ఐఏఎస్‌లు మౌఖిక ఆదేశాలను వినొద్దు: సుప్రీంకోర్టు

అధికారుల బదిలీలు, పోస్టింగ్ ఇవ్వడంలో అవినీతి, లంచగొండితనం, రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సివిల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు అలాంటి ఒక బోర్డును మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు స్థిరమైన కాల పరిమితులను కలిగి ఉండాలని పేర్కొంది.
తరచూ అధికారులను బదిలీ చేయడాన్ని నిరోధించడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు, ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ సంస్కరణల కారణంగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య వృత్తి పరమైన విధానాలను మెరుగుపర్చడం సాధ్యమవుతుందని పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్, క్రమశిక్షణ పరమైన చర్యలను నియంత్రించేందుకు ఓ చట్టాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు పార్లమెంటును కోరింది.
అధికారులు ప్రభుత్వ అధిపతుల మౌఖిక ఆదేశాలతో స్పందించకూడదని, అలాంటి ఆదేశాలు అవినీతిని పెంచే విధంగా ఉంటాయని కోర్టు తీర్పులో పేర్కొంది. ఒక వేళ ఐఏఎస్ అధికారులు వారి మౌఖిక ఆదేశాలతో స్పందించినట్లయితే వాటిని నమోదు చేయాలని, లేదంటే సమాచార హక్కు చట్టం తెచ్చి కూడా వృథాయే అవుతుందని కోర్టు పేర్కొంది.
సుప్రీం కోర్టు ఓ మైలురాయి లాంటి తీర్పును వెలువరించిందని మాజీ కేబినెట్ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రజా సేవకులు మాత్రమేనని, ప్రైవేటు సేవకులు కాదని, ప్రభుత్వం వారిని స్వప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో దుర్గాశక్తి నాగ్‌పాల్, హర్యానా రాష్ట్రంలోని అశోక్ ఖేమ్కా లాంటి ఐఏఎస్ అధికారుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందె.












Click it and Unblock the Notifications