలబెట్టనని, అంతగా అవసరమైతే తానే లైన్ లో నిలుచునేవాడినని పరోక్షంగా మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications